కోదాడ రూరల్, మే 21 : పిడుగుపాటుకు 36 మేకలు మృతిచెందాయి. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధి నల్లబండగూడెం శివారు మంగళతండా రోడ్డులో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లబండగూడెం గ్రామానికి చెందిన బడుగు లక్ష్మయ్యకు చెందిన మేకలు మంగళతండా రోడ్డులోని రైస్ మిల్ ఎదురుగా ఉన్న పొలంలో మేత మేస్తున్నాయి. మబ్బులు కమ్మి వాన చిలుకలు పడుతుండడంతో మేకల మంద ఒక్కసారిగా సమీపంలోని చెట్టు కిందకు చేరాయి.
అదే సమయంలో పిడుగు పడడంతో 36 మేకలు మృతిచెందాయి. మేకలకు దూరంగా ఉండడంతో కాపరి ప్రాణాలు దక్కాయి. సమాచారం అందుకున్న పశు వైద్యాధికారి, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామ చేశారు. మేకలు అమ్మి కూతురి వివాహం చేయాలనుకున్న లక్ష్మయ్యకు మేకల మృతి ఆవేదన భరితమైంది. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు, స్థానికులు కోరారు.