శనివారం 27 ఫిబ్రవరి 2021
Nalgonda - Jan 21, 2021 , 01:26:25

రుణ సహకారం

రుణ సహకారం

  • యాసంగికి రూ.50 కోట్లు విడుదల చేసిన టెస్కాబ్‌
  • 15 సొసైటీల బలోపేతానికి మరో రూ.8.42కోట్లు
  • నిధుల విడుదలకు డీసీసీబీ తీర్మానం 
  • పాడి రైతులకు ఇటీవలే రూ.12.90 కోట్లు
  • నిధుల విడుదలకు డీసీసీబీ తీర్మానం

నల్లగొండ, జనవరి 20 : రైతే కేంద్ర బిందువుగా నడిచే సహకార సొసైటీలను బలోపేతం చేసేందుకు టెస్కాబ్‌ భారీగా నిధులు విడుదల చేస్తున్నది. డీసీసీబీల్లో నూతన పాలక వర్గాల ఏర్పాటు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు నాబార్డు సహకారంతో నిధులు అందిస్తున్నది. జిల్లాకు గడిచిన రెండు సీజన్లలో రూ.50 కోట్ల చొప్పున పంట రుణాలు విడుదల కాగా ఈ సీజన్‌లోనూ అంతేస్థాయిలో అందించేందుకు సన్నద్ధమవుతున్నది. 

పావలా వడ్డీ రుణాలు..

యాసంగి సీజన్‌కు సంబంధించి పంట రుణాల కింద నాబార్డు ద్వారా విడుదలైన నిధుల్లో తెలంగాణ రాష్ట్ర సహకార సంస్థ జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు రూ.50 కోట్లు విడుదల చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 107 సహకార సొసైటీలు ఉండగా ప్రతి సొసైటీకి గ్రేడింగ్‌ను బట్టి రూ.30 నుంచి రూ.50 లక్షల వరకు కేటాయించారు. ఈ నిధులను ఆయా సొసైటీలు జిల్లాలో ఉన్న 1.80 లక్షల మంది సభ్యులకు పావలా వడ్డీ కింద రుణాలు ఇవ్వాలని టెస్కాబ్‌ సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తొమ్మిది డీసీసీబీలకు నూతన పాలకవర్గాలు ఎన్నికైన నాటి నుంచి ప్రతి సీజన్‌లో ఈ తరహాలో నిధులు విడుదల చేస్తున్న టెస్కాబ్‌ ఈ సారి యాసంగికి కూడా విడుదల చేసింది. ప్రస్తుతం విడుదలైన నిధులు కాకుండా ఇప్పటికే ఇచ్చిన రూ.450 కోట్ల పంట రుణాలను కూడా రెన్యువల్‌ చేయనున్నారు.

వెనుకబడిన సొసైటీలకు ఎంఎస్సీ నిధులు

ఆర్థిక వనరులు తక్కువ ఉన్న సొసైటీలను బలోపేతం చేసేందుకు కామన్‌ సర్వీస్‌ కో ఆపరేటివ్‌ స్కీం కింద నిధులు అందించనున్నారు. ఈ మేరకు తొలి విడుతలో ఉమ్మడి జిల్లాలో 15 సొసైటీలను గుర్తించగా పాలకవర్గం తీర్మానించింది.  వీటికి రెండు మూడు రోజుల్లో నిధులు సొసైటీ ఖాతాల్లో జమకానున్నాయి.

ఒక్కో సొసైటీకి సుమారు రూ.50 లక్షలు కేటాయించగా 15 సొసైటీలకు రూ.8.42 కోట్లు అందనున్నాయి. ఈ నిధులతో ధాన్యం, ఇతర ఉత్పత్తులు నిల్వ చేసుకోవడానికి గోదాముల నిర్మాణం, రైతులకు కావాల్సిన వ్యవసాయ పరికరాలను సమకూర్చుకోవడానికి అవకాశం కల్పించారు. 

కోళ్లు, గొర్రెల ఫామ్స్‌కు సబ్సిడీ 

సహకార సొసైటీల్లో ఉన్న రైతులు కోళ్లు, గొర్రెల ఫామ్స్‌ ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందాలనే ఉద్దేశంతో టెస్కాబ్‌ సబ్సిడీ రుణాలు అందజేస్తున్నది. ఇందుకు జిల్లా డీసీసీబీకి రూ.12.90 కోట్లు నిధులు ఇవ్వగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా సొసైటీల పరిధిలో 470 మందికి రుణాలు అందించారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 33శాతం, ఇతర రైతులకు 20శాతం సబ్సిడీ ఇచ్చారు. ఒక్కో రైతుకు షెడ్ల సామర్థ్యాన్ని బట్టి రూ.4 నుంచి రూ.7 లక్షల వరకు అందించారు. రాష్ట్రంలోనే అత్యధికంగా ఈ సబ్సిడీ రుణాలు వినియోగించుకున్నందుకు నాబార్డు త్వరలో జిల్లా డీసీసీబీ పాలక వర్గాన్ని, అధికార  యంత్రాంగాన్ని అభినందిస్తూ అవార్డు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.

ఘనంగా గురుగోవింద్‌సింగ్‌ జయంతి  

రామగిరి, జనవరి 36 : సిక్కుల గురువు గురుగోవింగ్‌ సింగ్‌ 353వ జయంతి వేడుకలను బుధవారం నల్లగొండలో ఘనంగా నిర్వహించారు. ఆర్పీరోడ్డులోని గురుద్వార్‌లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అన్నదానం చేశారు. కార్యక్రమంలో గురుద్వార్‌ కమిటీ అధ్యక్షుడు కుల్దీప్‌సింగ్‌ బండారి, వైఎస్‌ బండారి, గురుమిత్‌సింగ్‌ బండారి, ఎస్‌ఎస్‌ బండారి, దర్శన్‌ సింగ్‌ రాథోడ్‌, రాఖీబీర్‌సింగ్‌, కిషాన్‌సింగ్‌, గురుజోక్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

రైతుకు అండగా ..

ప్రభుత్వం చొరవతో నాబార్డు ద్వారా టెస్కాబ్‌ ఏడాది కాలంగా ఆశించిన మేరకు నిధులు విడుదల చేస్తున్నది. ప్రస్తుతం పంట రుణాల కింద రూ.50 కోట్లు ఇవ్వగా ఒక్కో సొసైటీకి రూ.40 లక్షల మేరకు అందిస్తున్నాం. ఇక వెనుకబడ్డ సొసైటీల అభివృద్ధికి రూ.12.90 కోట్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కోళ్లు, గొర్రెల ఫామ్స్‌ ఏర్పాటుకు కూడా నిధులు అందజేస్తున్నాం. 

-గొంగిడి మహేందర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌, నల్లగొండ

పాత రుణాలను రెన్యూవల్‌ చేస్తాం

ఈ సీజన్‌లో పంట రుణాల కోసం రూ.50 కోట్లు ఇచ్చారు. వాటితోపాటు పాత రుణాలను రెన్యూవల్‌ చేసే విధంగా చర్యలు చేపడుతున్నాం. సొసైటీలో సభ్యుడిగా ఉన్న ప్రతి రైతుకూ ఏదో ఒక పథకం కింద రుణం ఇవ్వాలన్నదే లక్ష్యం. రైతులంతా ఆయా సొసైటీల్లో రుణాలు తీసుకోవచ్చు.

-మదన్‌ మోహన్‌, సీఈఓ డీసీసీబీ, నల్లగొండ


VIDEOS

logo