మిర్యాలగూడ, మార్చి 25 : ప్రభుత్వం పేదల కోసం అందిస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ రాజశేఖర్‌రాజు తెలిపారు. మంగళవారం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ లక్ష్మయ్య ఈ నెల 21న కొత్తగూడెం గ్రామ పరిధిలో పెట్రోలింగ్ చేస్తుండగా గ్రామ శివారులో రోడ్డు పక్కన లారీ, బొలోరో వాహనాలను ఆపుకుని అనుమానస్పదంగా ఉండగా వాటిని తనిఖీ చేయగా 66 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు.
పోలీసులను చూసి బియ్యం అక్రమ రవాణా చేస్తున్న వారు పారిపోగా లారీ డ్రైవర్ అమ్మోరును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అరెస్ట్ చేసిన నిందితుడిని విచారించగా నర్సింహారావు, నరేందర్, చంద్రశేఖర్, అప్పారావు ప్రమేయం ఉందని తెలిపాడు.
అదేవిధంగా నాగార్జునసాగర్ సమీపంలో బార్డర్ చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా బొలోరో వాహనంలో 20 బస్తాల రేషన్ బియ్యంతో ఆంధ్రాకు వెళ్లే సమయంలో పోలీసులు తనిఖీలు చేయగా అక్రమ రవాణా చేస్తున్న నెమలి నాగిరెడ్డిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. 8 క్వింటాళ్ల (20బస్తాల) రేషన్ బియ్యం, బొలోరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రెండు కేసుల్లో నిందితులు నాగిరెడ్డి, చంద్రశేఖర్, మధులను రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. కాగా ఈ రేషన్ బియ్యాన్ని కాకినాడ పోర్టుకు తరలిస్తుండగా నిందితులు వెల్లడించారని, దీనికి సంబంధించి మరింత లోతుగా విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. సమావేశంలో రూరల్ సీఐ పీఎన్డీ.ప్రసాద్, సాగర్ సీఐ బీసన్న, ఎస్ఐలు లక్ష్మయ్య, సంపత్ పాల్గొన్నారు.