తిరుమలగిరి ఆగస్టు 3 : తిరుమలగిరి మండలంలోని ఎగువ ప్రాంతాలైన 7 గ్రామాలకు దేవాదుల ప్రాజెక్టు ద్వారా సాగు నీరందించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. లక్ష్యం సాధించేందుకు దేవాదుల ప్రాజెక్టు మూడో దశ పనుల్లో భాగంగా ఏటూరు నాగారం సమీపంలోని గంగారం ఇన్టెక్ వెల్ నుంచి రామప్ప, ధర్మసాగర్, స్టేషన్ ఘనపూర్ రిజర్యాయర్ల నుంచి జనగాం జిల్లా చెన్నూరు రిజర్వాయర్లోకి నీరు నింపి అక్కడి నుంచి సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలోని 7 గ్రామాలకు సాగునీరందించే విధంగా పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని నెల్లిబండ తండా వరకు పనులు చేపట్టి గతంలోనే కాల్వలు తవ్వారు. 2023 డిసెంబర్ తర్వాత ఆయా గ్రామాలకు కాల్వల ద్వారా సాగునీరు అందించాలనే లక్ష్యంతో పనులు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నాటి నుంచి ఇప్పటి వరకు పనులు చేపట్ట లేదు. దీనితో కాల్వల నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో తమకు సాగునీరు వస్తుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. అప్పుడప్పుడు అధికారులు కాల్వల మ్యాపులు, కాల్వల స్థలాలను పరిశీలించి వెళ్లారు.
కాల్వలు వస్తాయని ఆశించిన రైతులకు రెండు సంవత్సరాలు పూర్తి కావొస్తున్నా పనులు మాత్రం ఒక్క అంగుళం కూడా ముందుకు సాగ లేదు. కాల్వలు ఏర్పాటు చేసి సాగునీరందించాలని ఆయా గ్రామాల రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. తెలంగాణ ప్రాంతంలోని మూడు జిల్లాల పరిధిలోని బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు దేవాదుల ప్రాజెక్టును వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మండలం గంగారం వద్ద గోదావరివద్ద దేవాదుల ప్రాజెక్ట్ నిర్మించారు. వరంగల్ ,కరీంనగర్,ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో 6.21 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకవచ్చేందుకు ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసారు. ఈ క్రమంలో 2004లో నీటిపారుదల శాఖ రూ. 6016 కోట్ల అంచనాతో ఈ ప్రాజెక్టు చేపట్టింది . అయితే ప్రాజెక్టును ప్రారంభించే సమయానికి దీని అంచనా రూ. 9427 కోట్లకు పెరిగింది. దీని ద్వారా వరంగల్ జిల్లాలో 5.61.229 ఎకరాలు , కరీంనగర్ జిల్లాలో 14.100 ఎకరాలు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 45.671 ఎకరాలకు సాగునీటిని అందించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు . దీన్ని మూడు దశల్లో పూర్తి చేయాల్సి ఉండగా సమైక్య పాలనలో ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్న చందంగా పనులు జరిగాయి. మొదటి ,రెండవ దశ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఈక్రమంలో దేవాదుల ప్రాజెక్టు మూడో దశ పనులు కొనసాగాయి. ఈపనులు పూర్తయితే దేవాదుల ప్రాజెక్టు బహుళార్థ సాధక ప్రాజెక్టుగా మారే అవకాశం ఉంది.
