సూర్యాపేట, మార్చి 20 (నమస్తే తెలంగాణ)/సూర్యాపేట : బీఆర్ఎస్ పార్టీ 25వ వసంతంలోకి అడుగిడుతున్న వేళ వరంగల్ వేదికగా నిర్వహించ తలపెట్టిన రజతోత్సవ సభ విజయవంతానికి సూర్యాపేటలో నిర్వహించిన సన్నాహక సమావేశం సమరోత్సాహాన్ని ప్రదర్శించింది. పార్టీ అధినేత కేటీఆర్‌కు గులాబీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. జిల్లాస్థాయి ముఖ్యకార్యకర్తల సమావేశం అవడంతో కొద్దిమందికి మాత్రమే ఆహ్వానం ఉండగా, వేలాది మంది తరలిరావడంతో సూర్యాపేట గులాబీమయం అయ్యింది. ముఖ్యంగా ఊహించని రీతిలో రైతులు, యువతీ యువకులు స్వచ్ఛందంగా పెద్దసంఖ్యలో కదిలిరావడం నూతనోత్సాహాన్ని నింపింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఉదయం 11.30 గంటలకు స్థానిక జనగాం క్రాస్ రోడ్డుకు చేరుకున్నారు. కేటీఆర్‌తోపాటు మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి హైదరాబాద్ నుంచి జనగాం క్రాస్ రోడ్డు వద్దకు రాగానే దాదాదపు 5వేల బైక్‌లతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు, యువకులు స్వాగతం పలికారు. జనగాం క్రాస్ రోడ్డు నుంచి సమీపంలోని అంజనాపురి చౌరస్తా వద్దకు చేరుకోగా మరో 2 వేల బైక్‌లు కలిశాయి. అక్కడి నుంచి కొత్త బస్టాండ్ వద్దకు సమీపానికి వచ్చే వరకు ఇంకో 3వేల బైక్‌లు వచ్చిచేరాయి. కొత్త బస్టాండ్ నుంచి 30 ఫీట్ల రోడ్డు వెడల్పులో తెలంగాణ తల్లి, శంకర్ విలాస్సెంటర్ వరకు దాదాపు కిలోమీటరున్నర మేర బండెనక బండిగా ర్యాలీ సాగింది.
దారిపొడవునా రోడ్ల మీద, బిల్లింగుల మీద జనం ఎదురుచూస్తుండడంతో కేటీఆర్ వాహనానికి ఉన్న సన్‌రూఫ్ ఓపెన్ చేసి కేటీఆర్, జగదీశ్‌రెడ్డి బయటకు వచ్చి అభివాదం చేశారు. కేటీఆర్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చేందుకు అనేకమంది పోటీపడ్డారు. 40 డిగ్రీల మండుటెండలోనూ సుమారు నాలుగు కిలోమీటర్ల మేర మూడు గంటలపాటు సాగిన ర్యాలీ మధ్యాహ్నం 1.19 గంటలకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయానికి చేరుకుంది. ర్యాలీలో, సమావేశ ప్రాంగణంలో జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలు మార్మోగాయి.
కేసీఆర్‌కు పోరాటం తెలుసు.. జనాన్ని కాపాడుకోవడం తెలుసు
తెలంగాణ ఉద్యమం కోసం 2001లో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు నాటి ఉమ్మడి రాష్ట్ర పాలకులు, తెలంగాణ ప్రాంతంలోని వారి తొత్తులు జై తెలంగాణ అంటే అవహేళన చేశారు. ఆనాడు చాలా చోట్ల ఊరికి ఒక్కరే జై తెలంగాణ అన్న వారు ఉండగా.. ఒక తల్లి కోడి పిల్లలను కాకులు, గద్దల నుంచి ఎట్లా రెక్కల కింద పెట్టి కాపాడుకుంటదో ఆ పద్ధతుల్లో ఉద్యమకారులను కాపాడుకొని పోరాటాన్ని నడిపించారు. పదుల సంఖ్యలో ఉన్న ఉద్యమకారులను వందలు, వేలు, లక్షల్లోకి చేర్చి తెలంగాణ రాష్ర్టాన్ని ఎలా సాధించారో అందరికీ తెలిసిందే. కాగా నేడు మాయమాటలు, మోసపూరిత వాగ్ధానాలతో గద్దెనెక్కి కొత్త పథకాలు ఇవ్వకున్నా, కనీసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన వాటిని కొనసాగించకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంటే ప్రజలను కాపాడుకోవడం కేసీఆర్‌కు బాగా తెలుసు.
