నీలగిరి, ఆగస్టు 28 : నల్లగొండ జిల్లా కేంద్రంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన చింతకింది రమేశ్ (35) గత 10 నెలల క్రితం నల్లగొండకు వచ్చి బీటీఎస్‌లో అద్దె ఇంట్లో భార్య, పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అయితే ఇటీవల తన స్వగ్రామం వడ్డేపల్లిలో ఇందిరమ్మ ఇల్లు రావడంతో అక్కడ బేస్మెంట్ వరకు నిర్మాణం చేశారు. భార్య, పిల్లలు అక్కడే ఉండగా రమేశ్ నాలుగు రోజుల క్రితం తిరిగి నల్లగొండకు వచ్చి డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.
బుధవారం కొంతమంది స్నేహితులతో కలిసి మద్యం సేవించినట్లు సమాచారం. గురువారం ఉదయం పట్టణంలోని కోమటిరెడ్డి ప్రతీక్‌రెడ్డి మెమోరియల్ కాలేజీ ఎదురుగా ఉన్న అన్నపూర్ణ క్యాంటిన్లో రక్తపు మడుగులో పడి విగత జీవిగా కనిపించాడు. స్థానికుల సమాచారం మేరకు వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ ద్వారా వివరాలు సేకరించారు. హంతకులు, హత్యకు గల కారణాలపై పోలీసులు పలు కోణాల్లో విచారణ చేపట్టారు.