వరుణదేవుడు కరుణిస్తాడనుకున్న అన్నదాతకు కన్నీళ్లే మిగులుతున్నాయి. నాలుగు గింజలు పండించుకొని కుటుంబాలను పోషించుకుందామనుకుంటే ఇటు ప్రకృతి సహకరించడం లేదు.. అటు ప్రభుత్వమూ కనికరించడం లేదు. అదునులో ప్రభుత్వం నుంచి సహకారం లభించక.. వర్షాలు సమృద్ధిగా కురవక అన్నదాతలు అల్లాడిపోతున్నారు. భారీ వర్షాలు కురిసి భూగర్భ జలాలు పెరుగుతాయని వరుణదేవుడిపై భారం ఉంచి వరి పంట సాగు చేస్తే.. నేడు అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయి.
సమయానుకూలంగా వర్షాలు కురవకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి బోర్లు ఎండిపోయాయి. పంట చేతికొచ్చే సమయంలో నీళ్లు అందక ఎండిపోతోంది. చేసేది లేక కొందరు రైతులు పంట చేలను పశువులకు మేతగా వదిలేస్తున్నారు. మరి కొందరు వాటర్ ట్యాంకర్ల ద్వారా పంటను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నా ప్రభుత్వం మాత్రం చేష్టలుడిగి చూస్తోంది.
మనుగోడు రూరల్, మార్చి 26: వానకాలం పడిన అధిక వర్షాలతో భూగర్భ జలాలు సమృద్ధిగా ఉంటాయని నమ్మిన రైతుల ఆశలు అడియాసలయ్యాయి. వేసవి ప్రారంభంలోనే బోర్లలో నీరు అడుగంటడంతో చేతికొచ్చిన పంట ఎండుముఖం పట్టడంతో ఆందోళన చెం దుతున్నారు. దిక్కు తోచని స్థితిలో కొందరు ప్రైవేటుగా నీటి ట్యాంకర్లను అద్దెకు తీసుకొని పంటలకు నీరు పారిస్తున్నారు. అధికంగా వరి పంట సాగు చేసిన రైతులు ఇప్పుడు కన్నీరు మున్నీరవుతున్నారు. కొందరు కొత్తగా బోర్లు వేస్తున్న పరిస్థితులూ ఉన్నాయి. మునుగోడు మండలంలోని ఊకొండి, పులిపలుపుల, రత్తిపల్లి, సింగారం, గుండ్లోరిగూడెం, మునుగోడు, చీకటిమామిడి, కోతులారం, ఇప్పర్తి లాంటి గ్రామాల్లో ఈ పరిస్థితులు నెలకొన్నాయి.
మునుగోడు మండలంలో యాసంగి వరి పం టను 8 వేల ఎకరాల్లో సాగు చేశారు. వర్షాకాలంలో బోర్లు నిండుగా పోయడంతో యాసంగిలో నీటి సమస్య రాదని నమ్మిన రైతులు గతేడుకంటే ఎక్కువ వరి సాగు చేశారు. మరో నెల రోజుల్లో పంట చేతికొచ్చే సమయంలో బోర్లు ఎండిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటి పది నిమిషాలు కూడా నీరు రావడం లేదు. పంట చేతికొచ్చే సమయంలో ఎండిపోతుంటే ఏమి చేయాలో అర్థం కాక కన్నీరుమున్నీరవుతున్నారు.
కొందరు అప్పులు చేసి కొత్త బోర్లు వేస్తున్నా ప్రయోజనం ఉండటం లేదు. మరి కొందరు ప్రైవేటు నీటి ట్యాంకులను అద్దెకు తీసుకొని రోజుంతా ఇతర చోట్ల నుంచి నీళ్లు తెచ్చి పంటకు పారిస్తున్న పరిస్థితులు ఉన్నా యి. గతంలో ఎప్పుడూ చూడనంత గడ్డు పరిస్థితులు చూస్తున్నామని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే మండలంలో 40శాతం పంట ఎండిపోతోందని తెలిసింది. తమను ప్రభుత్వం ఆదుకోవాలని, నీటి సౌకర్యం కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
వరి పంటకు బోనస్ ఇచ్చే మాట దేవుడెరుగు.. పంట చేతికొచ్చేలా లేని పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, వ్యవసాయ శాఖ రైతులను ఆదుకునేందుకు ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉంది. కన్నబిడ్డలా పెంచిన వరి పంట కండ్ల ఎదుటే ఎండిపోతుంటే రైతులు విలవిలల్లాడుతున్నారు. ఎకరానికి సుమారు రూ.20 వేల వరకు పెట్టుబడి పెట్టి పంట సాగు చేశారు. పెట్టుబడి సమయంలో ఇవ్వాల్సిన రైతు భరోసా పంట చేతికొచ్చే వరకూ అందలేదు.
సొంత డబ్బుతో సాగు చేస్తున్నారు. అధికార యంత్రాంగం మా త్రం చేష్టలుడిగి వ్యవహరిస్తోంది. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా మరింత భారంగా మారుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు సరైన సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో నీరు పోసే బోర్లు ఉన్నా ఇబ్బందులు తలెత్తుతున్నాయని రైతులు పేర్కొంటున్నారు. పరిస్థితి చేయి దాటకముందే ప్రభుత్వం మేల్కొని రైతులకు అండగా ఉండాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
యాసింగిలో రెండు ఎకరాల్లో వరి పంట వేశాను. ప్రారంభంలో బోరు బాగానే పోసింది. రానురానూ నీరు తగ్గిపోయింది. ఇప్పుడు కొన్ని, కొన్ని పోసి బంద్ అవుతున్నది. ఆ కొన్ని నీళ్లు పూర్తి స్థాయిలో పెడదామనుకుంటే కరెంటు కోతలు వేధిస్తున్నాయి. పంట ఎండి పోయింది. ఇప్పుడేం చేయాలి? అధికారులు, ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని మనవి.
-ఉప్పునూతల నగేశ్, పులిపలుపుల
ఇతరుల భూమిని కౌలుకు తీసుకొని వరి పంట వేశాను. ఎండల ప్రారంభంలోనే బోర్లు పోయడం తగ్గింది. ఇప్పుడు పూర్తిగా పోయడం లేదు. కౌలుకు తీసుకొని పెట్టుబడి పెట్టిన పంట పోతుంటే వదిలేయలేక పోతున్నా. ఎకరానికి 4 ట్యాంకర్ల నీటిని కొనుగోలు పోసి పంటను కాపాడుకుంటున్నాను. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. నష్టపోయిన మాకు ప్రభుత్వం అండగా ఉండాలి.
-బోయపల్లి రాజు, ఊకొండి
బోర్ల మీద ఆధారపడి నాకున్న 30 గుంటల భూమిలో వరి సాగు చేశాను. బోర్లు ఎండిపోయాయి. దీంతో పంటను వదిలేశాను. ఇప్పుడు అది పశువులకు మేతగా మారింది. భూగర్భ జలాలపై నమ్మకం పెట్టుకుంటే రైతులు మునిగే పరిస్థితి ఉంది. ఉదయ సముద్రం ప్రాజెక్టును పూర్తి చేసి సాగునీరు అందజేస్తే ఈ సమస్యలుండవు. వ్యవసాయంపై ఆధారపడి బతికే రైతుల పరిస్థితి అర్థం కాకుండా ఉంది. ప్రభుత్వం మునుగోడు రైతులను ఆదుకోవాలి.
-కోడి మల్లయ్య, సింగారం