తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏరియా ఆస్పత్రిగా అవుతున్నది. 2018 ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చుతున్నది. ఆ మేరకు 100 పడకల దవాఖానగా మార్చేందుకు ప్రభుత్వం రూ.44.95కోట్లు విడుదల చేసింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ నుంచి జీఓ కూడా విడుదలైంది. తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్న పీహెచ్‌సీలకు తోడు 35కిపైగా సబ్‌సెంటర్లు పల్లె దవాఖానలుగా సేవలందిస్తుండగా, 100 పడకల ఏరియా అందుబాటులోకి వస్తే మరింత మెరుగైన వైద్యం ప్రజలకు అందుబాటులోకి రానున్నది.
– సూర్యాపేట, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ)
సూర్యాపేట, ఫిబ్రవరి 7(నమస్తే తెలంగాణ) : సమైఖ్య పాలనలో దశాబ్దాల తరబడి వెనుకబాటుకు గురైన తుంగతుర్తి నియోజకవర్గం నేడు సీఎం కేసీఆర్ ఆలోచనలు, జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ చొరవతో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నది. ప్రధానంగా తుంగతుర్తి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన గాదరి కిశోర్‌కుమార్ నియోజకవర్గంపై పట్టు సాధించి ఎక్కడ ఏం కావాలో తెలుకుంటూ సమస్యలను పరిష్కరిస్తున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించి వేల కోట్లు వెచ్చిస్తున్నది. మన ఊరు-మన బడితో పాఠశాలలను ఆధునీకరిస్తూనే ప్రభుత్వ వైద్యాన్ని పల్లెలకు తీసుకొస్తున్నది. అందులో భాగంగా ఇప్పటికే తుంగతుర్తి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్న చోట మినహా సబ్ సెంటర్లన్నీ పల్లె దవాఖానలయ్యాయి. అక్కడ డాక్టర్,ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు అందుబాటులో ఉంటూ గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే మెరుగైన వైద్య సదుపాయాల కోసం నియోజకవర్గంలో ఏరియా ఆసుపత్రి లేకపోవడంతో సూర్యాపేట, భువనగిరి లేదా ఇతర ప్రాం తాలకు వెళ్లాల్సి వస్తున్నది. ఆ ఇబ్బందులను తీర్చేందుకు ఎమ్మెల్యే కిశోర్ కుమార్ తుంగతుర్తికి ఏరియా ఆసుపత్రిని తీసుకొస్తున్నారు.
రూ. 44.95 కోట్లతో వంద పడకల ఆసుపత్రి
తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఇప్పటి వరకు ఉన్న 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను వంద పడకల ఏరియా ఆసుపత్రిగా మార్చుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం జీఓ జారీ చేసింది. రూ. 44.95 కోట్ల వ్యయంతో ఆసుపత్రి భవనంతో పాటు 100 పడకల కోసం బెడ్స్, అత్యాధునిక వైద్య పరికరాలు ఇతర మౌలిక సదుపాయలను ఏర్పాటు చేయనున్నారు. ఇది పూర్తయితే అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పించి నిపుణులైన వైద్యులతో పాటు నర్సింగ్ స్టాఫ్, సపోర్టింగ్ స్టాఫ్, వైద్య పరీక్షల కోసం ల్యాబ్ తదితరాలన్నీ అందుబాటులోకి వచ్చి వస్తాయి. గర్భిణులతోపాటు వివిధ దీర్ఘకాలిక జబ్బులతో బాధ పడే వారికి ఎంతో ఉపయోగకరంగా మారనుంది.
అదేవిధంగా ఇక్కడి ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు వైద్య సిబ్బందికి కూడా వెసులుబాటు కలుగుతుంది. ఇప్పటివరకు గర్భిణులు, ఇతర వ్యాధి గ్రస్తులను దూర ప్రాంతాలకు తీసుకువెళ్లేవారు. ఇప్పుడు ఏరియా ఆసుపత్రి ఏర్పాటు కానుండ టంతో ఇక్కడే చూపించుకుంటారు. తుంగతుర్తికి 100 పడకల ఆసుపత్రి రావడం ద్వారా నియోజకవర్గంతోపాటు సూర్యాపేట, జనగాం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని నియోజకవర్గ సరిహద్దు గ్రామాల ప్రజలకు ఎంతో మేలు చేకూరనుంది. 2018లో ఇచ్చిన హామీ మేరకు తుంగతుర్తికి ఏరియా ఆసుపత్రిని మంజూరీ చేయించడం పట్ల ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌కు నియోజకవర్గ ప్రజలు కృతజ్ఞతలు చెబుతున్నారు.