మిర్యాలగూడ, నవంబర్ 21 ; ‘వ్యవసాయానికి 24గంటల కరెంట్ వద్దు.. 3 గంటలు చాలు’ అని కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై రైతాంగం కన్నెర్ర చేస్తున్నది. రైతులకు వ్యతిరేకంగా అడ్డగోలుగా వాగిన రేవంత్‌రెడ్డిపై మండిపడుతున్నది. స్వరాష్ట్రంలో ఇప్పుడిప్పుడే పచ్చబడుతున్న రైతుల జీవితాల్లో నిప్పులు పోయాలనే కుట్రలను ఖండిస్తున్నది. 24 గంటల కరెంట్ సరఫరాను చూసి ఓర్వలేక అవగాహన లేమి ప్రకటనలు చేస్తున్నారని దుమ్మెత్తిపోస్తున్నది. వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ ఎట్ల సాల్తదని ప్రశ్నిస్తున్నది. ఎద్దు, ఎవుసం తెల్వకుండా ఎట్ల మాట్లాడుతరని ధ్వజమెత్తుతున్నది.
10 హెచ్‌పీ మోటర్ అంటే లక్ష రూపాయలు కావాలి
సాగు చేసే రైతులకు తెలుస్తుంది అందులో బాధలేందో. నాకు మూడెకరాల పొలం ఉంది బోరు ఆధారంగానే సాగు చేస్తాను. గత సమైక్య పాలనలో నీళ్లు, కరెంటు లేక, అప్పులు పుట్టక ఎన్నో రకాల అష్టకష్టాలను ఎదుర్కొన్నాం. నేడు సీఎం కేసీఆర్ వ్యవసాయానికి అందిస్తున్న ప్రోత్సాహాకాలతో మేము ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగుచేసుకుంటూ ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటా ఉన్నం. ఎలక్షన్లు వచ్చినాయనీ ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్లు మాట్లాడడం సరికాదు. రైతులకు అన్ని విషయాలు తెలుసు, రేవంత్‌రెడ్డి అన్నట్లుగా ఎకరానికి మూడు గంటల కరెంటు సరిపోదు. మూడుగంటల పాటు ఇస్తే మూడు మడులు కూడా పారవు, దీనికి తోడు 10 హెచ్‌పీ మోటరు బిగించుకుంటే మోటర్‌కు లక్ష రూపాయల ఖర్చు వస్తుంది. ట్రాన్స్ఫార్మర్ల కెపాసిటీ సరిపోదు, మా ఊర్లో ఎక్కువగా బోర్లపైనే పొలాలు సాగుచేసుకుంటాము, గంట పారితే ఊట అంతా పోయి అన్ని బోర్లు వట్టి పోతాయి. ఏది ఎంత వాడుకోవాలో అంతే వాడాలి, వ్యవసాయం తెలవనోళ్లు ఇష్టానుసారంగా మాట్లాడి రైతులను కించపరుస్తున్నారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ ఇస్తున్న నాణ్యమైన కరెంటుతో మేం హాయిగా సాగుచేసుకుంటానం ఇప్పుడు మాకొచ్చిన తిప్పలు ఏమీ లేవు.
