తుంగతుర్తి, ఆగస్టు 22 : పోలీస్ కమ్యూనిటీలో భాగంగా తుంగతుర్తి మండల కేంద్రంలోని తూర్పు బజార్, బీసీ కాలనీ ఎస్సీ కాలనీలో కార్డెన్ సెర్చ్ చేసి 74 టు వీలర్లు, 2 ఆటోలు సీజ్ చేసినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ.. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఫిట్నెస్, హెల్మెట్లు తప్పనిసరిగా కలిగి ఉండాలని కోరారు. సమాజంలో యువత డ్రగ్స్, గంజాయి వైపు మొగ్గుచూపుతున్నారని, వీరి పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని, వీటి నిర్మూలన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రజలు ఎల్లవేళలా పోలీసులతో మమేకమై మీ సహకారం అందించాలని కోరారు. వాహనదారులు ఒరిజినల్ పత్రాలను చూపెట్టి, పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చిన వాహనాలను తిరిగి తీసుకువెళ్ళవచ్చు అని తెలిపారు. సరైన పత్రాలు లేని వాహనాలపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు క్రాంతి కుమార్, 40 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.