నందికొండ, ఆగస్టు 18 : శ్రీశైలం నుంచి ఇన్‌ఫ్లో కొనసాతుండడంతో నాగార్జునసాగర్ డ్యామ్ 2 క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల చేస్తున్నారు. డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులకు పూర్తి స్థాయిలో నీరు నిల్వ ఉంది. రెండు క్రస్ట్ గేట్ల ద్వారా 24,920, ఎడమ కాల్వ ద్వారా 6,791, కుడి కాల్వ ద్వారా 8,067, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 29,151, వరద కాల్వ ద్వారా 600, ఎస్ఎల్బీసీ ద్వారా 1,800 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్నది.
శ్రీశైలం నుంచి 71,329 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో సాగర్‌కు అంతే మొత్తంలో అవుట్‌ఫ్లోను కొనసాగిస్తున్నారు. తెలంగాణ టూరిజం కృష్ణా నదిలో ఏర్పాటు చేసిన లాంచీలో నాగార్జున కొండకు, జాలీ ట్రిప్పులకు వెళ్లేందుకు పర్యాటకులు ఆసక్తి కనపరిచారు. నల్లమల అడవుల మధ్య లాంచీ ప్రయాణం బాగుందని పర్యాటకులు తెలిపారు. నదీ తీరంలో పర్యాటకులు సెల్ఫీలు దిగుతూ, లాంచీస్టేషన్ పరిసరాల్లో భోజనాలు చేస్తూ సరదాగా గడిపారు. సాగర్ డ్యామ్, లాంచీ స్టేషన్, బుద్ధవనం పరిసరాలు జనంతో కిటకిటలాడాయి.
సాగర్ నీటిని వృథా చేయకుండా చెరువులు నింపాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి
నార్కట్‌పల్లి, ఆగస్టు 18 : నాగార్జున సాగర్ నీటిని వృథాగా గేట్ల ద్వారా వదలకుండా జిల్లాలోని అన్ని చెరువులు నింపాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రభుత్వానికి సూచించారు. నార్కట్‌పల్లిలోని తన నివాసంలో ఆదివారం విలేకరు సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల రెండు నుంచి ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు భారీగా వరద నీరు వస్తుండగా అధికారులు గేట్ల ద్వారా దిగువకు వదిలి నీటిని వృథా చేస్తున్నారని అన్నారు.
ఈ విషయంపై తాము ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోకుండా అదే తరహాలోనే నీటిని వృథా చేస్తున్నారని తెలిపారు. సాగర్‌కు వచ్చిన నీటితో నల్లగొండ జిల్లాలోని అన్ని చెరువులను కాల్వల ద్వారా నింపి కరువును నుంచి విముక్తి చేయాలని, రైతులను ఆదుకోవాలని కోరారు. సాగర్ ప్రాజెక్టు నుంచి ఖమ్మం నీటిని తీసుకుపోవడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులకు సాధ్యమవుతుందని కానీ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు, చెరువులను మాత్రం నింపి రైతులకు నీటి కష్టాలు లేకుండా చేయాలనే అలోచన ఆ పార్టీ నాయకులకు లేదన్నారు.