జిల్లాలో యాసంగి సాగు పనులు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే 60 శాతం విస్తీర్ణంలో సాగు పూర్తయ్యింది. అధిక శాతం మంది రైతులు వరి వైపు మొగ్గు చూపుతున్నారు. వ్యయసాయ పనుల ఇతర రాష్ర్టాల కూలీలు ఉపాధి పొందుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో గతేడాది యాసంగిలో నీటికి తీవ్ర ఇబ్బందులు తలెత్తగా, ఈ సీజన్లోనైనా కష్టాలు తీరుతాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సర్కారు మంత్రి వర్గ ఉప సంఘం పేరుతో రైతు భరోసా ఇవ్వకుండా కాలయాపన చేస్తూ పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలను అవస్థల పాలు చేస్తున్నది.
– యాదాద్రి భువనగిరి, జనవరి 2 (నమస్తే తెలంగాణ)
యాసంగి సీజన్‌కు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు యాక్షన్ ప్లాన్ రూపొందించారు. అందులో సాగు, విత్తనాలు, ఎరువుల ఇండెంట్‌కు సంబంధించిన వివరాలు పొందుపరిచారు. ఈ ఏడాది యాసంగిలో అన్ని పంటలు కలుపుకొని 3,19,320 ఎకరాల్లో సాగు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో 2.98లక్షల ఎకరాల్లో వరి, మిగతా పంటలన్నీ కలిపి 21,320 ఎకరాల్లో పంటలు ఉన్నాయి.
75,500క్వింటాళ్ల వరి విత్తనాలు, 57,816 టన్నుల ఎరువులు అవసరమని లెక్కలు వేశారు. ఇప్పటికే రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. అధిక శాతం మంది రైతులు వరి నాట్లు వేశారు. మిగిలిన వాళ్లు దుక్కులు దున్నారు. సంక్రాంతి వరకు సాగు పనులు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 1.50లక్షల ఎకరాల్లో వరి సాగు చేసినట్లు జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ తెలిపారు.
గతంలో బీఆర్ఎస్ చేపట్టిన మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల్లో పూడికతీతతో ఎక్కడ చూసినా జలకళ కనిపించేది. రైతుబంధు సాయంతో రైతులు రంది లేకుండా వ్యవసాయం చేసుకునేవారు. మరికొందరు భూమిని కౌలుకు తీసుకొని సాగు చేసేది. సాగు విస్తీర్ణం పెరుగడంతో వ్యవసాయ పనులకు మరికొంత మంది కూలీల అవసరం పడేది.
దాంతో ఇతర రాష్ర్టాల కూలీలు జిల్లాకు కూలీలను తీసుకురావడం మొదలైంది. ప్రతి సీజన్లోనూ అది అలా కొనసాగుతూ వస్తున్నది. ప్రస్తుతం కూడా వివిధ రాష్ర్టాల నుంచి కూలీలు వచ్చారు. కూలి తక్కువగా ఉండడంతో పాటు ఎక్కువ పని చేస్తుండడంతో ఇతర రాష్ర్టాల కూలీలను తీసుకురావడంపై రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. గుత్తా లెక్కన కూలి మాట్లాడుకుని ఉపాధి కల్పిస్తున్నారు. ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, చత్తీస్గడ్, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల కూలీలు వలసలు వస్తున్నారు.
బీఆర్ఎస్ హయాంలో పదేండ్లలో ఏనాడూ సాగు నీటికి ఇబ్బందులు తలెత్తలేదు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యలతో చెరువులు కళకళలాడాయి. భూగర్భ జలాలు పెరిగాయి. కాగా, గత యాసంగి సీజన్లో తొలిసారి నీటి కష్టాలు మొదలయ్యాయి. యాసంగిలో సాగు నీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనేక మంది ట్యాంకర్లతో పొలాలను తడిపే ప్రయత్నం చేశారు. సకాలంలో నీళ్లు అందక పొలాలు ఎండిపోయాయి. ఎండిన పంటలు పశువులకు దాణాగా మారాయి. ఇప్పటికే భూగర్భ జలాలు ఇంకిపోవడం, అధిక శాతం చెరువులు నీళ్లు లేక ఖాళీగా మారడడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
రైతు వ్యవసాయ పనులకు నాడు బీఆర్ఎస్ సర్కారు అండగా నిలిచింది. సీజన్ ప్రారంభంలోనే పంటకు పెట్టుబడి అందించేది. దుక్కులు దున్నే సమయంలోనే ఠంఛనుగా అన్నదాత ఖాతాల్లో ఎకరాకు రూ.5వేల చొప్పున నగదు జమ చేసేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారింది. రైతు భరోసా పేరుతో ఎకరాకు ఏడాదికి 15 ఇస్తామని చెప్పినా ఇప్పటి వరకు ఆచరణకు నోచలేదు.
గతేడాది యాసంగి సీజన్లో ధాన్యం అమ్ముకునే సమయంలో పెట్టుబడి డబ్బులు జమ చేయగా, ఖరీఫ్ పైసలు ఇంకా ఇవ్వలేదు. మంత్రి వర్గ ఉప సంఘం పేరుతో కాలయాపన చేయడం తప్ప అమలు చేయడం లేదు. పెట్టుబడి సాయం జమ చేయకపోవడంతో అనేక మంది రైతులు అప్పులు చేసి సాగు పనులు చేస్తున్నారు. జిల్లాలో దాదాపు 2.20లక్షల మంది రైతులు పెట్టుబడి సాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.