– రాష్ట్ర ఏజేసీ చైర్మన్, వైస్ చైర్మన్ ఈదురు వెంకన్న, థామస్‌రెడ్డి
నల్లగొండ సిటీ, ఏప్రిల్ 15 : కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుందని రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం సమ్మె సన్నహకాల్లో భాగంగా నల్లగొండ డిపో జేఏసీ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించి సమ్మె కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విలీనం కోసం కమిటీ వేశామని చెప్పి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2023లో వేసిన కమిటీ వివరాలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కమిటీ నివేదిక గురించి ఇన్ని రోజులు మoత్రి సమీక్ష ఎందుకు నిర్వహించలేదో తెలుపాలని ప్రశ్నించారు.
రెండున్నర ఏండ్ల తర్వాత విలీనం కమిటినీ తెరమీదికి తేవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అలాగే మాట మాటకు జేఏసీ నాయకులను ఎవరో తెరవెనుక ప్రేరేపిస్తున్నారని మీడియా ముందు అనడాన్ని జేఏసీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. తమ కార్మిక వర్గ అరణ్య రోదనల నుండి ఆవేదన నుండి, దుంఖం నుండి ఒచ్చిన సమ్మె నిర్ణయం అని స్పష్టం చేస్తూ ఆర్టీసీ కార్మికులను ఏ రాజకీయ పార్టీలు, ఇతరులు ఎవ్వరు ప్రభావితం చేయలేరన్నారు. ఆర్టీసీ కార్మికులే రాజకీయ పార్టీలను ప్రభావితం చేస్తారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన అంశాలు అమలు చేయకపోతే కార్మికులు ఈ నెల 22 నుండి సమ్మెలోకి వెళ్తారని హెచ్చరించారు. ఆర్టీసీలోని అన్ని సంఘాలు కూడా కార్మిక ప్రయోజనాల కోసం ఈ సమ్మెకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర నాయకులు బోయపల్లి యాదయ్య, B నరేందర్, బాసాని వెంకటయ్య మాట్లాడుతూ ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేయాలని, సంపూర్ణ ఉద్యోగ భద్రత ప్రకటించాలని, 2021, 2025 వేతన సవరణ అమలు చేయాలని, కార్మికులకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని, ఎలక్ట్రికల్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీ కి సబ్సిడీకి ఇవ్వాలని, అధిక పనివారాలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
జిల్లా నాయకులు ఎన్ఆర్సీ రాజు, టీజే రావు, యార చంద్రయ్య మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం యాజమాన్యం వెంటనే జోక్యం చేసుకుని సమ్మెను నివారించడానికి తగు ప్రయత్నం చేయాలని, లేనిపక్షంలో సమ్మె జరిగితే ప్రభుత్వం, యాజమాన్యం బాధ్యత వహించాలన్నారు. కార్మికులు ఎవరూ కూడా అధైర్య పడాల్సిన అవసరం లేదని, కార్మికులకు అనునిత్యం జేఏసీ అండగా ఉంటుందని, సమ్మెకు సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ నల్లగొండ రీజియన్ అధ్యక్షుడు కొర్ర లింగా నాయక్ మాట్లాడుతూ.. జేఏసీ తలపెట్టిన సమ్మెకు మద్దతు ప్రకటించి సమ్మెలో పాల్గొంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ డిపో నాయకులు ఈఎస్ రెడ్డి, వీఎస్ రెడ్డి, ఏఎల్ స్వామితో పాటు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.