నీలగిరి, అక్టోబర్ 2 : ప్రతి ఒక్కరికీ గుర్తింపు కోసం ఆధార్ కార్డు ఉన్నట్టే ప్రతి కుటుంబానికీ ఒక డిజిటల్ కార్డు ఉండాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణకు సిద్ధమైంది. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక మున్సిపల్ వార్డు, ఒక చిన్న గ్రామ పంచాయతీలో సర్వే చేసేందుకు నిర్ణయించింది. కుటుంబ డిజిటల్ కార్డు జారీ కోసం జిల్లాలో 12 ప్రాంతాలను పైలెట్ ప్రాజెక్టుకు ఎంపిక చేసింది.
వివరాల సేకరణకు 155 మంది సిబ్బందితో 36 బృందాలను ఏర్పాటు చేసింది. ప్రతి బృందంలో ఆయా ఇండ్లను బట్టి నలుగురు నుంచి ఆరుగురు సభ్యులు, ఒక ఫొటోగ్రాఫర్ ఉంటారు. ప్రతి టీమ్‌కు ఒక తాసీల్దార్, ఎంపీడీఓ, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్, మండల స్ధాయిలో అందుబాటును బట్టి మండల అధికారులు, ఒక ఫొటోగ్రాఫర్‌ను కేటాయించారు. వీరు రోజూ ఒక్కో బృందం 30 కుటుంబాల చొప్పున 5 రోజులపాటు 150 ఇండ్లకు వెళ్తుంది.
మొత్తం 5,400 కుటుంబాల వివరాలను సేకరిస్తారు. ఆ వివరాలు నమోదు చేయడమే గాక మార్పులు చేర్పులకు అవకాశం ఇస్తారు. కుటుంబ సభ్యులందరూ సమ్మతం తెలిపిన తర్వాతే కార్డు కోసం ఫొటో తీసుకుంటారు. సర్వే పర్యవేక్షణకు ఆరుగురు అధికారులను నియమించారు. గురువారం ఉదయం 9 గంటలకు సర్వేను ప్రారంభించి ఐదు రోజుల్లో పూర్తి చేయనున్నారు. ఈ నెల 7లోపు వివరాలను సమర్పించనున్నారు.
సర్వే చేయడానికి ముందుగానే ఆయా బృందాలకు బేస్ డేటాను ఇస్తారు. కుటుంబ డిజిటల్ కార్డు కోసం ప్రజలు వారి ఆధార్ కార్డు సహా సర్వే బృందాలకు అందుబాటులో ఉండి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ లేకుంటే ఇతర ఏదైనా గుర్తింపు కార్డు ఇస్తే సరిపోతుంది. ఒక వ్యక్తి రెండు కుటుంబాల్లో సభ్యులుగా ఉండకూడదని అధికారులు చెప్తున్నారు. సర్వే అనంతరం కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ ఒక ఐడీ నెంబర్‌తో కార్డు ఇవ్వనున్నారు.
ఏమిటీ డిజిటల్ కార్డు
ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు వివిధ రకాల గుర్తింపు కార్డులున్నాయి. ఆరోగ్యశ్రీ, రేషన్‌కార్డు ఇలా అన్నీ వివరాలను కలిసి ఒక్కటే డిజిటల్ కార్డు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ కార్డు, పింఛన్లు, స్వయం సహాయక సంఘాల రుణాల, రైతు భరోసా, రైతు బీమా, రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, కంటి వెలుగు తదితర వివరాల డేటా ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉన్నందున వాటిని నిర్ధారించుకుంటారు. కుటుంబంలో ఎవరైనా మరణించి ఉంటే వారి పేర్లు తొలగిస్తారు. ఇటీవల పుట్టిన పిల్లల వివరాలు నమోదు చేస్తారు.
డిజిటల్ కార్డులకు వివరాలు అందించాలి
Nalgonda
నీలగిరి, అక్టోబర్ 2 : డిజిటల్ కార్డుల సర్వేకు ప్రజలు తమ కుటుంబ సభ్యులు వివరాలు అందించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి కోరారు. బుధవారం కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో తెలంగాణ డిజిటల్ కార్డుల బృందాలకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సర్వే సమయంలో కుటుంబ సభ్యులు అందరూ ఉండేలా గ్రూఫ్ ఫొటో తీసుకోవాలని, ఎవరైనా అందుబాటులో లేకుండా ఐదు రోజుల్లో తిరిగి ఆ ఇంటికి వెళ్లి ఫొటోను సేకరించాలని సూచించారు.
షెడ్యూల్ ప్రకారం ప్రతి ఇంటికీ వెళ్లాలన్నారు. వివరాల సేకరణ కోసం వచ్చే బృందాలకు ప్రజలు సహకరించాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు టి.పూర్ణచంద్ర, జె.శ్రీనివాస్, జడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, గృహ నిర్మాహణ శాఖ పీడీ రాజ్‌కుమార్, నల్లగొండ ఆర్డీఓ శ్రీదేవి, శ్రీరాములు, సుబ్రహ్మణ్యం, మున్సిపల్ కమిషనర్లు, తాసీల్దార్లు, సర్వే బృందాల సభ్యులు పాల్గొన్నారు.