యాదగిరిగుట్ట రూరల్, డిసెంబర్ 29 : రైతులకు పదో విడుత పెట్టుబడి సాయం ఈ నెల 28 నుంచి ప్రారంభమైంది. రైతుల ఖాతాల్లో డబ్బులు జమవుతున్నాయి. చిన్న రైతుల నుంచి నగదు సాయం మొదలైంది. ఎకరాల వారీగా ఈ ప్రక్రియ పది, పదిహేను రోజుల్లో పూర్తవనున్నట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన రైతులకూ ఈ పథకం వర్తించనున్నది.
యాదగిరిగుట్ట మండలంలోని 23 గ్రామాల్లో 13,500 మంది రైతులు ఉన్నారు. వీరిలో 600 మంది వరకు బ్యాంక్ ఖాతా వివరాలు అందించలేదు. ఏఈఓలు సంబంధిత రైతుల నుంచి బ్యాంక్ ఖాతా, పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ సేకరిస్తున్నారు. ఆన్లైన్లో నమోదు చేసిన వారం, పది రోజుల్లో కొత్తగా దరఖాస్తు చేసిన రైతులకూ ఈ పథకం వర్తించనున్నది.
ధరణి ద్వారా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతుల వివరాలు వ్యవసాయ అధికారులకు అందుతున్నాయి. వివరాల సేకరణ పూర్తయిన తర్వాత వీరికి కూడా రైతుబంధు డబ్బులు జమ కానున్నాయి. ఈ నెల 28 నుంచే ఖాతాల్లో డబ్బులు జమవుతుండగా, మొదటగా గుంట భూమి నుంచి రెండెకరాల్లోపు ఉన్న రైతులకు డబ్బులు జమ కానున్నట్లు అధికారులు చెబుతున్నారు. విడుతల వారీగా రైతులందరికీ సాయం అందనున్నట్లు పేర్కొన్నారు.
విడుతల వారీగా అర్హులందరికీ రైతుబంధు సాయం అందనున్నది. ఇప్పటికే రైతుల వివరాలను ఉన్నతాధికారులకు పంపించాం.. కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన రైతులు కూడా ఏఈఓలకు బ్యాంక్ వివరాలు అందించాలి.
– రాజేశ్‌కుమార్, ఏఓ, యాదగిరిగుట్ట