జనగాం జిల్లా చెన్నూరు రిజర్వాయర్ నుంచి తిరుమలగిరి మండలం వరకు ప్రధాన కాల్వ 12 కిలోమీటర్ల మేర ఉంటుంది. దీనిలో తిరుమలగిరి మండలంలో 8 కిలోమీటర్ల ప్రధాన కాల్వ ఉంటుంది. దీంతో మండలంలోని 7 గ్రామాలైన తిరుమలగిరి, నెల్లిబండ ఆవాసం, తాటిపాముల, నందాపురం, తొండ, మాలీపురం, వెలిశాల గ్రామాలకు కాల్వ ద్వారా నీరందుతుంది. అవసరం ఉన్న చోట్ల చెరువులు ,కుంటలు కూడా నింపే అవకాశం ఉంది. ప్రధాన కాల్వకు 3 డీబీఎంలు ఏర్పాటు చేస్తారు. అందులో డీబీఎం 10, 11, 12లుగా ఏర్పాటు చేస్తారు. వీటి ద్వారా తిరుమలగిరి మండలంలోని ఎగువ ప్రాంతాలకు సాగు నీరు అందాల్సి ఉంది. పనులు పూర్తయితే 3 డీబీఎంల ద్వారా మండలంలోని 7 గ్రామాలకు సాగు నీరు అందుతుంది.
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మం డలం, సరిహద్దు జిల్లా జనగాం , కొడకం డ్ల మండలం చెన్నూరు గ్రామంలో 1800 ఎకరాల్లో వంద కోట్లతో దేవాదుల ప్రాజెక్టు ద్వారా చె న్నూరు రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. దీని నీటి సామర్థ్యం 0.58 టీఎంసీలు. దీని కింద 25 వేల ఎకరాలకు సాగు నీరందించాలనేది లక్ష్యం. జనగాం జిల్లాలోని 11 వేల ఎకరాలకు , సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలోని 7 గ్రామాల్లో 14 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యం పెట్టుకున్నారు.
దేవాదుల ద్వార నెల్లిబండ తండాకు మొదటగా నీరందుతుందని ఆశగా ఉండే. కానీ ప్రభుత్వం మారిన తర్వాత పనులు ఒక్క ఆడుగు కూడా ముందుకు పడలే. ప్రాజెక్ట్ ద్వారా సాగునీరందితే గిరిజనుల బతుకులు బాగుపడుతాయి. వ్యవసాయమే జీవనాధారంగా బతుకున్న తండాల్లోని గిరిజనులకు వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. సాగు విస్తీర్ణం పెరుగుతంది. మా జీవన ప్రమాణాలు మెరుగు పడుతాయి.
సాగు నీరు లేక ప్రకృతినే నమ్ముకొని వ్యవసాయం చేస్తున్న గిరిజన రైతులకు దేవాదుల కాల్వల ద్వారా సాగునీరందితే సాగు సమస్యలు తీరుతాయి. ప్రభుత్వం త్వరగా కాల్వల పనులు పూర్తి చేసి సాగునీందిస్తే రైతుల కష్టాలు తీరుతాయి. వర్షాధారం పైనే వ్యవసాయం చేయటం కష్టంగా మారింది. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి.
కేసీఆర్ రైతు బాంధవుడు.. రైతుల కోసం ఆలోచించిన గొప్ప ముఖ్యమంత్రి. దేశానికి అన్నం పెట్టే రైతు ఆనందంగా ఉండాలని అనేక పథకాలు ప్రవేశపెట్టి రైతులను ఆదుకున్నాడు. వెనుకబడిన తుంగతుర్తి ప్రాంతానికి సాగునీరందించి సస్యశ్యామలం చే శారు. దండుగ అన్న వ్యవసాయం పండుగలా మార్చిన మహనీయుడు. తిరుమలగిరిలోని ఎగువ ప్రాంతాలకు కూడా సాగునీటిని ఎలా అందించాలో ఆలోచించి.. దేవాదుల ప్రాజెక్టు నుంచి సాగునీరందించాలని కాల్వలు తవ్వారు. ఆయన హయాంలో తిరుమలగిరిలోని నెల్లిబండ తండా వరకు పనులు పూర్తయ్యాయి . అనంతరం ఆగిన పనులను పట్టించుకునే వారే లేరు. వెంటనే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోని కాల్వలు తవ్వి సాగునీరందించి రైతులను ఆదుకోవాలి.