నకిరేకల్, జూన్ 12 : చదువు ద్వారానే చిన్నారులకు మంచి భవిష్యత్ ఇవ్వగలమని సీనియర్ సివిల్ జడ్జి మంజుల సూర్యవర్ అన్నారు. గురువారం నకిరేకల్ పట్టణంలోని జడ్పీహెచ్ఎస్లో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మండల న్యాయ సేవా కమిటీ ఆధ్వర్యంలో లీగల్ అవేర్నెస్ ప్రొగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 14 సంవత్సరాలు నిండని బాల బాలికలు ఎక్కడ పని చేయడానికి వీలులేదన్నారు. పనిచేయించేవారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. చిన్న పిల్లలకు జిల్లా కోర్టులో ప్రత్యేక న్యాయస్థానాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నాగయ్య, ఉపాధ్యాయులు సత్యవతి, సీనియర్ న్యాయవాది బి.ప్రకాశ్‌రావు, న్యాయవాదులు కొండ యాదగిరి, డి.సోమయ్య, వి.వెంకన్న, సీహెచ్ నాగరాజు పాల్గొన్నారు.