సూర్యాపేట, జనవరి 25 (నమస్తే తెలంగాణ) : అధికారుల నిరక్ష్యం వల్ల సూర్యాపేట మున్సిపాల్టీలో విచిత్ర పరిస్థితి ఎదురైంది. అధికార పార్టీ కుట్రో లేక అధికారుల తప్పిదమో తెలియదు కానీ అనేక వార్డుల్లో జనాభా కంటే ఓటర్ల సంఖ్యే అధికంగా ఉంది. 48 వార్డులు ఉన్న మున్సిపాలిటీలో 18 ఏండ్ల లోపు వారు కేవలం 12వేల మంది. దీంతో కొంతమంది ఓటరు జాబితాలో చోటు చేసుకున్న పొరపాట్లపై కోర్టులో కేసు వేయడంతో అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు తలెత్తుతున్నాయి.
కాగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే వంద శాతం పూర్తి చేయకపోవడం వల్ల ఇలాంటి తప్పిదాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తున్నది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో అధికారులు అలసత్వం వహిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓటర్ల జాబితా విషయంలో అనేక తప్పులు దొర్లినా కనీసం పట్టించుకోలేదు. ముసాయిదా ఓటర్ల జాబితాను రాజకీయ పార్టీలకు అందించకుండా డాష్ బోర్డులో పెట్టి చేతులు దులుపుకోవడం.. అప్పటికే రిజర్వేషన్లు ఎలా ఉంటాయో తెలియక ఆశావహులు పట్టించుకోకపోవడం, ఓటర్లు తమ ఓటు ఎక్కడుందో చూసుకోకపోవడంతో పక్షం రోజుల తరువాత జాబితాలో తప్పులు ఏ స్థాయిలో ఉన్నాయో అనే విషయం కొద్దిమంది కోర్టుకు వెళితే తేలింది.
కొత్తవి చేరిస్తే సరిపోయేది..
వాస్తవానికి 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల నాటి ఓటరు జాబితాను, అవే బౌండరీలను తీసుకొని కొత్తగా వచ్చిన ఓటర్లను ఆయా వార్డుల్లో చేరిస్తే ఎలాంటి సమస్య ఉండేదికాదు. కానీ 2025 అక్టోబర్ నాటికి పూర్తయిన ఓటరు జాబితాలో ఇష్టారాజ్యంగా మార్పులు చేసి తప్పుల తడక చేశారు. కొన్ని అభ్యంతరాలు స్వీకరించి సరి చేసినా గత ఎన్నికల్లో బాగానే ఉన్నందున ఎలాంటి సమస్య ఉండదని పట్టణ ప్రజలు, రిజర్వేషన్లు కలిసి వస్తాయో రావో అనే ఆందోళనలో ఉన్న ఆయా పార్టీలకు చెందిన ఆశావహులు అభ్యంతరాలపై ఫిర్యాదు చేయలేదు. దీంతో వారు ఫైనల్ జాబితా చూసి అవాక్కవుతున్నారు.
ఉత్సవ విగ్రహాలుగా వార్డు ఆఫీసర్లు..
వార్డుల్లో పని చేయాల్సిన వార్డు ఆఫీసర్లు ఉత్సవ విగ్రహాలుగా మారి సరిగా పని చేయకపోవడం వల్ల అనేక అనర్థాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఉదయం ఐదు గంటలకు విధుల్లోకి వెళ్లి శానిటేషన్ నుంచి మొదలు కుంటే పన్నులు వసూలు చేయడం, వార్డులో చనిపోయిన వారిని గుర్తించడం తదితర అన్ని పనులు చేయాలి. కానీ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో.. ఎవరూ సరిగా విధుల్లోకి రావడం లేదని తెలిసింది. ప్రధానంగా వారికి వార్డుల బౌండరీలు కూడా తెలియవని అందుకే జాబితాలో తప్పులు దొర్లాయని తెలుస్తున్నది. రెవెన్యూ శాఖ నుంచి 2025 అక్టోబర్ నాటి ఓటరు జాబితా మున్సిపాలిటీకి పంపగా.. బీఎల్వోలు ఆ జాబితాలో చనిపోయిన వారిని తొలగించకపోవడం, అనర్హులను తీసివేయకపోవడంతో చనిపోయిన ఓటర్ల పేర్లు కూడా జాబితాలో ఉన్నట్లు సమాచారం.
వార్డు అధికారులు ఏడాది కాలంగా విధులు నిర్వర్తించకపోగా కేవలం ఓటరు జాబితా మాత్రమే రూపొందించారట. వార్డులపై అసలు అవగాహన లేకపోవడం, బౌండరీలు తెలియకపోవడంతో తప్పులు దొర్లాయని అధికారులు గుర్తించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అందుకే ఓటరు జాబితాలో కనీవినీ ఎరుగని రీతిలో తప్పులు దొర్లాయంటూ కొందరు కోర్టుకు వెళ్లారు. కోర్టు ఆదేశాల మేరకు తప్పులు సరి చేయాల్సి ఉండగా ఇప్పటికైనా 2020 జనవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓటరు జాబితాకు కొత్తగా వచ్చిన ఓటర్లను ఆయా వార్డుల్లో కలిపితే సరిపోతుందని గతంలో విధులు నిర్వర్తించిన సిబ్బంది చెబుతున్నారు. కోర్టు ఆదేశాలపై కలెక్టర్ ఏ మేరకు స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.
అధికారుల నిర్లక్ష్యం
ఓటరు జాబితాలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. చనిపోయిన వారితో పాటు అనర్హుల ఓట్లను తొలగించకపోయినా అనేక వార్డుల్లో జనాభా కంటే ఓటర్లే అధికంగా ఉండడం విస్మయం కలిగిస్తోంది. పట్టణంలోని7,9,21,22,26,30,31,333,34,37,38,40,41,42,43,44,45,48 వార్డుల్లో జనాభా తక్కువగా ఉంది. వాస్తవానికి సూర్యాపేట మున్సిపాలిటీలో 45 వేల కుటుంబాలు, 1.60 లక్షల జనాభా ఉంది. కానీ 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సామాజిక కుల సర్వే ప్రకారం 1.20 లక్షల జనాభా,1,08,840 మంది ఓటర్లు ఉన్నారు. అంటే ఈ లెక్కన మున్సిపాలిటీలో 1 నుంచి 18 సంవత్సరాల లోపు ఉన్న వారి సంఖ్య కేవలం 12 వేల మంది మాత్రమే. ఈ లెక్కన సర్వే వంద శాతం చేయలేదని, అది తప్పుడు సర్వే అనేది నిర్ధారణ అవుతుంది.