సూర్యాపేట, జనవరి 12: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఈ నెల 18 నుంచి ప్రారంభించనున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమవుతున్న కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పక్కగా ప్రణాళికలు తయారు చేశారు. మొదటి విడుత మాదిరిగా రెండో విడుతలో కంటి వెలుగును విజయవంతంగా నిర్వహించేందుకు విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పలు సూచనలు చేశారు. జిల్లాలోని 475 గ్రామ పంచాయతీలు 5 మున్సిపాల్టీల పరిధిలోని 141 వార్డులలో 616 క్యాంప్‌లు నిర్వహించేలా ప్రణాళిక తయారు చేశారు. అందుకు 53 బృందాలను ఎంపిక చేయగా వాటిలోని 36 బృందాలను గ్రామీణా ప్రాం తాలు, 14 బృందాలను అర్బన్ ప్రాం తాల్లో 3 బఫర్ టీంలను కేటాయించారు. జనవరి 18 నుంచి 100 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా 18 యేండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఈ కంటి పరీక్షలు చేయనున్నారు. దాదాపు జిల్లాలో సుమారు 10 లక్షల మందికి కంటి పరీక్షలు చేయనున్నారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే చక చకా ఏర్పాట్లు సాగుతున్నాయి. మంత్రి జగదీశ్‌రెడ్డి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికారులతో సమీక్ష నిర్వహించగా మండల స్థాయిలో సైతం అధికారులు సమీక్షలు , అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి గ్రామంలో, మున్సిపాల్టీ పరిధిలోని వార్డులలో కంటి వెలుగుపై విస్తృత ప్రచారం చేపట్టనున్నారు. కంటి సమస్యలతో బాధపడుతున్న వారందరికీ కంటి పరీక్షలు నిర్వహించి వారికి కావాల్సిన కళ్లజోళ్లు, మందులు, ఆపరేషన్లు చేయించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. 53 బృందాలు ఏర్పాటు చేయగా ఒకొక్క బృందంలో 8 మంది సభ్యులు ఉండనున్నారు.
జిల్లాకు చేరిన మెటీరియల్
కంటి వెలుగు సంబంధించిన మెటీరియల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయానికి చేరుకుంది. సుమా రు కంటి పరీక్షలు చేయడానికి ఉపయోగించే కంటి పరీక్షల మిషన్లు (ఆటో రిఫ్రాక్టోమీటర్)ను జిల్లాకు చేరుకున్నాయి. 50 మిషన్లు డీఎంహెచ్ఓ కార్యాలయం చేరుకోగా వాటిని ఆయా పీహెచ్‌సీలకు పంపించనున్నారు. వీటితోపాటు ఐ డ్రాప్స్, యాంటిబయోటిక్స్ మందులు, విటమిన్, పారాసెటమాల్, బీ కాంప్లెక్స్ మందులు వచ్చాయి. కంటి పరీక్షల అనంతరం దూరం, దగ్గరి చూపు ఉన్నవారికి ఇచ్చేందుకు దాదాపు 43,900 కళ్లజోళ్లు వచ్చాయి. ఇతర కంటి సమస్యలతో ఉన్న వారికి కావాల్సిన కళ్లజోళ్లును ఆర్డర్ చేసి రెండువారాల్లో ఇవ్వనున్నారు. ఈ సారి ఒకరి కళ్లజోళ్లు మరొకరికి వెళ్లకుండా ఆధార్, ఫోన్‌నంబర్ అనుసంధానంతో క్యూఆర్ కోడ్ కేటాయించనున్నారు.
పీహెచ్‌సీల వారీగా శిబిరాలు
సూర్యాపేట జిల్లాలో మండల, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా పని విభజించారు. అందులో భాగంగా 28 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా శిబిరాలు నిర్వహించనున్నారు. కంటి పరీక్షల చేసే బృందాలను సైతం అదే విధంగా కేటాయించారు. జిల్లాలోని 475 గ్రామ పంచాయతీలు 5 మున్సిపాల్టీ పరిధిలో 141 వార్డులు కలిపి 616 ఉండగా క్యాంప్‌లు సైతం 616 చేపట్టడం జరుగుతుంది. జనాభా ఆధారంగా బృందాల సంఖ్యను కేటాయించారు. గ్రామీణ ప్రాంతాల్లో 36, పట్టణ ప్రాంతాల్లో 14 బృందాలు కంటి పరీక్షలు చేయనున్నాయి. ఒక్కొక్క బృందం రోజుకు 120మందికి చొప్పున కంటి పరీక్షలు చేయనున్నారు. 100 రోజుల పాటు పరీక్షలు చేయనున్నారు. వారానికి ఐదు రోజుల పాటు (సోమవారం నుంచి శుక్రవారం వరకు) కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. కంటి వెలుగు పూర్తయ్యే వరకు సిబ్బందికి ఎలాంటి సెలవులు లేవని ఇప్పటికే అధికారులు ప్రకటించారు.