– పడిగెపాటి శ్రీనివాస్‌రెడ్డి, రైతు దామరచర్ల
3 గంటల కాంగ్రెస్ మాకొద్దు.. 24 గంటల కేసీఆరే కావాలి
నకిరేకల్ శివారులో నాకు 4 ఎకరాల పొలం ఉంది. మాది వ్యవసాయ కుటుంబం. 30, 40 ఏండ్ల క్రితం మా నాయిన తోటి పొలానికి వచ్చినప్పుడు నీళ్లు లేక భూములు బీడు వారి ఉండేవి. ఎప్పుడో ఒక్కప్పుడు వర్షాకాలం తప్ప పంటలు వేసే వాళ్లం కాదు. 20 ఏళ్ల కింద నుంచి కొద్దిపాటి కరెంటుతో చాలీచాలని నీళ్లతో పొలం పారేది. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో గప్పటి నుంచి 24 గంటల కరెంటు వచ్చింది. అటోమెటిక్ స్టార్టర్లు పెట్టుకుని హాయిగా వ్యవసాయం చేసుకుంటున్నం. ఇప్పడు ఈ కాంగ్రెస్ నాయకుడు రేవంత్‌రెడ్డి వచ్చి రైతులకు 3 గంటల కరెంటు చాలు అంటున్నాడు. 3 గంటల తోటి నాలుగు ఎకరాలు పారతయా? కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా బతుకులు మళ్లీ మొదటికొచ్చనట్టే. 30 ఏళ్ల నుంచి 3 హెచ్‌పీ మోటారే వాడుతున్నం. ఇప్పుడు 10 హెచ్‌పీ మోటార్లు కొనుక్కోవాలని చెప్తుండు. ఎన్ని లక్షల ఖర్చు కావాలే. గా పైసలు ఆయన ఇస్తడా? 24 గంటల కరెంటు ఇస్తున్న గా బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలి. ఇంత మంచిగా కరెంటు ఇస్తుండు కాబట్టే మంచిగా వ్యవసాయం చేసుకుంటున్నం. సీఎం కేసీఆర్ సల్లగుంటే మా రైతులమంతా సల్లగున్నట్లే.
– ఏశబోయిన వెంకటేశం, రైతు, నకిరేకల్
నాడు పంటల సేద్యం.. అప్పులకే సరిపోయేది..
సీమాంధ్ర పాలనలో వ్యవసాయాన్ని నమ్ముకొని జీవిస్తున్న రైతులు అప్పులు చేసి సేద్యం చేసేవారు. కరెంట్ కష్టాలతో పంటలు సక్రమంగా పండక జిల్లా రైతులు ఆర్థ్ధికంగా అప్పుల ఊబీలో మునిగిపోయారు. నాడు సాగుకు మూడు, 4గంటల కరెంట్ ఇవ్వడం వల్ల, లో ఓల్టేజీ సమస్యతో మోటార్లు, స్టార్టర్లు, సర్వీస్ వైర్లు తరుచుగా కాలిపోయేవి. మోటార్లు కాలిపోయిన ప్రతిసారి రైతులకు రూ.2 వేలకు పైగా మరమ్మతు ఖర్చులయ్యేవి. ఇవేగాక స్టార్టర్లు, కేబుల్ వైర్లు, ఫీజులు కాలిపోవడం వల్ల మరో రూ.2వేల అదనపు భారం పడేది. మరోవైపు ట్రాన్స్ఫార్మర్లపై అధిక లోడు ఉండడంతో అవి కాలిపోయి రైతులు మరమ్మతు కేంద్రాలకు తరలించాలంటే వేలాది రూపాయలు రైతుల మీద భారం పడేది. ఒక ట్రాన్స్ఫార్మర్ కాలిన సందర్భంలో ఆ రోజుల్లో రైతులపై సుమారు రూ.10 వేల ఖర్చులు మీద పడేవి. అది టాన్స్‌ఫార్మర్ వెంటనే ఇవ్వకుండా రెండు, మూడు రోజులకు ఇచ్చేవారు. దీంతో పొట్టదశలో ఉన్న పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. దాంతో రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటలు సరిగా నీరు పారక దిగుబడులు అతి తక్కువగా వచ్చేవి. తీరా పంట అమ్మాక పెట్టిన ఖర్చులు పూడకపోగా అప్పులే మిగిలేవి.
