హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ) : అధిక లోడ్‌తో వెళ్తూ రోడ్లను దెబ్బతీస్తూ వాహనదారులు, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న 100 వాహనాలను సీజ్ చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ చంద్రశేఖర్‌గౌడ్ వెల్లడించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న గనులు, క్వారీలు, ఇసుక రీచ్‌లకు చెందిన వెహికల్స్‌ను సీజ్ చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో అన్నిజిల్లాల డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు, ఆర్టీవోలు, జిల్లా రవాణాశాఖ అధికారులు, ఎంవీఐలు, ఏఎంవీఐలు చురుగ్గా పాల్గొంటున్నారని చెప్పారు.
అధిక లోడ్ వాహనాలతో రోడ్లు దెబ్బతినడం, వంతెనలపై అదనపు ఒత్తిడి పడటంతోపాటు ప్రమాదాల ముప్పు పెరుగుతున్నదని అధికారులు తెలిపారు. అందువల్ల గనులు, క్వారీలు, రీచ్‌లు, పారిశ్రామిక సంస్థలు, రవాణాదారులు, వాహన యజమానులు అనుమతించిన బరువు పరిమితులను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అధిక లోడ్ వేసే సంబంధిత క్వారీలు, రీచ్‌లు, కంపెనీలకు నోటీసులు జారీ చేస్తామని అధికారులు పేర్కొన్నారు. ఓవర్ లోడ్‌తో రెండోసారి పట్టుబడితే పర్మిట్, డ్రైవింగ్ లైసెన్సును సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.