సూర్యాపేట, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం సూర్యాపేట జిల్లాను యూనిట్‌గా తీసుకుని ఏర్పాటు చేస్తున్న సూర్యాపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(సుడా)జిల్లా ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నది. జిల్లాలోని 5 మున్సిపాలిటీలు, 21 మండలాల పరిధిలోని 264 గ్రామ పంచాయతీలను కలిపి సుడా ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే పురపాలక పరిపాలన శాఖ జీఓ నెంబర్ 176ను విడుదల చేసింది. హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాలను కలుపుతూ హుడా ఏర్పాటు చేయడంతో అక్కడ ఎంతో అభివృద్ధి జరిగిందని ఉదాహరణగా చెప్తూ సూర్యాపేటను జిల్లా యూనిట్‌గా తీసుకుని సుడా ఏర్పాటుకు నిర్ణయించింది.
కానీ, వాస్తవంలో రాష్ర్టానికి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌కు, ఇతర జిల్లాలకు ఎంతో తేడా ఉంటుంది. జిల్లాలో మొత్తం 486 గ్రామపంచాయతీలకు గానూ సుడా కిందికి 264 పెద్ద గ్రామపంచాయతీలు, సూర్యాపేట, తిరుమలగిరి, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీలను తీసుకున్నారు. ఇప్పటివరకు మున్సిపాలిటీల్లో చైర్మన్, కౌన్సిలర్లు, పంచాయతీలకు సర్పంచ్‌లు, కౌన్సిలర్లు పాలక వర్గాలు ఉండగా.. ఇకపై అంతా ఉత్సవ విగ్రహాలుగా మారనున్నారు. సుడాకు రాజకీయ పార్టీ నుంచి నామినేటెడ్ చైర్మన్ రానుండగా అధికారాలన్నీ చైర్మన్ చేతికి వెళ్లన్నాయి.
ప్రస్తుతం గ్రామాలు, మున్సిపాలిటీల్లో ఏ పని కావాలన్నా స్థానిక సంస్థలకే వెళ్తుండగా, సుడా ఏర్పాటుతో ఎలాంటి పని కోసమైనా ఆ కార్యాలయానికే వెళ్లాల్సి ఉంటుంది. గ్రామాల్లో ఓ చిన్న ఇల్లు నిర్మించుకోవాలంటే ఇప్పటి వరకు సెక్రటరీ అనుమతి ఇవ్వగా, ఇకపై సుడా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేగాక లేఅవుట్లు, డ్రైయినేజీలు, రోడ్లు వేయాలన్నా, ఎలాంటి అభివృద్ధి పనులు కావాలన్నా సుడాను ఆశ్రయించాల్సిందే.
జిల్లాలోని దాదాపు 70 శాతం ప్రాంతాలను కలుపుతూ సుడాగా ఏర్పాటు చేస్తే అభివృద్ధి ఎండమావిగానే మారుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు మున్సిపాలిటీలు, పంచాయతీలకు భవన నిర్మాణ అనుమతులు, తాగునీరు, ఇంటి పన్నులు ఇలా పలు రకాల ఆదాయం వస్తుండగా వాటితో అభివృద్ధి పనులు చేస్తూనే ఉద్యోగులు, సిబ్బంది జీతభత్యాలకు వినియోగిస్తున్నారు. సుడా ఏర్పాటుతో పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఇప్పుడు వచ్చే ఆదాయం 10 శాతం కూడా రావడమే గగనమే. ఇప్పటికే భువనగిరి జిల్లాలో వైటీడీఏ ఏర్పాటు కాగా, కొన్ని గ్రామాలు హెచ్ఎండీఏ, కొన్ని వైటీడీఏలో ఉన్నాయి. దాదాపు ఆరు కోట్ల రూపాయలు నెలల తరబడిగా అటు హెచ్ఎండీఏకు, ఇటు మున్సిపాలిటీకి ఇవ్వకుండా వైటీడీఏ వద్దే ఉంటున్నట్లు సమాచారం.