– గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
దేవరకొండ, నవంబర్ 15 : నల్లగొండ జిల్లా గుడిపల్లి మండలంలోని చిలకమర్రి గ్రామానికి చెందిన సుమారు 30 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరాయి. శనివారం దేవరకొండ పట్టణంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మోసపూరిత హామీలకు ప్రజలు విసుగుచెంది బీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు. పదేండ్ల పాలనలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను ఎంతో అభివృద్ధి చేశారన్నారు. గత యాసంగిలో రైతులకు రావాల్సిన బోనస్ ఇంకా వారి ఖాతాలో జమ కాలేదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వల్లపు రెడ్డి, దామోదర్ రెడ్డి, చింతపల్లి సుభాష్ గౌడ్, రాజు, కృష్ణ పాల్గొన్నారు.