పెద్దవూర, జూలై 23 : వరుసగా ప్రాజెక్టులు నిండడం.. చెరువులు, కుంటలు జలకళను సంతరించుకొని భూగర్భ జలాలు పెరుగడంతోపాటు ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తుండడంతో జిల్లాలో వరి సాగు గణనీయంగా పెరిగింది. అయితే.. నాట్ల సమయంలో కూలీల కొరత తీవ్రంగా ఉంటున్నది. దీంతో సమయానికి నాట్లు వేయక దిగుబడి తగ్గుతున్నది. ఈ నేపథ్యంలో కొందరు రైతులు వ్యవసాయ యంత్రాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో వానకాలం సీజన్లో పెద్దవూర మండలంలోని సంగారం గ్రామంలో యంత్రం సాయంతో వరి నాట్లు వేస్తున్నారు. దీంతో ఎకరానికి రూ.2వేల నుంచి 2500 రూపాయల వరకు ఖర్చు తగ్గుతుందని, సమయం ఆదా అవుతుందని రైతులు చెప్తున్నారు. కూలీలతో ఎకరం నాటు వేస్తే రూ.4వేల నుంచి 5వేల రూపాయల వరకు అవుతుండగా.. నారు వేసేందుకు ఇద్దరు కూలీలకు మరో రూ.1500 వరకు ఖర్చు వస్తున్నది. అదే యంత్రంతో అయితే ఎకరం రూ.4వేల ఖర్చు అవుతుండగా.. రూ.2500 వరకు ఆదా అవుతున్నదని రైతులు పేర్కొంటున్నారు. కూలీల కొరతను అధిగమించి సరైన సమయానికి నాట్లు వేయవచ్చంటున్నారు.
ఎకరానికి 15-20 కిలోల విత్తనం
యంత్రంతో నాటు వేయడానికి 20రోజుల ముందు పాలిథిన్ కవర్‌పై ట్రేలలో నారును పెంచాలి. ఎకరానికి సరిపడా నారుకు 80 నుంచి వంద ట్రేలు అవసరం అవుతాయి. ఒక్క ట్రేలో 200 గ్రాముల విత్తనం పడుతుంది. ఎకరానికి 15 నుంచి 20కిలోల విత్తనం సరిపోతుంది. ట్రేలలో మట్టిని నింపిన తర్వాత విత్తనాలను సీడింగ్ మిషన్ (విత్తనాలు వేసే యంత్రం) ద్వారా ట్రేలలో విత్తుకోవాలి. ప్రతి 4కిలోల మట్టికి సుమారు 4 గ్రాముల అన్నభేది, 8గ్రాముల జింక్ సల్ఫేట్, 2గ్రాముల కార్బండిజమ్ + మాంకోజెబ్ కలుపుకొంటే పోషక సమస్యలు రాకుండా నారు దృఢంగా పెరుగుతుంది. 20రోజులు కాగానే నారును ఉండలుగా చుట్టి యంత్రంలో క్రమ పద్ధతిలో అమర్చాలి. దానిని సిద్ధం చేసిన పొలంలో యంత్రం ద్వారా నాటు వేసుకోవాలి.
కూలీల ఖర్చు తగ్గుతుంది
యంత్రం సహాయంతో నాట్లు వేయడం ద్వారా కూలీల ఖర్చు తగ్గడంతోపాటు సమయం ఆదా అవుతుంది. ఇంతకుముందు నాటు వేయాలంటే కూలీలు సీజన్ బట్టి మా గ్రామంలో లేకపోతే పక్క ఊర్ల నుంచి పిలిపించేది. కూలీలకు ఎకరానికి రూ.4వేలు, ఆటో కిరాయి వెయ్యి.. మొత్తం రూ.5వేల వరకు ఖర్చు వచ్చేది. దాంతోపాటు నారు మోయడానికి మరో రూ.1500 ఖర్చు అయ్యేది. మిషన్‌తో నాటు వేస్తే రూ.2500 ఖర్చు తగ్గడంతోపాటు రిస్క్ కూడా తగ్గుతుంది. ఈ యంత్రం ద్వారా రోజుకు 8నుంచి 10ఎకరాల వరకు నాటు వేయడానికి అవకాశం ఉంది.
– వల్లెం సుధాకర్‌రెడ్డి, రైతు, సంగారం, పెద్దవూర మండలం
దిగుబడి బాగా వస్తుంది
యంత్రం సహాయంతో నాటు వేస్తే మొక్కకు, మొక్కకు మధ్య 10 ఇంచుల వెడల్పు, 6ఇంచుల పొడవు ఉంటుంది. దీంతో మొక్కలకు గాలి తగిలి వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది దిగుబడి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ యంత్రం ద్వారా సమయాన్ని ఆదా చేయడంతోపాటు కూలీల కొరతను అధిగమించవచ్చు.
– సందీప్‌కుమార్, మండల వ్యవసాయ అధికారి