ఆరోగ్యపరంగా అత్యవసరమైతే మొదటగా గుర్తుకొచ్చేది 108 అంబులెన్స్. రోడ్డు ప్రమాదం జరిగినా, ప్రాణాపాయ స్థితిలో ఉన్న సమయంలో క్షణాల్లో కళ్లముందు కదలాడే 108 సేవలను రాష్ట్ర ప్రభుత్వం మరింత బలోపేతం చేస్తున్నది. గతంలో కాలం తీరిన వాహనాలు, సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా 2లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగిన వాహనాల స్థానంలో ఇటీవల కొత్త వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చింది. అందులో అధునాతన పరికరాలతో కూడిన వసతులు కల్పిస్తున్నది. 108 వాహనాల నిర్వహణ చూస్తున్న ఈజీహెచ్ఎస్ హెల్త్ సర్వీస్ సంస్థ అన్ని రకాల వసతులు ఇప్పటికే సమకూర్చి వాటిపై సిబ్బందికి అవగాహన కూడా కల్పించింది. జిల్లాలో ఉన్న 22 అంబులెన్స్‌ల్లో అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశారు. ప్రతి మండల కేంద్రంలో వాహనం కనీసం 12గంటలు ఉండేలా చర్యలు సైతం చేపడుతున్నారు.
108లో కొత్త సేవలివి..
రోగిని ఇంటి నుంచి 108 వాహనంలోకి ఎక్కించే క్రమంలో గానీ, వాహనం నుంచి ఆసుపత్రి లోపలికి తరలించే సమయంలో ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నారనే నేపథ్యంలో మినీ ఆక్సిజన్ సిలిండర్‌ను ఏర్పాటు చేశారు. ఏ సమయంలోనైనా రోగితోపాటు తరలించి ప్రాణాలు కాపాడేందుకు ఈ చిన్న సిలిండర్‌ను సమకూర్చారు.
క్రిమి సంహారక మందు తాగిన వ్యక్తి ప్రాణాలు కాపాడేందుకు సాక్సన్ ఆపరేటర్‌ను ఏర్పాటు చేశారు. 108లో తరలిస్తుండగానే ప్రథమ చికిత్సలో భాగంగా రోగి నోటిలోని మందును బయటకు తీసి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంది.
రోగిని స్టెచర్‌పైనే కాకుండా ఆసుపత్రి లోపల వీల్‌చైర్‌పై తరలించే విధంగా 108లో కొత్త వీల్‌చైర్‌ను ఏర్పాటు చేశారు.
రోగిని ఆసుపత్రికి తరలించేలోపే ఆక్సిజన్ లెవల్, పల్స్ తెలుసుకోవడం కోసం అధునాతన ఆటోమెటిక్ మానిటర్‌ను ఏర్పాటు చేశారు. దీంతో వాహనంలోనే రోగి ఆరోగ్య పరిస్థితిని ముందస్తుగా టెక్నీషియన్ పసిగట్టి మెరుగైన సేవలు అందించవచ్చు.
రోగిని ఆసుపత్రికి తరలించిన తర్వాత అతని వివరాలు, ప్రమాదం జరిగిన తీరు, ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయడంతోపాటు వాహనం తిరిగే జీపీఆర్ లొకేషన్ల కోసం కొత్త ట్యాబ్‌లను అందించారు. 108 అందించిన సేవలను సత్వరమే ఆన్లైన్లోనే తెలుసుకునేలా ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి అందులో పొందుపరుచనున్నారు. ఈ సేవలపై ఇప్పటికే 108 టెక్నీషియన్లకు అవగాహన కల్పించారు.
అందరికీ అందుబాటులో ఉండేలా..
అత్యవసర సమయంలో వాహనాలు దూర ప్రాంతాల్లో ఉండడంతో సకాలంలో రోగుల ప్రాణాలు కాపాడలేక పోతున్నామనే ఉద్దేశంతో 108 వాహనాలను ప్రతి మండల కేంద్రంలో కచ్చితంగా 12 గంటలు ఉండేలా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు.
మెరుగైన సేవలు అందిస్తాం
ఇప్పుడు 108 వాహనంలో అన్ని రకాల వసతులు ఉన్నాయి. ఆపదలో ఉన్న వ్యక్తి ప్రాణాలు కాపాడేందుకు అందుబాటులో ఉన్న ప్రతి పరికరం వినియోగించి ఆసుపత్రికి తరలించేలోగా ప్రథమ చికిత్స అందిస్తాం. ప్రమాద స్థలంలో ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతుంటారు. ఈ సమయంలో ప్రమాద స్థలంలోనే మినీ ఆక్సిజన్ సిలిండర్ ద్వారా కొద్దిసేపు రోగి ప్రాణాలు కాపాడగల్గుతాం. ముఖ్యంగా పాయిజన్ కేసుల్లో నోటి నుంచి వచ్చే నురగను కొంత బయటకు తీస్తే గొంతు ద్వారా శ్వాస తీసుకుని రోగి ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంటుంది. అటువంటి పరికరం ఇప్పుడు 108లో అందుబాటులో ఉన్నది. వీల్చైర్తోపాటు రోగి పల్స్ తెలుసుకునేందుకు ఇటీవల వచ్చిన మానిటర్ ఎంతో ఉపయోగపడుతుంది.