తన పేరుపై నమోదు చేసుకున్న కారోబార్ నెనరయ్య
కలెక్టర్‌కు బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి
విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు : కలెక్టర్
Yadadri | యాదగిరిగుట్ట, మార్చి 22 : పహాణి, ధరణిలో 9 మంది రైతుల పేర్లు తారుమారు చేసి దాదాపుగా 12 ఎకరాల భూమిని కారోబార్ మాయం చేసిన ఘటన ఇటీవల కలెక్టర్‌కు బాధితులు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఆర్డీఓ నేతృత్వంలో విచారణ సాగుతున్న నేపథ్యంలో కారోబారే ఇందంతా చేశాడా? బాధితుల సంఖ్య పెరుగనుందా? అన్న ప్రశ్నకు సమాధానం త్వరలో దొరకనుంది. కలెక్టర్ ఆదేశాలతో విచారణ చేపట్టిన ఆర్డీఓ తుది నివేదికను కలెక్టర్‌ను సమర్పించనున్నారు. అనంతరం కలెక్టర్ చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.
మండలంలోని జంగంపల్లికి చెందిన కారోబార్ శివరాత్రి నెహ్రూ అలియాస్ నెనరయ్య 9 మంది రైతుల పేర్లను భూమి పహణీలో తొలగించి తన పేరును ఎక్కించుకున్నాడు. ధరణిలో సైతం రైతుల పేర్లు తొలగించి తన పేరు నమోదు చేసుకున్నాడు. అసలు కారోబార్కు సహకరించిన రెవెన్యూ అధికారి ఎవరు? ఇంకా ఎంతమంది బాధిత రైతులున్నారు? వంటి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. ఇదిలా ఉండగా కారోబార్ నెనరయ్య.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఆలేరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ శివరాత్రి దానయ్యకు స్వయానా తమ్ముడే కావడం గమనార్హం.
పహణీలో తమ పేర్లు లేకపోవడంతో ఆందోళన చెందిన రైతులు ఈ నెల 17న గ్రీవెన్స్‌లో కలెక్టర్ హనుమంతరావుకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టాలని ఆర్డీఓను కలెక్టర్ ఆదేశించడంతో ఆర్డీఓ కృష్ణారెడ్డి నేతృత్వంలో విచారణ వేగవంతం చేశారు. ప్రాథమిక విచారణలో భాగంగా పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. జంగంపల్లి గ్రామ కారోబార్‌గా పనిచేస్తున్న నెనరయ్య అదే గ్రామానికి చెందిన పలువురు రైతుల నుంచి పలు కారణాలు చెప్తూ పట్టాదారు పాసు పుస్తకాలు సేకరించాడు. వారికి తెలియకుండానే భూ రికార్డు పహణీలో వారి పేర్ల స్థానంలో తన పేరును ఎక్కించుకున్నాడు. అనంతరం వారి పేర్లను ధరణిలో కూడా తొలగించి నెనరయ్య పేరు యాడ్ చేశాడు. ఇలా గ్రామంలోని సర్వే నంబర్ 393లో పారునంది బాలయ్య పేరిట గల 0.34 ఎకరాలు, 393/1లో పారునంది బాలయ్య పేరిట 0.34 ఎకరాలు భూమి ఉండగా వారి పేర్ల పక్కనే తన పేరు నమోదు చేసుకున్నాడు. దీంతో పాటు సర్వేనంబర్ 396 లో 0.35 ఎకరం, సర్వే నంబర్ 393లో మరో 0.34 ఎకరాలు భూమి ఉన్నట్లుగా నమోదు చేసుకున్నాడు. 395లో జువ్వగాని సత్తయ్య పేరిట గల 1.23 ఎకరాలు, 395లో జువ్వగాని రాములు పేరిట గల 1.23 ఎకరాలు, 395లో అముదాల శ్రీరాములు పేరిట 0.30 ఎకరాలు, సర్వేనంబర్ 319లో గడిడె పెంటమ్మ పేరిట 2 ఎకరాలు, సర్వే నంబర్ 18/5లో శివరాత్రి నర్సయ్య పేరిట 1 ఎకరం, 393లో గుంటి ముత్తయ్య పేరిట గల 0.34 ఎకరాలు పహణీ రికార్డులో వీరి పేర్ల స్థానంలో నెనరయ్య పేరును ఎక్కించుకుని ధరణి రికార్డుల్లో సైతం తారుమారు చేశాడు. దీంతోపాటు 2008లో సర్వే నంబర్ 395లో 3.36 ఎకరాల దేవస్థాన భూమిని ధరణిలో తన పేరిట నమోదు చేశాడు. సర్వే నంబర్లోని 393/2లో గుంటి నాగరాజుకు చెందిన 0.34 ఎకరాల భూమిలో చెట్లను నరికి విక్రయానికి పాల్పడ్డాడు. దీంతో అడ్డుకున్న రైతు నాగరాజుకు ఈ భూమిని కొనుగోలు చేశానని బెదిరించడంతో ఇతర బాధిత రైతులతో కలిసి కలెక్టర్‌కు పిర్యాదు చేశాడు. దీంతో నెనరయ్య బాగోతం బట్టబయలైంది. మొత్తం సుమారు 9 మంది రైతులకు సంబంధించిన 12 ఎకరాల భూమిని మాయం చేశాడని ప్రాథమిక విచారణలో తేలింది.
ఆరోపణలు ఎదుర్కొంటున్న కారోబార్ నెనరయ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శివరాత్రి దానయ్యకు తమ్ముడేనని ఆ గ్రామానికి చెందిన రైతులు అంటున్నారు. అధికార పార్టీ అండదండలతో తమకు అన్యాయం జరుగుతుందేమోనని బాధిత రైతులు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యను కలిసి సమస్యను విన్నవించారు. నిందితుడు నెనరయ్యకు కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు ఉండటంతో తమకు అన్యాయం చేయొద్దని ఎమ్మెల్యేను వేడుకున్నారు. గతంలో జంగంపల్లి గ్రామంలో లేని ఇండ్లను ఉన్నట్లుగా రికార్డుల్లో సృష్టించి ఆస్తి పన్ను ధృవీకరించినట్లు తేలడంతో 2019లో నెనరయ్య సస్పెన్షన్‌కు కూడా గురయ్యాడు.
జంగపల్లికి చెందిన పలువురు రైతుల నుంచి తనకు ఫిర్యాదు అందిందని, వెంటనే విచారణకు ఆదేశించినట్లు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. యాదగిరిగుట్ట తాసీల్దార్ కార్యాలయంలో శనివారం ఆయన రికార్డులను పరిశీలించారు. ధరణిపై డీటీతో సమీక్ష నిర్వహించారు. ధరణిలో తప్పుడు రిపోర్టు పంపిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమయ పాలన పాటించని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మండల సర్వేయర్ వద్ద దరఖాస్తులు, కోర్టు రిజిస్టర్‌ను పరిశీలించి, కుల ధ్రువీకరణ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ సేవలను వెంటనే పరిష్కరించాలన్నారు. జంగపల్లి భూములకు సంబంధించిన వ్యవహారంపై ఆర్డీఓ విచారణ సాగుతున్నదని, లోతైన విచారణ చేపట్టాలని ఇందులో ఎవరెవరి పాత్ర ఉందో సమగ్ర విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. రికార్డు అసిస్టెంట్ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలను జారీ చేసినట్లు పేర్కొన్నారు. నివేదిక రాగానే దోషులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.