నేరేడుచర్ల, నవంబర్ 22 : ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొత్త సమస్య రైతులను వేధిస్తున్నది. సన్న వడ్లను విక్రయించేందుకు ముందుగా ఒక ప్రత్యేక యంత్రం(క్యాలీబర్)లో వేసి నిర్ధారించుకోవాలి. కానీ ఆ మిషన్‌లో అన్ని రకాల సన్న వడ్లకు అవకాశం లేకపోవడం ఇందుకు కారణం. తాము పండించిన సన్నాల రకం ఈ యంత్రంలో లేకపోతే ఎలాగని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం క్వింటాలు సన్న వడ్లకు రూ. 500 బోనస్ ప్రకటించడంతో చాలా మంది రైతులు దొడ్డు రకాల వరి సాగుకు స్వస్తి చెప్పి సన్నాలకు మొగ్గు చూపారు. ప్రసుత్తం చాలా మంది రైతులు పంట కోసి ధాన్యాన్ని ఆరబెట్టే పనిలో నిమగ్నమయ్యారు. మరికొంత మంది రైస్ మిల్లుకు అమ్ముకున్నారు. ఈ సమయంలో ప్రభుత్వం సన్న రకం వడ్లను కొనుగోలు చేయాలంటే పలు రకాల షరతులు పెట్టడంతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. సన్న రకం వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేయాలంటే వ్యవసాయాధికారులు మిషన్ ద్వారా నిర్ధారించుకోవాలి. అనంతరం కొనుగోలుకు అవకాశం కల్పిస్తారని డీసీఎంఎస్, ఐకేపీ సిబ్బంది చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న షరతులు తట్టుకోలేక సన్నరకం పండించిన చాలా మంది రైతులు కోత మిషన్ల ద్వారా కోయించి నేరుగా రైస్ మిల్లులకు విక్రయిస్తున్నారు.
సన్న రకం ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించడంతో రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దాంతో ఎక్కువగా సన్న రకం వరి సాగు చేశారు. ఏ రకం అయినా సన్న వడ్లు అనగానే ధరలు అధికంగానే ఉంటాయి. దొడ్డు రకాల వడ్లకు గరిష్టంగా రూ. 2,320 వరకు ఉండగా సన్న రకాల వడ్లకు మాత్రం క్వింటాలుకు రూ. 3వేల నుంచి రూ. 3,500 వరకు ఉంటుందని రైతులు అనుకున్నారు. దీనికి తోడు ప్రభుత్వం అందిచే బోనస్‌తో కలుపుకొని సన్నరకాల వడ్లకు ధర మంచిగా వస్తుందని భావించిన రైతులకు నిరాశే మిగిలింది. గత ప్రభుత్వంలో సన్న రకాలను మిల్లర్లు కూడా క్వింటాకు రూ.3వేల నుంచి రూ.3300 వరకు కొనుగోలు చేశారు. ఈ ఏడాది ప్రభుత్వం బోనస్ లేకుండా క్వింటాలుకు రూ. 2,320 ప్రకటించడంతో ప్రైవేటు వ్యాపారులు కూడా ధరలను పూర్తిగా తగ్గించారు. ప్రభుత్వం అందిస్తున్న ధరల కంటే తక్కువగానే కొనుగోలు చేస్తున్నారు. ఇదేంటని రైతులు ప్రశ్నిస్తే ప్రభుత్వం ధరలు తగ్గించడంతో మార్కెట్లో సన్న వడ్లకు డిమాండ్ తగ్గిందని చెబుతున్నారు.
రైతు పండించిన సన్న ధాన్యానికి ఎటువంటి షరతులు లేకుండా బోనస్ చెల్లించాలి. మిషన్ కొలతలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మిల్లుకు సన్న ధాన్యం తీసుకెళ్తే వాళ్లు ఇంకా తక్కువ ధరకు అడుగుతున్నారు. ప్రభుత్వం రైతుల బాధను అర్థం చేసుకొని మిషన్‌తో పని లేకుండా సన్నధాన్యం కొనుగోలు చేయాలి.
-ఎల్లావుల వెంకటేశ్వర్లు, రైతు, గరిడేపల్లి మండలం