మిర్యాలగూడ : బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్‌సేవాలాల్ 286వ జయంతి రోజైన ఫిబ్రవరి 15న రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించాలని బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మాలోతు దశరధ్నాయక్ కోరారు. గురువారం మిర్యాలగూడలో జరిగిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ సేవాలాల్ జయంతి రోజు బంజారా ఉద్యోగ, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేస్తారని, మహాభోగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని అట్టి కార్యక్రమాలకు అందరు బంజారాల భారీ సంఖ్యలో పాల్గొనున్నందున ప్రభుత్వం ఆధికారికంగా సెలవు ప్రకటించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా సేవాలాల్ జయంతి వేడుకలను ఆధికారికంగా ఘనంగా నిర్వహించేందుకు తక్షణమే నిధులు మంజూరు చేయాలని కోరారు. సమావేశంలో బంజారా సంఘం నాయకులు మాన్యనాయక్, రవినాయక్, మోహన్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
నేరేడుచర్ల: మండలంలోని వైకుంఠాపురం గ్రామ సమీపంలో ఎన్ఎస్పి కెనాల్ పై నిర్మించిన జల విద్యుత్ కేంద్రం లో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడి రూ.70 వేల విలువైన సామాగ్రి ఎత్తుకెళ్లినట్లు జల విద్యుత్ కేంద్రం సూపర్వైజర్ గుండ్ల వేణుగోపాల రెడ్డి విలేకరులకు తెలిపారు. కళ్ళం బ్రదర్ కాటన్ ప్రైవేట్ ఇండస్ట్రీ పవర్ ప్లాంట్ పేరుతో నిర్వహిస్తున్న జల విద్యుత్ కేంద్రంలో గత కొంతకాలంగా ఉత్పత్తి నిలిచిపోయింది. ఇదే కేంద్రంలో పనిచేస్తున్న వేణుగోపాల రెడ్డి సమీపంలో పొలం కౌలు చేస్తూ ప్రతినిత్యం పర్యవేక్షణ చేస్తూ పరిశీలిస్తుంటారు. యధావిధిగా గురువారం జల విద్యుత్ కేంద్రం పరిశీలనకు రాగా జనరేటర్ రూమ్ తాళం తెరిచి ఉండడంతో అనుమానం వచ్చి లోనికి వెళ్లి గమనించగా 11కెవి ఇన్వర్టర్, 150 ఎ హెచ్,90 ఎ హెచ్ బ్యాటరీలు అందాజ రూ 70 వేల విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు గమనించారు. దొంగతనం విషయమై జల విద్యుత్ కేంద్రం డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి దృష్టికి ఫోన్ చేసి సమాచారం అందించారు. డైరెక్టర్ సూచన మేరకు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు వివరించారు. వేణుగోపాల రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవీందర్ నాయక్ తెలిపారు.
సూర్యాపేట : ఈ రోజు డిఐఈఓ గారిని కలిసి ఇంటర్ ప్రాక్టికల్ డ్యూటీ గురించివినతి పత్రం అందజేసిన తెలంగాణ లెక్చరర్స్ ఫోరం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు నాగేశ్వర్ రావు నాయక్,రాష్ట్ర జనరల్ సెక్రటరీ గంజికుంట్ల గోపీనాథ్ ఇంటర్ మీడియేట్ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులకు ప్రాక్టికల్ డ్యూటీలు లు వేయాలిగత సంవత్సరం ప్రాక్టికల్ డ్యూటీ లు వేసిన విధంగానే వేయాలని అన్నారు. ప్రభుత్వం పునరాలోచన చేసి ఆర్డర్స్ ఇవ్వాలని లేని పక్షంలో రానున్న ఇంటర్ పరీక్షల వాల్యుయేషన్ కి హాజరు అయ్యే ప్రసక్తే లేదని ప్రభుత్వ ఉపాధ్యాయుల తోటే ప్రశ్నాపత్రాల మూల్యాంకనం చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వ అధ్యాపకులకు ఒక్కొక్కరికి పదికిపైన కళాశాలలకు పంపిస్తున్నారని దాని ద్వారా వారిపై పని ఒత్తిడి పడుతుందని అన్నారు. వినతలకు సానుకూలంగా స్పందించకుంటే నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
గుండాల మండల కేంద్రంలోని రామసముద్రం చెరువులో గురువారం మంటలు చెలరేగి చెరువులోని చెట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. పక్కన్నే ఉన్న గ్రామపంచాయతీ డంపింగ్ యార్డులో వేసిన చెత్తను కాలబెట్టేందుకు నిప్పు వేయగా మంటలు చెలరేగి చెరువులో చెట్లు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు పక్కన్నే ఉన్న పంట పొలాలకు మంటలు అంటుకోకుండా మంటలను అదుపు చేశారు.