నల్లగొండ ప్రతినిధి, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓట్లు భారీగా ఉంటుండడం చర్చనీయాంశంగా మారింది. అభ్యర్థుల ప్రచారంలో, సోషల్ మీడియాలో, అధికారికంగానూ ఎంత అవగాహన కల్పిస్తున్నా డిగ్రీలు చేతబట్టి పట్టభద్రులు అనిపించుకుంటున్న ఓటర్లు ఓటు వేయడంలో తడబాటుకు గురవుతూనే ఉన్నారు. ఈసారి కూడా చెల్లని ఓట్లు భారీగానే ఉండడం విస్మయానికి గురిచేస్తున్నది. 2021 మార్చిలో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఈసారి అదనంగా 2.73శాతం చెల్లని ఓట్లు పోల్ కావడం గమనార్హం. గత నెల 27న జరిగిన వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల శాసన మండలి ఉప ఎన్నికల పోలింగ్‌లో 4,63,839 మంది ఓటర్లకు గానూ 3,38,179 మంది ఓటు వేశారు. ఈ నెల 5 నుంచి మొదలైన కౌంటింగ్‌లో 6వ తేదీ సాయంత్రం తర్వాత తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో చెల్లని ఓట్ల సంఖ్య తేలింది. పోల్ అయిన ఓట్లలో 8.27శాతం చెల్లని ఓట్లుగా చెత్తబుట్టలో పడ్డైట్లెంది. మొత్తం 27,990 మంది పట్టభద్రులు వేసిన మొదటి ప్రాధాన్యత ఓట్లు చెల్లకుండా పోయాయి. దాంతో చెల్లని ఓట్లే శుక్రవారం రాత్రి ముగిసిన లెక్కింపులో గెలుపోటములను ప్రభావితం చేయడంలో భాగమయ్యాయి. అసలే పోలింగ్ కేంద్రాలకు రాకుండా ఓటు వేయని వారిని పక్కన పెడితే వ్యయప్రయాసాలకు ఓర్చి క్యూలో నిలబడి వేసిన వారి ఓటు కూడా చెల్లకుండా పోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీస అవగాహన లేకుండా ఓటు వేసి చెల్లకుండా చేసుకోవడం ఏమిటన్న చర్చ సాగుతున్నది.
చెల్లని ఓట్లలో ఎక్కువ భాగం నిబంధనల ప్రకారం ‘1’ అని వేయకపోవడం వల్లే జరిగింది. 1ని కొందరు పరిపరి విధాలుగా రాయడంతో అసలే రాయకుండా టిక్ చేయడం, 1 రాశాక కూడా దాని పక్కన టిక్ పెట్టడం లేదా దాని చుట్టూ సున్నాలా చుట్టడం ఇలా అనేక రకాలుగా ఓటు వేయడంతో ఆ ఓట్లన్నీ చెల్లకుండా పోయాయి. అదే సమయంలో కొన్ని ఓట్ల విషయంలో చిన్న చిన్న పొరపాట్లను ఓటర్ సెన్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఏజెంట్ల సమ్మతితో అనుమితించినట్లు తెలిసింది. లేకపోతే చెల్లని ఓట్ల సంఖ్య 10శాతం దాటేదని కౌంటింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో 5.54శాతం చెల్లని ఓట్లతో కొంత బెటర్‌గానే ఉంది. అప్పుడు కూడా 2,79,970 ఓట్లలో 15,533 ఓట్లు చెల్లలేదు. ఇక 2015లో గణనీయంగా 9.14 శాతంతో 14వేల పైచిలుకు చెల్లని ఓట్లుగా వృథా కావడం గమనార్హం. ఇక ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బంది వేసిన పోస్టల్ బ్యాలెట్లలోనూ కొన్ని చెల్లని ఓట్లు ఉన్నట్లు తెలిసింది.
ఎలిమినేషన్ రౌండ్స్‌లో చివరి వరకు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు గెలుపు కోటా రాలేదు. అప్పటికే రెండో స్థానంలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి కంటే 14,722 ఓట్ల ఆధిక్యంలో ఉన్న మల్లన్నను విజేతగా ప్రకటించేందుకు అనుమతి కోరుతూ రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన లేఖ పంపారు. ఎలిమినేషన్ రౌండ్స్‌లో చివరి అభ్యర్థిగా బీజేపీకి చెందిన గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ఎలిమినేషన్ అనంతరం మల్లన్న 1,50,524 ఓట్లు, రాకేశ్‌రెడ్డి 1,35,802 ఓట్లతో మిగిలారు. గెలుపు కోటాకు 1,55,095 ఓట్లు కావాల్సి ఉండగా, బీజేపీ అభ్యర్థి ఎలిమినేషన్ అనంతరం మల్లన్న గెలుపు కోటాకు 4,571 ఓట్ల దూరంలో ఉన్నారు. దాంతో చివర్లో మిగిలిన ఇద్దరి అభ్యర్థుల్లో ఎక్కువ ఓట్లు ఉన్న తీన్మార్ మల్లన్ననే గెలిచినట్లుగా ఎన్నికల కమిషన్ అనుమతితో ప్రకటించారు. కానీ.. 2021లో జరిగిన ఎన్నికల్లో మూడో స్థానంలో ఉన్న కోదండరాం ఎలిమినేషన్ రౌండ్లోనే బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించడం గమనార్హం.
