మిర్యాలగూడ, జూలై 9 : ‘మామయ్యా నేను మీ బంధువును.. నీకు అల్లుడునవుతా… ఆసుపత్రిలో అత్యవసరంగా డబ్బులు అవసరం ఉన్నాయి. డబ్బులు పంపించు తిరిగి మళ్లీ ఇచ్చేస్తా’ అంటూ అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తున్నాడు ఓ కేటుగాడు. ఇలా ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు ఏకంగా వందలాది మందికి ఫేక్ కాల్స్ చేస్తూ వారితో మాట్లాడి డబ్బులు మినీ బ్యాంక్ అకౌంట్లో, పెట్రోల్ బంక్‌లకు వేయించుకొని ఎక్కడా దొరుకకుండా జాగ్రత్తలు తీసుకుంటూ మోసాలకు పాల్పడుతున్నాడు.
ఇలా మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఓ రియల్టర్ మోసగాడి మాటలను నమ్మి రూ.50 వేలు ఓ మినీ బ్యాంక్ ఏటీఎంకు పంపాడు. అంతటితో ఆగకుండా రూ.20 వేలు పంపాలని సదరు మోసగాడు కోరగా అనుమానం వచ్చిన బాధితుడు పూర్తి సమాచారం తెలుసుకొని ఫోన్ కట్ చేశాడు. తాను మోస పోయానని తెలుసుకున్న బాధితుడు మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయనకు వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా దర్యా ప్తు చేపట్టిన పోలీసులకు దిమ్మ తిరిగే కాల్ డేటా లభ్యమైనట్లు తెలిసింది.
అతడి బారిన సుమారు 1500 మంది వరకు పడి ఉంటారని కాల్ డేటా ఆధారంగా తెలుస్తున్నది. ఆ కాల్ డేటా ఓ నంబర్‌కు ఫోన్ చేసిన పోలీసులకు గుంటూరుకు చెందిన బాధితుడు బోరున విలపిస్తూ తాను రూ.90 వేలు పంపానని చెప్పాడని పోలీసులు పేర్కొంటున్నారు. కాగా సదరు మోసగాడు దామరచర్ల మండలం కొండ్రపోల్ వద్ద గల మినీ ఏటీఎం వద్ద అనుమానిత వ్యక్తి తచ్చాడినట్లు సీసీ ఫుటేజీలో గుర్తించినట్లు సమాచారం. ఇప్పటికే మోసగాడిపై పలువురు బాధితులు సైబర్ క్రైం పోలీసులకు సైతం ఫిర్యాదులు చేసినట్లు సమాచారం.
ఫేక్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి
ఫేక్ కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తెలియని వ్యక్తులు ఫోన్ ద్వారా డబ్బులు పంపాలని అడిగితే ఎవరూ స్పందించవద్దు. ఓటీపీ నంబర్లు, వ్యక్తిగత అకౌంట్ల వివరాలను తెలియని వ్యక్తులకు చెప్పవద్దు. ఎవరైనా మోసపోతే వెంటనే పోలీసులకు గానీ, సైబర్ క్రైమ్ పోలీసులకు గానీ ఫిర్యాదు చేయాలి.
-సుధాకర్, మిర్యాలగూడ వన్‌టౌన్ సీఐ