ఆలేరు టౌన్, అక్టోబర్ 1: ఆలేరు పట్టణం, మం డల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన సుమారు 400 మంది ఆటో కార్మికులు ఆటోలమీదనే ఆధారపడి కుటుంబాలు పోషించుకుంటున్నారు. ఇదే వృత్తిని నమ్ముకొని వందల కుటుంబాలు 30 సంవత్సరాలుగా జీవిస్తున్నా యి. గత ప్రభుత్వం ఆటోలపై ట్యాక్స్ ఎత్తివేసి జీవితాంతం ఆదుకున్నది. దీంతో ఆటో డ్రైవర్ల జీవనం, కుటుంబ పోషణ సాఫీగా సాగుతున్న తరుణంలో 20 నెలల క్రితం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్సు పథకం ప్రవేశపెట్టింది. దీంతో ఆటో డ్రైవర్లు ఈ పథకాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ నగరంలో ధర్నా నిర్వహిస్తే ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆటో కార్మికులకు అన్యాయం జరుగకుం డా చూస్తామని, ఏడాదికి రూ,12వేలు, హెల్త్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పడం తో కార్మికులు ధర్నా విరమించారు. అయితే ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావొస్తున్నా తమకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందంటూ కార్మికులు మండిపడుతున్నారు. ఆటో కార్మికులు గతంలో ఆలేరు నుంచి భువనగిరికి రోజుకు 4 ట్రిప్పులు నడిపితే ఇప్పుడు రోజుకు ఒక ట్రిప్పు కొట్టడమే కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో తాము రోజుకు రూ.1500 నుంచి 2వేల వరకు సంపాదిస్తే, ఇప్పుడు రోజుకు రూ. 500 సంపాదించడమే కష్టమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో పెద్ద పండుగలైన బతుకమ్మ, దసరాల సందర్భంగా గతంలో రూ.40వేల వరకు సంపాదించేవారమని వారు వాపోతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మహిళాలకోసం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకంతో ఆటో కార్మికుల జీవితాలు అగమ్య గోచరంగా మారాయి. పిల్లల స్కూలు ఫీజులు కట్టలేక, కుటుంబ అవసరాలు తీర్చలేక, ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. పండుగ పూట చేతిలో చిల్లిగవ్వలేక పస్తులుండాల్సిన పరిస్థితి దాపురించింది. కుటుంబ పోషణ భారమై ,అప్పుల పాలై, ఆత్మహత్యలు చేసుకొనే పరిస్థితి ఏర్పడింది.
ఆటో కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏడాదికి రూ,12వేలు, హెల్త్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామనే హామీలను తుంగలో తొక్కడంతో ఆటో కార్మిక కుటుంబాల బతుకులు ఆగమయ్యాయి. మార్పు..మార్పు అం టూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్తే తమ బతుకులే ఏమారిపోయాయని కార్మికులంటున్నారు. గతంలో ఆటో కార్మికుల ఇన్సూరెన్స్ రూ.6500 ఉంటే ఈ ప్రభుత్వ దానిని రూ.8500 పెంచిం ది. ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు ఫ్రీ బస్సు పుణ్యాన అంటూ ఆటోలు ఎక్కకపోవడంతో కార్మికులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.