మహిళా సంఘాలకు రూ.175.74 కోట్ల స్త్రీని నిధి రుణాలు మంజూరు
రాష్ట్రంలో రెండో స్థానం సూర్యాపేట జిల్లా
కోరుకున్న యూనిట్లు పెట్టుకునేలా ప్రోత్సాహం
ఒక్కో సంఘానికి రూ.40 నుంచి 3 లక్షలు
మార్చి నెలాఖరుకు మరింత పెరిగే అవకాశం
సూర్యాపేట, ఫిబ్రవరి 27;మహిళలు స్వశక్తితో ఎదిగేలా ప్రభుత్వం రుణాలు అందించి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నది. 90 పైసల వడ్డీకే విరివిగా స్త్రీ నిధి రుణాలు ఇస్తూ కోరుకున్న యూనిట్ పెట్టుకునేలా ప్రోత్సహిస్తున్నది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా రూ. 169 కోట్ల రుణాలు లక్ష్యంగా నిర్ణయించగా అంతకు మించి రుణాలు మంజూరయ్యాయి. ఇప్పటికే 15వేలకుపైగా మహిళా సంఘాలకు రూ. 175.74 కోట్ల రుణాలు అందివ్వగా మార్చి నెలాఖరుకు ఇంకా పెరిగే అవకాశం ఉంది. రూ.40 వేల నుంచి రూ.3 లక్షల వరకు రుణాలు ఇస్తుండగా వాటితో డెయిరీ, కోళ్ల ఫాంలు, కిరాణషాపులతోపాటు తదితర యూనిట్లు పెట్టుకుంటున్నారు. రుణాల మంజూరులో సూర్యాపేట జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. అక్షరాస్యతతో పాటు ఆర్థిక స్వావలంబన ఉంటే ఆ కుటుంబం చింత లేకుండా ఉంటుంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా సాధికారతే లక్ష్యంగా మహిళలకు విరివిగా రుణాలను మంజూరు చేయిస్తున్నారు. సొంతంగా వ్యాపారం చేసుకునే వారికి స్త్రీనిధి ద్వారా 90 పైసల వడ్డీకి రుణాలు అందిస్తున్నారు. దాంతో ఎంతో మంది వ్యాపారంలో రాణిస్తూ కుటుంబ అవసరాలు తీర్చుకోవడంతో పాటు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు.
సూర్యాపేట జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు 2021-22వ ఆర్థిక సంవత్సరంలో స్త్రీనిధి ద్వారా రూ.169 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. 23 మండలాల పరిధిలో 25వేల సంఘాలు ఉండగా ఇప్పటి వరకు 15వేలకు పైగా సంఘాలకు రూ.175.74 కోట్ల రుణాలు మంజూరయ్యాయి. సుమారు 30వేల మంది వరకు లబ్ధి పొందారు. ఈ ఆర్థిక సంవత్సరాంతం వరకు దాదాపు రూ.185 కోట్ల రుణాలు మంజూరు చేసే అవకాశం ఉన్నది. ఒక్కొక్క సంఘానికి గరిష్ఠంగా రూ.3లక్షల వరకు రుణం ఇస్తున్నారు. వీటిలో అత్యధికంగా కిరాణం, డెయిరీ, పౌల్ట్రీఫాంతో పాటు ఇతర కుటీర పరిశ్రమల ఏర్పాటుకు రుణాలు మంజూరు చేస్తున్నారు.ప్రస్తుతం మార్కెట్లో అత్యధికంగా డిమాండ్ ఉన్న వాటిని ఎంచుకుని ప్రగతి సాధించేలా సలహాలు, సూచనలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణ మహిళలు పాలు, పాల ఉత్పత్తుల విక్రయానికి డెయిరీలు, కిరాణా దుకాణాల ఏర్పాటుకు మొగ్గు చూపారు. రూ.40వేల నుంచి 3 లక్షల వ్యయంతో కిరాణా షాపులు ఏర్పాటు చేసుకున్నారు.
మండల సమాఖ్యలకు భారీ వాహనాలు…
జిల్లాలోని ఆరు మండల సమాఖ్యలకు పెద్ద ఎత్తున రుణాలు మంజూరయ్యాయి. నేరేడుచర్ల, మునగాల, నూతనకల్ మండల సమాఖ్యలకు రూ.25లక్షల చొప్పున రుణాలు మంజూరు చేసి వరి కోత మిషన్లు అందించారు. మోతె, ఆత్మకూర్(ఎస్), తుంగతుర్తి సమాఖ్యలకు రూ.16.50 లక్షలతో ట్రాక్టర్‌తోపాటు వరి సాగు పనులకు సంబంధించిన యంత్రాలను అందించారు. ప్రభుత్వం 25 శాతం సబ్సిడీ ఇవ్వడంతో సుమారు రూ.4లక్షలు మాఫీ కానున్నాయి.
టార్గెట్ మించి రుణాలు అందిస్తున్నాం..
ఈ ఆర్థిక సంవత్సరంలో స్త్రీ నిధి రుణాలు రూ.169 కోట్లు అందించాలని లక్ష్యం నిర్ణయించగా ఇప్పటికే రూ. 175.74 కోట్లు మంజూరు చేశాం. టార్గెట్‌ను మించి రుణాలు ఇస్తున్నాం. విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, పీడీ కిరణ్ సూచనలతో జిల్లాలో అవసరం ఉన్న ప్రతి సంఘానికీ రుణాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి సుమారు రూ.185 కోట్లు రుణాలు ఇచ్చే అవకాశం ఉంది.
– జి. మహేంద్రకుమార్, స్త్రీనిధి రీజినల్ మేనేజర్, సూర్యాపేట
మూడేండ్లుగా నంబర్ వన్
స్త్రీనిధి రుణాల మంజూరులో సూర్యాపేట జిల్లా గత మూడేండ్లుగా రాష్ట్రంలో నంబర్ వన్ స్థానంలో నిలుస్తున్నది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.112.55 కోట్లకు గాను రూ.113.10 కోట్లు, 2020-21లో రూ.120 కోట్లకు గాను రూ.138.87 కోట్లు, తాజాగా రూ.169కోట్లకు గాను ఫిబ్రవరి 25 నాటికి రూ.172.74 కోట్లు మంజూరయ్యాయి. మార్చి 31 నాటికి ఈ సంఖ్య రూ.185 కోట్లకు చేరనున్నట్లు అంచనా. దాంతో ఈ ఏడాది కూడా ప్రథమ స్థానంలో నిలిచే అవకాశాలున్నాయి అని అధికారులు వెల్లడించారు. రుణాల మంజూరుతోపాటు రికవరీలోనూ మంచి ఫలితాలు నమోదు కావడం గమనార్హం. 5 శాతం మొండి బకాయిలను 1లేదా 2 శాతానికి తగ్గించేందుకు ముమ్మరంగా డ్రైవ్ నిర్వహిస్తున్నారు.