నీలగిరి, జూలై 30 : యువకుల పాలిట శాపంగా మారుతున్న మాదక ద్రవ్యాలకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం అడుగులు ముందుకు వేసింది. మిషన్ పరివర్తన్ పేరుతో గంజాయి సేవిస్తున్న యువతను గుర్తించి వారికి ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహించి మార్పు తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టింది. డ్రంక్ అండ్ డ్రైవ్ మాదిరిగా గంజాయి సేవించిన వారిని గుర్తించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన కిట్లను అన్ని పోలీస్ స్టేషన్లలో అందుబాటులో ఉంచింది. గంజాయితోపాటు ఇతర మాదక ద్రవ్యాలు సేవించిన వారిలో శరీరంలో ఆరు నెలలపాటు వాటి అవశేషాలు ఉంటాయి. ఇలా పోలీసులకు దొరికిన వారిని ఒకటి రెండు సార్లు పునర్వవస్థీకరణలో భాగంగా కౌన్సెలింగ్ ఇస్తారు. మూడోసారి కూడా దొరికితే వారిని ఆరు నెలలపాటు జైలు శిక్ష పడేలా పోలీసులు ప్రణాళిక రూపొందించారు. ఇక నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సేవించిన వారిని కూడా ప్రత్యేకంగా గుర్తించనున్నారు.
మాదక ద్రవ్యాలు సేవిస్తే ఆరు నెలల పాటు పాజిటివ్ రిపోర్టు
గంజాయితోపాటు మరే ఇతర మాదక ద్రవ్యాలు సేవించినా దాని ప్రభావం ఆరు నెలల పాటు శరీరంలో ఉంటాయని వైద్యారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో వచ్చిన ఫలితాల అధారంగా గంజాయి కిట్లను పోలీసులు ప్రవేశ పెట్టారు. దీని ద్వారా ఆరు నెలల్లో ఎప్పుడైనా వాటిని సేవిస్తే పాజిటివ్ రిపోర్టులు వస్తాయి. తెలిసి తెలియక మొదటిసారి సేవించిన వారిని పునర్వవస్థీకరణలో భాగంగా మార్పుకోసం మిషన్ పరివర్తన్ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు.
తొలిరోజు 50 మంది యువతకు కౌన్సెలింగ్
వారం రోజులుగా జిల్లాలో అర్ధరాత్రులు వీధుల్లో తిరుగుతున్న గంజాయి అలవాటు ఉన్న యువతను గుర్తించారు. మునుగోడు, మిర్యాలగూడ ప్రాంతాల్లో గంజాయి సేవించి పట్టుబడిన వారి తల్లిదండ్రుల సమక్షంలో మంగళవారం నల్లగొండ కలెక్టర్ సి.నారాయణరెడ్డి, ఎస్పీ శరత్చంద్ర పవార్, మానసిక వైద్య నిపుణులు శివరామకృష్ణ పర్యవేక్షణలో కౌన్సెలింగ్ నిర్వహించారు. మాదక ద్రవ్యాలు సేవించడం వల్ల జరిగే నష్టాలు, వాటి దుష్పరిణామాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
15 నుంచి 30 సంవత్సరాలలోపు యువతపైనే ఎక్కువ ప్రభావం : కలెక్టర్ సి.నారాయణరెడ్డి
నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 15 నుంచి 30 సంవత్సరాల లోపు యువతే గంజాయి ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. ఈ వయస్సు భవిష్యత్‌ను మలుచుకునేందుకు చాలా ముఖ్యమైన సమయం. దీనికి బానిస కావడం వల్ల జీవితం నాశనం అవుతుంది. దీన్ని అధిగమించి యుక్తవయసులో కుటుంబాలకు అండగా నిలువాలి. వీటిని సేవించడం వల్ల దాన్ని ప్రభావం మెదడుపై పడి మనిషి జంతువుగా మారిపోతాడు.
యుక్త వయస్సు చాలా కీలకం : ఎస్పీ శరత్చంద్ర పవార్
ప్రతి ఒక్కరికీ యుక్త వయస్సు జీవితంలో చాలా ముఖ్యమైంది. ఈ ప్రాయంలోనే వారి భవిష్యత్‌కు పునాదులు పడతాయి. జీవితంలో బాల్యంలో లక్ష్యాలను ఎంచుకున్నప్పటికీ వాటిని సాకారం చేసుకునే సమయం ఇదే. ఈ సమయంలో వారు పెడదారిన పడితే భవిష్యత్ అంత అంధకారంగా మారడంతోపాటు సమాజంలో ప్రత్యేకంగా గెంటివేసేలా వారి జీవితాలు తయారవుతాయి.