ఎలిమినేషన్ రౌండ్స్‌లో 49వ అభ్యర్థి పాలకూరి అశోక్, 50వ అభ్యర్థి బీజేపీకి చెందిన గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డికి చెందిన 79వేల ఓట్లల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించారు. దాంతో తొలి ప్రాధాన్యత ఓట్లల్లో మల్లన్నకు వచ్చిన ఆధిక్యత చివరలో 18,859 నుంచి 14,722కి తగ్గింది. అశోక్ ఎలిమినేషన్లో ఆయనకు చెందిన మొత్తం 30,461 ఓట్లల్లో 5,042 మంది ఎవరికీ ద్వితీయ ప్రాధాన్యత ఓటు వేయలేదు. ఇక మిగిలిన ఓట్లల్లో 10,383 ఓట్లు మల్లన్నకు, 10,118 ఓట్లు రాకేశ్‌రెడ్డికి, 4,918 ఓట్లు ప్రేమేందర్‌రెడ్డికి పోల్ అయ్యాయి. 265 ఓట్లు మాత్రమే మల్లన్నకు ఎక్కువ వచ్చాయి. అశోక్‌కుమార్‌కు పోలైన ఓట్లలో 95శాతం ఓట్లు నిరుద్యోగ యువత ఓట్లే ఉంటాయని అంచనా. అలాంటి నిరుద్యోగుల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఏ మాత్రమూ తీసిపోకుండా బీఆర్ఎస్కు ఓట్లు పడడం గమనార్హం. ఇదే సమయంలో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి పోలైన 48,874 ఓట్లలో ఎలిమినేషన్లో ఏకంగా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి 5,232 ఓట్ల ఆధిక్యం లభించింది. బీజేపీ అభ్యర్థికి పోలైన తొలి ప్రాధాన్యత ఓట్లలో 15,086 మంది రెండో ప్రాధాన్యత ఓటు ఎవరికీ ఇవ్వలేదు. ఇక రెండో ప్రాధాన్యత ఇచ్చిన ఓట్లలో బీఆర్ఎస్కు 19,510 ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 14,278 మాత్రమే వచ్చాయి. అంటే మొత్తం 79వేల ద్వితీయ ప్రాధాన్యత ఓట్లల్లో బీఆర్ఎస్కు 4,967 ఓట్లు ఎక్కువగా రావడంతో కాంగ్రెస్ సర్కార్ తీరు పట్ల యువత, నిరుద్యోగులు, ఉద్యోగ వర్గాల్లో మార్పు మొదలైనట్లుగా రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో బీఆర్ఎస్ పట్టు బిగించిందన్న చర్చ సాగుతున్నది. గతేడాది చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నిరుద్యోగులు, ఉద్యోగ వర్గాలు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓటు వేశారన్న ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఆరు నెలల తేడాతో జరిగిన అచ్చం నిరుద్యోగులు, యువత, ఉద్యోగ వర్గాలతో కూడిన పట్టభద్రుల ఎన్నికల్లో బీఆర్ఎస్కు గణనీయంగా ఓట్లు పోల్ అవడం విశేషం. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి 1,35,802 మంది పట్టభద్రులు ఓటు వేసి తిరిగి తమ మద్దతును ప్రకటించారు. ఇవి తీన్మార్ మల్లన్న ఓట్లతో పోలిస్తే 14,722 మాత్రమే తక్కువ. ఇక ఈ ఎన్నిక పరిధిలో మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వీటిల్లో 32 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలోనూ డిప్యూటీ సీఎం సహా ఆరుగురు మంత్రులు ఉన్నారు. వారంతా తీన్మార్ మల్లన్న కోసం తీవ్రంగా కృషి చేయడంతోపాటు ఆర్థికంగా, అధికారపక్షంగా అండగా నిలిచారు. ఎప్పటి మాదిరిగానే బీఆర్ఎస్పై అభాండాలు మోపుతూ, అసత్య ప్రచారాలు చేస్తూ పట్టభద్రులైన ఓటర్లను తప్పుదారి పట్టించేలా తీవ్రంగా ప్రయత్నించారు. చివరి రోజు ఓటర్లకు డబ్బులు సైతం భారీగా పంచారు. ఇలా అంగ బలం, అర్ధ బలాన్ని ఉపయోగించినా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు బీఆర్ఎస్ నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. చివరి వరకు పోరు ఉత్కంఠతను రేకెత్తించింది. స్వతంత్ర అభ్యర్థుల్లో 47 మంది ఎలిమినేషన్ అనంతరం కూడా వారి నుంచి రాకేశ్‌రెడ్డి కంటే మల్లన్నకు అదనంగా పోలైన ఓట్లు 641 మాత్రమే.