ఆనాడు ఉద్యమాన్ని నిలబెట్టేందుకు ఎవరికి అర్థంకాని పద్ధతుల్లో ఎందుకు రాజీనామా చేస్తుండో, కేసీఆర్ ఎందుకు ఉప ఎన్నికలు తెస్తుండని సమైక్యవాద తొత్తులు అవహేళన చేశారు. కానీ ప్రతి సన్నివేశం, ప్రతి నిమిషం తెలంగాణ చుట్టూ తిప్పాలని గాంధీ చూపిన మార్గంలో, అంబేద్కర్ ఇచ్చిన అవకాశంతో ఆర్టికల్ 3 ద్వారా ఒక వైపు ఉద్యమం, మరో వైపు రాజకీయం కలగలిపి 14సంవత్సరాలు పోరాడి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారు. కేసీఆర్ ఎన్నో అవమానాలను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్ర సాధనను ముద్దాడారు. ఈ దేశంలో ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేసింది టీఆర్ఎస్. జనం దారులు కట్టి సభ్యత్వాలు తీసుకొని నాకు సభ్యత్వం కావాలని అడిగి మరీ తీసుకున్నారు.
ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్ పరిపాలన చేస్తాడా అని కొందరు, తెలంగాణను పడగొట్టాలని మనకు కరెంట్ ఇవ్వకుండా చేసి, మన జెండా దిమ్మెలను కూలగొట్టి మోదీతో కలిసి అవసరం లేక పోయినా ఏడు మండలాలను ఆంధ్రాకు తీసుకుపోయి చంద్రబాబు కుట్రలు చేశారు. హైదరాబాద్‌లో అల్లర్లు సృష్టించాలని కూడా కుయుక్తులు పన్నారు. ఇవాళ చాలా మంది కేసీఆర్ ద్వారా సృష్టించబడిన పదవుల్లో కూర్చొని మాట్లాడుతుండ్రు. ఆనాడు కేసీఆర్ జై తెలంగాణ అంటే కేసీఆర్ వెంట నిలబడితే మాకెమన్న అవుతుందేమోనని పారిపోయిన నాయకులు నేడు అవాకులు చవాకులు పేలుతున్నరు. తెలంగాణను అనేక రంగాల్లో దేశంలో ముందు నిలిపింది కేసీఆర్. ఆనాడు రానే రాదనుకున్న కరెంట్ పోనే పోదనే రీతిన చేశాడు.
గులాబీ జెండా కేసీఆర్ వేరు కాదు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా ఊరికనే చేయలేదు. తెలంగాణ తెచ్చిన నాడు లక్ష రూపాయలు లేని తలసరి ఆదాయాన్ని 3లక్షల కోట్లకు తీసుకొచ్చారు. ఆరేండ్లలో లక్షల ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకున్నారు. బీఆర్ఎస్ అమలు చేసిన రైతు బంధు, రైతుబీమా పథకాలను దేశం మొత్తం కోరుకుంది. గుజరాత్లో రాని కరెంట్‌ను కేసీఆర్ ఇస్తుండు, నువ్వెందుకు ఇవ్వడం లేదని మోదీపై జనం రోడ్లెక్కిండ్రు. నేడు దేశంలో ఆకలి చావులు విపరీతంగా ఉన్నాయి. 30కోట్ల మంది రోజుకు ఒకటేపూట అన్నం తింటున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. కానీ తెలంగాణలో మూడు పూటలా అన్నం కడుపునిండా తినేలా కేసీఆర్ పాలన చేపట్టారు. అలాంటి కేసీఆర్ నాయకత్వంలో మనమంతా పని చేస్తున్నందుకు గర్వపడాలి. వరంగల్‌లో నిర్వహించే పార్టీ రజతోత్సవ వేడుకలకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలి.”