చండూరు, మార్చి 17 : ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే ఆశా కార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 18000/- ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని అలాగే అర్హులైన వారికి సెకండ్ ఏఎన్ఎంలుగా ప్రమోషన్లు కల్పించాలని సీఐటీయూ చండూరు మండల కన్వీనర్ జెర్రిపోతుల ధనంజయ అన్నారు. సోమవారం తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో చండూరు తాసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తాసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా పోరాటాలు నిర్వహించినా స్పందించలేదని ఇకనైనా వెంటనే ప్రభుత్వం స్పందించి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రూ.18 వేలకు పెంచి ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని, పారితోషికం లేని అదనపు పనులు ఆశాలతో చేయించకూడదన్నారు.
ఆశాలకు పని భారం తగ్గించాలని పెండింగ్ లో ఉన్న కరోనా రిస్క్ అలవెన్స్ బకాయి డబ్బులు వెంటనే చెల్లించాలన్నారు. ఆశ వర్కర్స్ కు ప్రమాద బీమా, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, ప్రసూతి సెలవులుపైనా సర్కులర్ ను వెంటనే జారీ చేయాలని, హెల్త్ కార్డ్స్, జాబ్ చార్ట్ విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ సీనియర్ నాయకుడు చిట్టిమల్ల లింగయ్య, రైతు సంఘం మండల కార్యదర్శి ఈరటి వెంకటయ్య, ఆశ వర్కర్స్ యూనియన్ చండూరు మండల అధ్యక్ష కార్యదర్శులు జ్యోతి, కట్ట పద్మ, విజయలక్ష్మి, నాగమణి, పరమేశ్వరి, సిహెచ్ రోజా, లలిత, సుమలత, వేధావతి, నాగమణి, జ్యోతి, జయమ్మ, లక్ష్మి, దుర్గ, స్వప్న, భవాని, రాణి, పద్మ, అలివేలు, సుజాత, సంతోషి, నాగలక్ష్మి పాల్గొన్నారు.