కాళేశ్వరం ప్రాజెక్టు 16వ ప్యాకేజీలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మండలంలో 11.39 టీఎంసీల సామర్థ్యంతో బస్వాపూర్ (నృసింహ సాగర్) ప్రాజెక్టును నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించింది. కరువు నేలలో జల సవ్వడులు వినిపించే ఈ రిజర్వాయర్ పనులు నాటి ప్రభుత్వ హయాంలోనే 90 శాతం పూర్తయ్యాయి. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వాయర్ పనులపై శీతకన్ను వేయడంతో అడుగు ముందుకు పడటం లేదు. బాధితులకు పునరావాసం కింద ఎటువంటి సాయం అందలేదు. నిర్వాసితులు గ్రామాలను ఖాళీ చేస్తేనే నీటిని తరలించే పరిస్థితి ఉండటంతో రిజర్వాయర్ నిరుపయోగంగా మారింది.
యాదాద్రి భువనగిరి, జూలై 9 (నమస్తే తెలంగాణ) : కరువు నేలలో సిరులు ప్రవహింపజేసేందుకు శ్రీకారం చుట్టిన బస్వాపూర్ రిజర్వాయర్ పనులు బీఆర్ఎస్ హయాంలోనే 90 శాతం పూర్తయినా ప్రస్తుతం అడుగు ముందుకు పడటం లేదు. బాధితులకు మిగిలిపోయిన పునరావాసం సైతం అందడం లేదు. నిర్వాసితులు గ్రామాన్ని ఖాళీ చేస్తేనే నీటిని తరలించే పరిస్థితి ఉండటంతో రిజర్వాయర్ నిరుపయోగంగా మారింది.
కాళేశ్వరం ప్రాజెక్టు 16వ ప్యాకేజీలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మండలంలో 11.39 టీఎంసీల సామర్థ్యంతో బస్వాపూర్ (నృసింహ సాగర్) ప్రాజెక్టును చేపట్టారు. దీని కోసం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.1652.26 కోట్లు కేటాయించింది. ఇప్పటి వరకు సుమారుగా రూ. 1560 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. మొత్తం జలాశయం, ఎగువ, దిగువ కాల్వలు నిర్మించేందుకు 5,891 ఎకరాల భూసేకరణ చేపట్టారు. 50.530 కిలో మీటర్ల ప్రధాన కాల్వలో దిగువ కాల్వ 49.883 కిలో మీటర్లు ఉంది.
తురపల్లి మండలంలోని ములలపల్లిలో 36.609 కిలో మీటర్ల వద్ద కాళేశ్వరం నృసింహసాగర్ ప్రాజెక్టు ప్రారంభమవుతుంది. బస్వాపూర్ లోని నీటిని దిగువ భాగానికి మళ్లించేందుకు ప్రధాన కాల్వతోపాటు ఆయా ప్రాంతాలకు డిస్ట్రిబ్యూటరీ, మైనర్ , సబ్ మైనర్ కాల్వలను నిర్మిస్తున్నారు. మొత్తం 13 డిస్ట్రిబ్యూటరీ కాల్వలను ఏర్పాటు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి 90 శాతం రిజర్వాయర్ పనులు పూర్తయ్యాయి.
మౌలిక సదుపాయాలేవీ..?
ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద ప్లాట్లను పంపిణీ చేసినా లేఅవుట్లో మౌలిక వసతులు కల్పించలేదు. 28 ఎకరాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను పట్టించుకునే వారే లేరు. ఇప్పటికే కొంతమంది ఇండ్ల నిర్మాణాలు చేపట్టారు. కానీ ఇకడ నీటి సదుపాయం లేకపోవడంతో నిర్మాణ పనులు మందగించాయి. వాటర్ ట్యాంకులు నిర్మించినా నిరుపయోగంగా ఉన్నాయి. నీటి సదుపాయం లేక ప్రైవేట్ ట్యాంకర్లను అశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. నీటి కోసం వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇక అంగన్వాడీ భవనాలు, పాఠశాల భవనాలు నిర్మాణ పనుల ఊసే లేదు. మురుగు కాల్వల నిర్మాణం, పారులు, సీసీ రోడ్లు, బీటీ రోడ్ల నిర్మాణ పనులను ఎప్పుడు ప్రారంభిస్తారో అని నిర్వాసితులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
సర్కార్‌లో చలనంలేదు..
తమ సమస్యలు పట్టించుకోవాలంటూ నిర్వాసితులు చెప్పులరిగేలా తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రజా భవన్లో ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం సైతం అందించారు. పలుమార్లు మంత్రులు, ఎమ్మెల్యే, కలెక్టర్‌తోపాటు ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. అయినా ఫలితం లేదు. తిరిగి తిరిగి అలసిపోయారే తప్ప.. సరార్లో మాత్రం చలనం లేదు. కాగా ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే కరువు నెల సస్యశ్యామలం కానుంది. రెండు లక్షలకు పైగా ఎకరాలకు సాగు నీరు అందుతుంది. సాగునీటితోపాటు తాగునీరు కూడా అందనుంది. ఈ ప్రాంతం పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందుతుంది.
పునరావాసం కోసం ఎదురుచూపులు..
రిజర్వాయర్ నిర్మాణంతో భువనగిరి మండలంలోని బీ ఎన్ తిమ్మాపూర్, లప్పానాయక్ తండా, చోక్లా నాయక్ తండా పూర్తిగా మునిగిపోతున్నాయి. అయితే బీఆర్ఎస్ హయాంలోనే పరిహారం చెల్లింపులు పూర్తయ్యాయి. ఆర్అండ్ ఆర్ ప్యాకేజీ కూడా అధిక భాగం పూర్తి చేశారు. ప్యాకేజీలో భాగంగా ఒకో కుటుంబానికి రూ. 7.60 లక్షలను ప్రభుత్వం అందించింది. ప్రతి ఇంట్లో మేజర్లు ఉన్నా.. వారికి కూడా ప్యాకేజీ వర్తింపజేసింది. ఇక పునరావాసం కింద ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు భువనగిరి మండల పరిధిలోని హుస్నాబాద్‌లో సర్వే నంబర్ 107లో 1,056 మందికి ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు.
ఒకో కుటుంబానికి 200 గజాలు ఇచ్చారు. ఇంకా ఇంటి నష్టపరిహారం చెల్లింపులు చేయాల్సి ఉంది. అయితే ఇకడే అసలు సమస్య వచ్చి పడింది. రిజర్వాయర్‌లో నీళ్లు నింపాలంటే కచ్చితంగా తిమ్మాపూర్ గ్రామాన్ని ఖాళీ చేయాలి. గ్రామ నిర్వాసితులు మాత్రం పరిహారం చెల్లించాకే ఖాళీ చేస్తామనే పట్టుదలతో ఉన్నారు. ఇటీవల కొంతమందికి 30 కోట్ల వరకు పరిహారం అందజేశారు. ఇంకా రూ. 80 కోట్లు ఇవ్వాలని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.