నకిరేకల్, జూలై 18: గంజాయి విక్రయిస్తూ, తాగుతున్న 10మంది నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.83,500 విలువ గల 3.340 కిలోల గంజాయి, 10 సెల్ఫోన్లు, రూ.9,500 నగదును స్వాధీనం చేసుకున్నామని, ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. ఈమేరకు నకిరేకల్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం విలేకరులతో నిందితుల వివరాలు వెల్లడించారు. కొంతకాలంగా నకిరేకల్‌లో నివాసముంటూ నారాయణ స్వామి డెయిరీ ఫామ్‌లో నకిరేకల్ పట్టణానికి చెందిన ఎ2 కిశోర్ టండన్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
గంజాయి విక్రయిస్తూ సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఒడిశా రాష్ట్రంలోని కిశోర్ సొంత గ్రామానికి చెందిన వరుసకు అన్న అయినటువంటి ఎ1 బోలనాథ్ వద్ద తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి అక్కడినుంచి తీసుకువచ్చి నకిరేకల్‌లో రైస్ మిల్లులో పనిచేస్తున్న ఎ3 అర్జున్ కుమార్, ఎ4 అనిల్ మండల్, ఎ5 అబ్బు, ఎ6 బికాస్, ఎ7 వికాస్‌లను పరిచయం చేసుకొని ఒక్కొక్కరికీ 500 గ్రాముల చొప్పున ఎక్కువ ధరకు గంజాయిని విక్రయించాడు. గంజాయి ఎక్కువగా తాగుతున్న ఎ8 క్రాంతి, ఎ9 సంతు, ఎ10 అఖిల్‌రెడ్డి, ఎ11 సియాం, ఎ12 శ్రీకాంత్, ఎ13 నాగేందర్ మరికొంత మందికి ఒక్కొక్కరికీ 50 గ్రాములు చొప్పున అమ్ముతున్నారు. మొత్తం 13 మందిలో 10 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించినట్లు డీఎస్పీ తెలిపారు.
గురువారం సాయంత్రం నకిరేకల్ పట్టణ శివారులోని సాయి ప్రియ హోటల్ వెనుక గడ్డివాము పక్కన ఓ ఇంట్లో అక్రమంగా గంజాయి అమ్ముతున్నారన్న సమాచారం మేరకు దాడులు చేసినట్లు తెలిపారు. ముగ్గరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా ప్రత్యేక స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నామని, నల్లగొండ జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడం కోసం మిషన్ పరివర్తన్ కార్యక్రమంతో మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన అనేక మందిని కౌన్సెలింగ్ నిర్వహించి వారిలో మార్పు తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. సమావేశంలో నకిరేకల్ సీఐ రాజశేఖర్, రూరల్ సీఐ కొండల్‌రెడ్డి, ఎస్ఐ లచ్చిరెడ్డి, పోలీసు సిబ్బంది వెంకటేశ్వర్లు, సుధాకర్, సురేశ్, శ్రీకాంత్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
తిరుమలగిరి(సాగర్), జూలై 18: గంజాయి కలిగిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ వీరశేఖర్ తెలిపారు. తిరుమలగిరి శివారులో శివరాత్రి దుర్గాప్రసాద్, వరికుప్పల దిలీప్‌కుమార్, వరికుప్పల ప్రశాంత్, తుడుం ధనుంజయ్ గంజాయి కలిగి ఉన్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు దాడి చేసి శివరాత్రి దుర్గాప్రసాద్, వరికుప్పల దిలీప్‌కుమార్, వరికుప్పల ప్రశాంత్‌లను పట్టుకోగా తుడుం ధనుంజయ్ పారిపోయాడన్నారు. పట్టుబడిన వారి నుంచి 96 గ్రాముల గంజాయి, రెండు ఫోన్లు, ఒక బాంగ్ బాటిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన వారిని రిమాండ్‌కు పంపించామన్నారు.