యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 30: స్థానిక సంస్థలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు ప్రారంభమయ్యాయని ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీత, ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో పార్టీలో మరిన్ని చేరికలు ఉంటాయన్నారు. ఇప్పటికే ఆలేరు నియోజకవర్గంలోని పలువురు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు తమతో టచ్‌లోకి వచ్చారని స్పష్టం చేశారు. యాదగిరిగుట్టలో కాం గ్రెస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. ఆలేరు మండలంలోని శారాజీపేట గ్రామానికి చెందిన ఆలేరు మాజీ వైస్ ఎంపీపీ బెంజారం రవిగౌడ్, మాజీ సర్పంచ్ బెంజారం రజిని, కాంగ్రెస్ నాయకులు చిలుకు రేణుక, చిలుకు వెంకటేశ్, నిరోషా, పుట్టల స్వామి, గణేశ్, బాలరాజు, అంజయ్య, పెండ్యాల ప్రకృతిరాజుతో పాటు 300 మంది కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేశారు.
ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గొంగిడి సునీత మాట్లాడుతూ..మోసపూరిత వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టే సమయం వచ్చిందన్నారు. ఎక్కడికి వెళ్లినా ఏ ఒక్క హామీ నెరవేరలేదంటూ జనం బాధతో ఉన్నారన్నారు. కేసీఆర్‌ను కాదని, కాంగ్రెస్ పార్టీని గెలిపించి చాలా తప్పు చేశామన్న ఆవేదనలో ప్రజలు ఉన్నారన్నారు. సకాలంలో విద్యుత్ రావడం లేదన్నారు. రైతుబంధు, ఆసరా పెన్షన్, కల్యాణలక్ష్మి, తులం బంగారం, నిరుద్యోగ భృతి, విద్యార్థినులకు స్కూటీలు రాలేదన్నారు. ఇలా 420 హామీలు అమలు చేయడంలో సీఎం రేవంత్‌రెడ్డి పూర్తిగా విఫలమయ్యాడన్నారు. ఎక్కడికి వెళ్లినా కేసీఆర్ సార్ మళ్లీ అధికారంలోకి వస్తేనే తమ బతుకులు బాగుపడతాయని జనం పూర్తిగా నమ్ముతున్నారన్నారు. కేసీఆర్‌ను దూరం చేసుకొని చాలా బాధపడుతున్నట్లు జనం తమతో చెబుతుంటే భావోద్వేగానికి లోనవుతున్నామన్నారు. ఇంత చేసిన.. కేసీఆర్ సారుకు తాము మోసం చేశామన్న ఆలోచన ప్రజల మనసులో ఉండిపోయిందన్నారు.
ఏ క్షణం లో ఎన్నికలు వచ్చినా ఈసారి కేసీఆర్‌ను సీఎంను చేసేందుకు జనం ఆరాటపడుతున్నారని స్పష్టం చేశారు. పదేండ్ల పాలనలో దసరా పండుగ వస్తే బతుకమ్మ చీరలు అందజేశారని అన్నారు. రెండేండ్ల కాలంలో ఒక్క చీరను కూడా ఇవ్వలేని అసమర్థ పాలన కాంగ్రెస్‌దన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచి పాలనలో ఫెయిలైన కాంగ్రెస్ పార్టీని బొందపెట్టే సమయం వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు సభ్యులుగా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తే గెలుపు ఖాయమనే వాతావరణం నెలకొన్నదన్నారు. సర్వేలన్నీ బీఆర్ఎస్కే జై కొడుతున్నాయని గొంగిడి సునీత తెలిపారు. ఇప్పటి వరకు మహిళలు, వృద్ధులు, రైతులకు ప్రభుత్వం బాకీ పడిందని, త్వరలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వ బాకీ కార్డులను పం పిణీ చేస్తామన్నారు. స్థానిక సంస్థలు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓటుతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు సిద్ధం కావాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ..ఆలేరు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి అడ్డా అన్నారు.
గతంలో పార్టీ మారిన వారితో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమయ్యారని స్పష్టం చేశారు. ఎంతో మంది నాయకులు తమకు టచ్‌లోకి వచ్చారన్నారు. ఇప్పటికే శారాజీపేట గ్రామంలో దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయినట్టేనని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నందున మరిన్ని చేరికలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఆలేరు మా ర్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ యాదవ్, పార్టీ సెక్రటరీ జనరల్ రచ్చ రాంనర్సయ్య, శారాజీపేట బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు బండ మహేందర్, ఆయా గ్రామశాఖల అధ్యక్షుడు ఆశయ్య, సోషల్ మీడియా కన్వీనర్ శ్రీధర్, ఉప సర్పంచ్ కంది మహేందర్, నాయకులు అశోక్‌గౌడ్, శ్రీధర్‌గౌడ్, శనిగరం రవి, కడారి బాలయ్య, రచ్చ కావ్య, సిద్ధేశ్వర్, సముద్రాల కుమార్ తదితరులు పాల్గొన్నారు.