నల్లగొండ, విద్యావిభాగం (రామగిరి) మార్చి 8 : తెలంగాణలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపక పోస్టుల భర్తీలో భాగంగా పరీక్షలు నిర్వహించి ఫలితాలు విడుదల చేసి పోస్టింగులు ఇవ్వకుండా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. జూనియర్ లెక్చరర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్ ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11న హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే మహా ధర్నా పోస్టర్లను టీఎస్ యూటీఎఫ్ నాయకులతో కలిసి నల్లగొండ పట్టణ గడియారం సెంటర్లో పోస్టర్లు ఆవిష్కరించారు.
తెలంగాణలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపక పోస్టుల భర్తీకై జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్ 2022లో వచ్చింది. 2023లో పరీక్షలు నిర్వహించి 2024లో ఫలితాలు విడుదల చేశారు. ఎంపికైన అభ్యర్థులందరికీ 2025 ఫిబ్రవరి 19 నాటికి కళాశాలలు కేటాయించారు. అయినప్పటికీ వారు ఇంకా అపాయింట్మెంట్ ఆర్డర్లు, పోస్టింగ్ ఆర్డర్లు అందుకోలేక పోయారు. ప్రభుత్వం నిరుద్యోగులపై నిర్లక్ష్యం వహించడం చాలా బాధాకరమని JL అభ్యర్థులు వాపోయారు.
పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వాలని మంత్రులు, ఉన్నత అధికారులను కలిసినప్పటికీ వారి నుంచి స్పందన కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలకు ఎంపికై నిరుద్యోగులుగా మిగిలిపోయి ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. ఈ నెల 11న ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే మహాధర్నాకు అభ్యర్థులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.