కృష్ణా నదిని ఆనుకుని ఉండి పారిశ్రామికాభివృద్ధికి పేరుగాంచిన నియోజకవర్గం హుజూర్నగర్. పెద్ద పెద్ద సిమెంట్ పరిశ్రమలు కొలువుదీరిన ఈ ప్రాంతంలో స్థానిక యువతకు అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నా, ఉమ్మడి రాష్ట్రంలో అందుకు అవసరమైన విద్యా వసతులు కల్పించే పాలకుల్లేక వేలాది మంది ఉజ్వల భవిష్యత్‌కు దూరమయ్యారు. ఐటీఐ కాలేజీ ఏర్పాటు చేస్తే నియోజకవర్గ విద్యార్థులకు మేలు జరుగుతుందని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు దశాబ్దాల తరబడి డిమాండ్ చేస్తున్నా పట్టించుకున్న నాథుడు లేరు. ఇన్నాళ్లకు స్వరాష్ట్రంలో ఆ కల నెరవేరింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు శనివారం హుజూర్‌నగర్‌కు ఐటీఐ కాలేజీని మంజూరు చేసింది. 17 రెగ్యులర్, ఐదు అవుట్ సోర్సింగ్ అధ్యాపక పోస్టులకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మఠంపల్లి మండలం పెదవీడు గ్రామ శివారులో ఐదెకరాల్లో కాలేజీ ఏర్పాటు చేయనున్నారు.
-నేరేడుచర్ల, ఆగస్ట్టు 17
నేరేడుచర్ల, ఆగస్టు 17 : హుజూర్నగర్ నియోజకవర్గానికి ఐటీఐ కళాశాల మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో పాటు కళాశాలలో 17 రెగ్యులర్, 5 ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు కూడా మంజూరు చేసింది. ఐటీఐ కళాశాలలో సీఓపీఏ (కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామ్ అసిస్టెంట్) సివిల్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిన్సి, మెకానికల్, వెల్డర్, వైర్మన్, ఫిట్టర్‌తో పాటు వివిధ ట్రేడ్లలో యువతకు శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ పొందిన స్థానిక యువతకు పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. దాంతో నియోజకవర్గ యువతతో పాటు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఆర్డీఓ కార్యాలయం, గురుకుల పాఠశాల, ఈఎస్ఐ, బస్తీ, పల్లె దవాఖానలు, కోర్టు ఏర్పాటు చేయడంతో పాటు మరో 12 గురుకుల పాఠశాలలను కళాశాలలుగా ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అప్‌గ్రేడ్ చేయించారు. ఫలితంగా హుజూర్నగర్ ప్రాంతం విద్యా కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతున్నది.
నియోజకవర్గానికి కొత్తగా మంజూరైన ఐటీఐ కళాశాలను మఠంపల్లి మండలంలోని పెదవీడు రెవెన్యూ గ్రామ శివారులో నాగార్జున సిమెంట్ పరిశ్రమ సమీపంలోని 541 సర్వే నంబర్లో ఐదెకరాల స్థలాన్ని ఇప్పటికే కేటాయించారు. దాంతో కళాశాలను అక్కడే ఏర్పాటు చేయనున్నారు. సిమెంట్ పరిశ్రమలన్నీ మఠంపల్లి, మేళ్లచెర్వు, చింతలపాలెం, పాలకవీడు మండలాల్లో ఉన్నప్పటికీ స్థానిక యువతకు శిక్షణ లేక పోవడంతో ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి. స్థానిక యువతకు అవసరమైన కోర్సుల్లో శిక్షణ ఇప్పించడం ద్వారా వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ఐటీఐ కళాశాల ఏర్పాటు విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయనను ఒప్పించి కళాశాలను మం జూరు చేయించారు. కళాశా మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ విడుదల చేయడంపై స్థానిక యువత, వారి కుటుంబ సభ్యులు, ప్రజలు హ ర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి కృతజ్ఙతలు తెలిపారు.
హుజూర్నగర్ ఎమ్మెల్యేగా గెలిచిన మూడున్నరేండ్లలోనే రూ.3500 కోట్లకు పైగా నిధులు మంజూరు చేయించి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి పథంలో నిలిపేందుకు కృషి చేశాను. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేలా సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డిల సహకారంతో ఐటీఐ కళాశాలను మంజూరు చేయించా. కళాశాలలో కోర్సులు పూర్తి చేసిన యువతకు స్థానిక పరిశ్రమల్లోనే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తున్నాను.
– శానంపూడి సైదిరెడ్డి, ఎమ్మెల్యే హుజూర్నగర్
నియోజకవర్గంలో ఐటీఐ కళాశాలను మంజూరు చేయించిన ఘనత ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిదే. ఈ ప్రాంత యువతకు ఇదొక సువర్ణ అవకాశం. ఐటీఐ పూర్తి చేస్తే స్థానిక పరిశ్రమల్లో వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఐటీఐ చదువాలంటే సుదూర ప్రాంతానికి వెళ్లాల్సి రావడంతో చాలా మంది ఆసక్తి చూపలేదు. ఇప్పుడు మన ప్రాంతంలోనే కళాశాల ఏర్పాటు చేస్తే వారి కష్టాలు తీరుతాయి.
– ఇరుగు పిచ్చయ్య, రఘునాథపాలెం, మఠంపల్లి మండలం