భారత్ మాల పరియోజన కింద హైదరాబాద్‌కు ఉత్తర భాగాన గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాంతీయ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) భూ సేకరణలో కదలిక వచ్చింది. ట్రిపుల్ ఆర్ నిర్మాణం కోసం అడుగులు పడ్డాయి. ఈ మేరకు అధికారులు 3జీ నోటిఫికేషన్ విడుదల చేశారు. చౌటుప్పల్ డివిజన్లోని ఏడు గ్రామాల నిర్వాసితులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 26వరకు చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయంలో గ్రామాల వారీగా సమావేశాలు నిర్వహించి.. విచారణ తర్వాత భూములకు ధరలను నిర్ణయించనున్నారు. భూపరిహారం కోసం అవార్డు ఎంక్వైరీ చేపట్టనున్నారు.
ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్‌లో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని గిర్మాపూర్ నుంచి మెదక్, సిద్దిపేట జిల్లాల మీదుగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ వరకు హైదరాబాద్ ఉత్తర భాగం తొలి విడుతలో రీజినల్ రోడ్డు నిర్మించనున్నారు. 159 కిలోమీటర్ల మేర 100 మీటర్ల వెడల్పుతో రోడ్డు నిర్మించాలని ప్రతిపాదించారు. ఇందుకు అనుగుణంగా చౌటుప్పల్, వలిగొండ, భువనగిరి, యాదగిరిగుట్ట, తుర్కపల్లి మండలాల పరిధిలోని 34 రెవెన్యూ గ్రామాల్లో భూసేకరణ చేపట్టనున్నారు.
చౌటుప్పల్, వలిగొండ మండలాల్లో భూ సేకరణకు ఈ నెల 7న అధికారులు 3జీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆయా మండలాల్లోని పలు గ్రామాల మీదుగా ట్రిపుల్ ఆర్ రోడ్డు వేయనున్నారు. ఇందులో భాగంగా 133.178 కి.మీ నుంచి 156.045 కి.మీ. వరకు రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. చౌటుప్పల్ మండలంలోని తాళ్ల సింగారం, నేలపట్ల, చిన్నకొండూరు, వలిగొండ మండలంలోని పొద్దుటూరు, పహిల్వాన్‌పురం, గోకారం, రెడ్లరేపాక, వర్కట్‌పల్లి మీదుగా గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం జరుగుతుంది.
చౌటుప్పల్, వలిగొండ మండలాల్లోని వివిధ గ్రామాల నుంచి 550 ఎకరాల భూమిని సేకరించనున్నారు. ఇందుకోసం సోమవారం నుంచి ఈ నెల 26 వరకు ఆయా గ్రామాల వారీగా చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయంలో సమావేశాలు నిర్వహించి విచారణ చేపట్టనున్నారు. నిర్వాసితులు తమ భూములకు సంబంధించి ఒరిజినల్ పత్రాలు, పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంక్ పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, పాన్ కార్డుతోపాటు వాటి జిరాక్స్ కాపీలను తీసుకొని సమావేశాలకు హాజరుకావాలి. ఆయా నిర్వాసితులు భూమిపై ఉన్న హక్కును ధ్రువపరుచుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ నిర్ణీత సమయంలో ైక్లెయిమ్లు, డాక్యుమెంట్లు సమర్పించకపోతే రికార్డులను అనుసరించి నష్టపరిహారం లెక్కించరు.
ట్రిపుల్ ఆర్ భూసేకరణకు అడుగులు పడటంతో అందరి దృష్టి రాయగిరి వైపు మళ్లినట్లయ్యింది. ప్రస్తుతానికి హైకోర్టులో స్టే ఉండగా, అలైన్మెంట్ మారుతుందా..? లేదా అనేది తేలాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మారుస్తామని హామీ ఇచ్చింది. ప్రస్తుత ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ట్రిపుల్ ఆర్ బాధితులతో కలిసి నాడు ధర్నా కూడా చేశారు. అధికారంలోకి వచ్చాక కలెక్టరేట్లో జరిగిన సమీక్ష అనంతరం కూడా అలైన్మెంట్ మారుస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి స్పష్టత, కదలిక లేదు.
ఆయా గ్రామాల భూ నిర్వాసితులు ఈ నెల 10 నుంచి 26 వరకు ఉదయం 11గంటలకు చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయంలో జరిగే సమావేశానికి హాజరు కానున్నారు. 10వ తేదీన చౌటుప్పల్ మండలంలోని తాళ్లసింగారం, 12న నేలపట్ల, 14న చినకొండూరు, 18న, వలిగొండ మండలంలోని పొద్దుటూరు, 20న పహిల్వాన్‌పురం, 22న గోకారం, 24న రెడ్లరేపాక, 26న వర్కట్‌పల్లి గ్రామాల నిర్వాసితులకు సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ మీటింగ్‌లో ఎంత భూమి పోతుంది..? మార్కెట్ విలువ ఎంత..? కోల్పోయిన భూమికి నష్టపరిహారం ఎంత చెల్లిస్తారు ? అనే విషయాలను వివరిస్తారు. ఒక వేళ అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తారు. ఇందులో భూ సేకరణకు సంబంధించి రేటును నిర్ణయించాక రైతుల నుంచి అనుమతి కూడా తీసుకోనున్నారు. ఆ తర్వాత మళ్లీ జనరల్ అవార్డు పాస్ చేస్తారు. ఫైనల్‌గా అంతా సరిగా ఉంటే నిర్వాసితుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు.
జిల్లాలో మూడు సెక్షన్లలో(కాలా) భూ సేకరణ చేపడుతున్నారు. చౌటుప్పల్ డివిజన్లో చౌటుప్పల్, వలిగొండతోపాటు భువనగిరి డివిజన్లో రెండు సెక్షన్లు ఉన్నాయి. యాదగిరిగుట్ట, తుర్కపల్లి ఒక కాలా కాగా, భువనగిరి మండలంలో మరో సెక్షన్ ఉంది. యాదగిరిగుట్ట, తుర్కపల్లి ఇప్పటికే భూసేకరణకు అవార్డు ఎంక్వైరీ పూర్తయ్యింది. రాయగిరికి సంబంధించి హైకోర్టు స్టే ఉండటంతో పెండింగ్‌లో ఉంది. కాగా చౌటుప్పల్ మండల పరిధిలో చౌటుప్పల్ పట్టణం, లింగోజిగూడ వద్ద జంక్షన్లు, అలైన్మెంట్లో మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి. దాంతో ఈ రెండు గ్రామాలకు కూడా అవార్డు ఎంక్వైరీ పెండింగ్‌లో ఉంచారు.