
పల్లె, పట్టణాల్లో ప్రగతి పనుల సందడి
జోరుగా గ్రామసభలు, మొక్కల నాటింపు
పాల్గొన్న ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు
నల్లగొండ ప్రతినిధి, జూలై 1(నమస్తే తెలంగాణ); పరిశుభ్రత, పచ్చదనమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు తొలిరోజు గురువారం జిల్లా వ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 10 రోజులపాటు సాగే నాలుగో విడుతకు ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో గ్రామ సభలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రగతి నివేదిక చదవడంతోపాటు అభివృద్ధి, తదితర పనుల నిర్వహణకు కార్యాచరణ రూపొందించుకున్నారు. పలుచోట్ల మురుగు కాల్వలు శుభ్రం చేయడంతోపాటు చెత్తాచెదారం, పిచ్చిమొక్కలు తొలగించారు. ఇక ప్రగతి అడుగులకు తోడు పచ్చదనాన్ని జోడిస్తూ ఏడో విడుత హారితహారానికి కూడా శ్రీకారం చుట్టారు. జిల్లా అంతటా ఇదే సందడి కనిపించింది. మంత్రి జగదీశ్‌రెడ్డి మొదలుకుని వార్డు స్థాయి ప్రజాప్రతినిధి వరకు.. కలెక్టర్ల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు పాల్గొన్నారు. నేడు రెండో రోజు పవర్ డేగా నిర్వహిస్తూ ఆయా ప్రాంతాల్లోని కరెంటు సమస్యలను పరిష్కరించనున్నారు.
గ్రామ సభలు, పారిశుధ్య పనులు, మొక్కల నాటింపు.. ప్రజాప్రతినిధులు, అధికారుల పర్యటనలతో తొలిరోజు పల్లె, పట్టణ ప్రగతి పనులు జోరందుకున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం ప్రారంభమైన నాలుగో విడుత ప్రగతి పనుల్లో ప్రజానీకం చేయికలిపి కదిలింది. ప్రజాప్రతినిధులు, అధికారుల పర్యటనలతో సందడి నెలకొంది. విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తిరుమలగిరి మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రి వెంట ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే గాదరి కిశోర్ పాల్గొనగా.. ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్‌రావు, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి, రమావత్ రవీంద్రకుమార్, నోముల భగత్ తమ నియోజకవర్గాల్లో మొక్కలు నాటారు. మరో తొమ్మిది రోజుల పాటు పారిశుధ్య కార్యక్రమాలతో పాటు, హరితహారంలో భాగంగా ఊరూ, వాడ మొక్కలు నాటనున్నారు.