మిర్యాలగూడటౌన్, డిశంబర్ 6 : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రైతు ఐక్య ఉద్యమాలు నిర్వహిస్తామని అఖిల భారత కిసాన్‌సభ జాతీయ కార్యదర్శి కృష్ణప్రసాద్, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఈ నెల 13 నుంచి 16 వరకు కేరళ రాష్ట్రంలో జరిగే అఖిల భారత కిసాన్‌సభ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ చేపట్టిన బస్సుజాత సోమవారం మిర్యాలగూడకు చేరుకుంది. స్థానిక సీపీఎం నాయకులు జాత సభ్యులకు స్వాగతం పలికారు. అనంతరం హనుమాన్‌పేట ఫ్లైఓవర్ నుంచి రాజీవ్‌చౌక్ మీదుగా ఈదులగూడలోని సుందరయ్య విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా రైతులు చేసిన ఉద్యమానికి అఖిల భారత కిసాన్‌సభ ప్రాతినిధ్యం వహించిందన్నారు. రైతుల పోరాటానికి తలొగ్గిన మోదీ ప్రభుత్వం చట్టాలను వెనక్కి తీసుకుందన్నారు. దేశవ్యాప్తంగా రైతుల పరిస్థితిని జాతీయ మహాసభలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో కిసాన్‌సభ జాతీయ నాయకులు మాస్టర్ ప్రకాశ్, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్, తీగలసాగర్, సహాయ కార్యదర్శి సుమన్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, కూన్‌రెడ్డి నాగిరెడ్డి, సీఐటీయూ రాష్ట్ర నాయకులు డబ్బికార్ మల్లేశ్, రవినాయక్, డాక్టర్ మల్లు గౌతమ్‌రెడ్డి, భవాండ్ల పాండు, పాదూరి శశిధర్‌రెడ్డి, రాగిరెడ్డి మంగారెడ్డి, పరశురాములు, వరలక్షి, మట్టయ్య, శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.