యాదగిరిగుట్ట, నవంబర్ 27: పంచాయతీ ఎన్నికల వేళ కాం గ్రెస్ పార్టీకి చెందిన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు భారీ షాక్ తగిలింది. ఆయన సొంతూరైన సైదాపురంలో ఎమ్మెల్యే ప్రధాన అనుచరులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు వంద మంది దళిత సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడిన పూలెపాక లావణ్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు మోత్కుపల్లి సుమలతా శ్రీకాంత్, పూలెపాక నిరీక్షణా రవి, పూలెపాక మల్లేశ్, వినయ్, మౌనికా మురళీకృష్ణ, లక్ష్మి, కోట ప్రవీణ్ తోపాటు మరో వందమంది ఆ పార్టీ కి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు.
గురువారం పట్టణంలోని గొంగిడి నిలయంలో ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్రెడ్డి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. గడిచిన రెండేళ్ల కాలంలో ఆలేరు నియోజకవర్గంలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందన్నారు.
గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దొరికే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు గెలుపు లాంఛనమేనన్నారు. గ్రామ పంచాయతీలపై గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, సైదాపురం గ్రామశాఖ అధ్యక్షుడు నంద సిద్ధయ్య, మాజీ ఎంపీటీసీ బీర్ల మహేశ్, సీనియర్ నాయకులు మానుపాటి కృష్ణ, పూలెపాక అశోక్, గంధమల్ల కుమార్, కొరికొప్పుల శ్రీనివాస్, తోటకూరి మల్లేశ్, ఆహ్మద్, కనుకుల సిద్ధారెడ్డి, గంధమల్ల మధు, పూలెపాక నరహరి, కాట పాండురంగారావు, ఎండీ మాలిక్ మహ్మద్, బీర్ల చంద్రయ్య, పల్లె సురేందర్, రాంపల్లి నాగరాజు, మహ్మద్ అలీ పాల్గొన్నారు.