మోటకొండూర్, ఫిబ్రవరి 5 : కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కుల గణన సర్వే అంతా తప్పులతడకగా ఉందని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. బుధవారం మోటకొండూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గత కేసీఆర్ ప్రభుత్వం 2014లో పండుగ వాతావరణంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిందని, ప్రతి ఒక్కరూ సర్వేలో పాల్గొన్నారని గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్‌ను తుంగలో తొక్కి, కులగణన పేరుతో కాలయాపన చేయడమే గాక కోట్ల రూపాయలు వృధా చేసిందని మండిపడ్డారు.
సర్వే పూర్తిస్థాయిలో చేయలేదని, రాష్ట్రంలో ఇంకా 3.1శాతం కుటుంబాలు మిగిలి ఉన్నాయని చెప్పడం ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనమని పేర్కొన్నారు. కుల గణన సర్వే అంతా బోగస్ అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీనే చెప్పి సర్వే పత్రాలను తగుల బెట్టారని గుర్తుచేశారు. 14 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఒరగబెట్టింది ఏమీలేదని, నమ్మించి మోసం చేసే ప్రభుత్వంగా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. అంతకుముందు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సింగిరెడ్డి నర్సిరెడ్డికి కాలు ఆపరేషన్ కాగా ఆయన్ని, చామాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ మండలాధ్యక్షుడు యెల్లంల సంజీవరెడ్డి తల్లి మణెమ్మ ఇటీవల మృతి చెందగా ఆయన్ని పరామర్శించారు. కార్యక్రమాల్లో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, బీఆర్ఎస్ నాయకులు భూమండ్ల ఐలయ్య, బొట్ల నర్సింహ, అనంతుల జంగారెడ్డి, ఎండీ బురాన్, మల్గ గౌరయ్య, సిరబోయిన నర్సింగ్‌యాదవ్, జివిలికపల్లి వెంకటేశ్, బొట్ల మహేశ్, దడిగ మధు, బొట్ల ప్రశాంత్ పాల్గొన్నారు.