నేడు పండుగలా వ్యవసాయం
స్వరాష్ట్రంలో ఉద్యమ నేత కేసీఆర్‌కు ప్రజలు పట్టం కట్టడంతో స్వల్ప కాలంలోనే కరెంట్ కష్టాలను పారదోలాడు. 2014కు ముందు 3గంటల కరెంట్ సక్రమంగా ఇచ్చే పరిస్థితి లేకుండా ఉండేది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ అన్నదాతల కష్టాలను త్వరలో తీరుస్తానని రైతులకు మాట ఇచ్చి, ఇచ్చిన మాట మేరకు 2016 నుంచి వ్యవసాయ విద్యుత్‌ను 24 గంటల సరఫరా ప్రారంభించారు. మండలాల్లో విద్యుత్ లోడ్‌కు అనుగుణంగా 33/11 విద్యుత్ సబ్ స్టేషన్లను నెలకొల్పారు. దీంతో నల్లగొండ జిల్లాలో విద్యుత్ కనెక్షన్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ తొమ్మిన్నరేండ్లలో రైతులు బోరు బావులు ఏర్పాటు చేసుకుని కరెంట్ కనెక్షన్లు తీసుకున్నారు. 2014 మే వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 1.46 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా నేడు కొత్తగా ఏర్పడిన నల్లగొండ జిల్లాలో 2.21లక్షల కనెక్షన్లు ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో 2014 మేలో 90,806 కనెక్షన్లు ఉండగా నేడు 1,46,336 కనెక్షన్లు పెరిగాయి. అలాగే 24 గంటల విద్యుత్ కారణంగా మోటార్లు కాలిపోవడం, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడం వంటి సమస్యలకు చెక్ పడింది.
10 హెచ్‌పీ మోటర్లు రైతులు వాడరు
10 హెచ్‌పీ మోటారును రైతులు ఎవుసం చేసేందుకు వాడరు. 10 హెచ్‌పీ మోటారును రైతులు కొనుకోవాలంటే రూ.లక్ష ఖర్చవుతది. మళ్లీ దానికి సొంతంగా 25 కేవీ ట్రాన్స్ఫార్మర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవడం రైతుకు తడిచి మోపడయితది. 10 హెచ్‌పీ మోటరు కాలిపోతే అల్లిస్తానికి మరో రూ.12 వేల వరకు అవుతది. తెలంగాణ వచ్చినాక ప్రభుత్వం ఇచ్చిన 24 గంటల కరెంటుతో రైతులం మంచిగా బతుకున్నం అది చూచి కాంగ్రెసోళ్లకు కల్లుమండుతున్నవి. రేవంత్‌రెడ్డి మాట్లాడిన మూడు గంటల కరెంటు తూతూ మంత్రం తుమ్మ కాయమంత్రమే. మూడుగంటల కరెంట్‌తో ఒక్క మడికూడ పారదు. గీ కాంగ్రెసోళ్లు మూడు గంటల కరెంట్ 10 హెచ్‌పీ మోటు అంటూ మానోట్లో మట్టికొట్టేందుకు చూస్తున్రు. 24గంటల కరెంట్‌తోనే మా బతుకులు బాగుపడుతవి.
– బెల్లి రవి, రైతు, అయిటిపాముల, కట్టంగూర్
కాంగ్రెసోళ్ల మాటలు నమ్మం
ముఖ్యమంత్రి కేసీఆర్ అయినప్పట్నుంచి కరెంట్‌తో కష్టాలు తీరి సుఖంగా వ్యవసాయం చేసుకుంటున్నాం.. కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యవసాయానికి మూడు గంటలు కరెంట్ చాలు అనే సరికి మాకు ఏమి చేయాలో అర్ధం కావడం లేదు. రేవంత్‌రెడ్డి చెప్పినట్లు మూడు గంటల కరెంట్‌తో మూడు గుంటల మడి కూడా పారదు. గత తొమిదేండ్లుగా 24 గంటల త్రీ ఫేస్ కరెంట్ వస్తున్నది. దాంతో పంటలు పండిస్తూ సంతోషంగా ఉన్నాం. నాకున్న ఎకరం న్నర పొలంలో రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎలాంటి దిగులు లేకుండా సంతోషంగా పొలంలో వరి పంటను పండించుకున్నాం. కాంగ్రెసోళ్ల మాటలు నమ్మే స్థితిలో రైతులు లేరు. అతి త్వరలో జరుగనున్న ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేసి కేసీఆర్‌ను మళ్లీ సీఎంను చేసేందుకు రైతులమంతా సిద్ధంగా ఉన్నాం.
– చివుట సైదులు, రైతు, ఇటుకులపహాడ్, శాలిగౌరారం