నల్లగొండ/ మిర్యాలగూడ/ వేములపల్లి/ చందంపేట/ మునగాల/ చిలుకూరు, మే 18 : జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు పలుచోట్ల వర్షం కురిసింది. కొన్ని మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. జిల్లాలో అత్యధికంగా కట్టంగూర్ మండలంలో 65.5 మి.మీ. వర్షం పడగా.. మిర్యాలగూడలో 26.3, దామరచర్లలో 17.3, నార్కట్పల్లిలో 8.3, తిప్పర్తిలో 5.3, నల్లగొండలో 4.8, చందంపేట మండలంలో 4 మి.మీ. వర్షం కురిసింది. చందంపేట మండలంలో కుంటలు, పొలాల్లోకి వర్షపు నీరు చేరింది.
రోడ్లపై వరద పారింది. మునగాల మండల కేంద్రంలోని గణపవరం క్రాస్ రోడ్డుపై నీరు నిల్వడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులకు గురయ్యారు. ఈదురు గాలులకు చిలుకూరు మండలంలోని రామాపురంలో మామిడి కాయలు నేలరాలాయి. పిడుగుపాటుకు గురై మిర్యాలగూడ మండలం జేత్యాతండాలో 15 గొర్రె పొట్టేళ్లు మృత్యువాత పడ్డాయి. కాపరికి గాయాలయ్యాయి. వేములపల్లి మండలం ఆమనగల్లులో గొర్రెల కాపరి తీవ్ర గాయాల పాలయ్యాడు. కాగా, మండు వేసవిలో వానలు పడుతుండడంతో అంతటా చల్లటి వాతావరణం నెలకొన్నది. రైతులు మెట్ట పంటల కోసం దుక్కులు దున్ని భూములను సిద్ధం చేసుకుంటున్నారు.