నందికొండ, ఆగస్టు 4 : నాగార్జున సాగర్ రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో భారీగా పెరుగడంతో నిండుకుండలా మారింది. జూలై 25 నుంచి నాగార్జునసాగర్‌కు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఇన్‌ఫ్లో ప్రారంభం కాగా 503 అడుగుల నుంచి క్రమంగా నీటి మట్టం పెరుగుతూ వచ్చింది. 15 రోజుల్లోనే 574.90 (268.86టీఎంసీలు) అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులకుగానూ ఇంకా 15 (44 టీఎంసీలు) అడుగులు మాత్రమే నిండాల్సి ఉన్నది.
ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ 10 క్రస్ట్ గేట్లు, జల విద్యుత్ కేంద్రాల ద్వారా 3,21,873 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో సాగర్‌కు వచ్చి చేరుతున్నది. రోజుకు 27 టీఎంసీల చొప్పున వస్తుండడంతో మరో రెండు రోజుల్లో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండనుంది. రిజర్వాయర్ నీటి మట్టం 580 అడుగులకు చేరగానే డ్యామ్ క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తారు. డ్యామ్ క్రస్ట్ గేట్లను సోమవారం ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడానికి ఎన్నెస్పీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
రిజర్వాయర్‌కు మొత్తం 3,21,873 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 37,873 క్యూసెక్కుల అవుట్ ఫ్లో కొనసాగుతున్నది. ప్రస్తుతం కుడికాల్వ ద్వారా 5,700, ఎడమ కాల్వ ద్వారా 4,613 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీ ద్వారా 1,200, వరద కాల్వ ద్వారా 320 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్నది. ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా నీటి విడుదల లేదు.
లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలి : ఎన్నెస్పీ సీఈ నాగేశ్వర్రావు
నాగార్జునసాగర్ డ్యామ్ క్రస్ట్ గేట్ల ద్వారా సోమవారం ఉదయం 8 గంటలకు 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న టెయిల్‌పాండ్‌కు విడుదల చేస్తున్నాం. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలి. నదిలో చేపల వేటకు మత్స్యకారులు వెళ్లరాదు. వరద ప్రవాహానికి వలలు కొట్టుకుపోతాయి. నదిలో వేసిన పైపులు, మోటర్లను రైతులు తీసివేయాలి. లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాల్సిందిగా ఎన్నెస్పీ అధికారులకు సూచించాం.
పనిచేయని జల విద్యుత్ కేంద్రం రెండో టర్బైన్
నాగార్జునసాగర్ డ్యామ్‌కు ఈ ఏడాది భారీగా వరద నీరు వచ్చి గేట్లు ఎత్తనున్నారు. దిగువకు నీరు వృథాగా పోనున్నది. కానీ ఒక టర్బైన్ మరమ్మతుల కారణంగా డ్యామ్ ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసే పరిస్థితి లేకుండా పోయింది. గతేడాది నుంచి సమయం చాలా ఉన్నా జెన్కో అధికారులు నిర్లక్ష్యంగా వదిలేశారు. డ్యామ్ ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో మొత్తం 8 టర్బైన్లు ఉండగా ఏడు పనిచేస్తున్నాయి. రెండో టర్బైన్ మరమ్మతు పనులు ఇంకా పూర్తి కాలేదు.
ప్రతియేటా లక్షల రూపాయలు వెచ్చించి మరమ్మతుల పేరుతో ఖర్చు చేస్తున్న జెన్కో అధికారులు సకాలంలో పనులను పూర్తి చేయలేక పోతున్నారు. జల విద్యుత్ కేంద్రం ద్వారా మొత్తం 800 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉండగా ఇప్పుడు 2 టర్బైన్ పని చేయకపోవడంతో 700 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేపడుతున్నారు. అధికారులు కాంట్రాక్టుల కమీషన్ల కోసమే పనులు జ్యాపం చేస్తున్నారని సిబ్బంది అనుకుంటున్నారు. దీనిపై జెన్కో ఎస్ఈని వివరణ కోరగా టర్బైన్ మరమ్మతులకు జపాన్ నుంచి నిపుణులు రావాల్సి ఉన్నదని, వారు రాకపోవడంతో రెండో టర్బైన్ మరమ్మతుల పనుల్లో ఆలస్యమైందని తెలిపారు.
సాగర్ దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్
నల్లగొండ : నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి సోమవారం నీటిని విడుదల చేయనున్న నేపథ్యంలో దిగువన ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలెవరూ నదిలోకి వెళ్లొద్దని, స్నానాలు చేయొద్దని, ఈత కొట్టొద్దని పేర్కొన్నారు. పశువులు, మేకలు, గొర్రెలను నదిలోకి తీసుకెళ్లొద్దని తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వచ్చే వరదను బట్టి నీటి విడుదల ఉంటుందని, ఆస్తి, ప్రాణ నష్టం జరుగకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ సూచించారు.