e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home జిల్లాలు రేపే.. ప్రగతి సమీక్ష

రేపే.. ప్రగతి సమీక్ష

వివిధ స్థాయిలోని 2 వేల మంది వరకు అవకాశం
ఉప ఎన్నిక హామీలు, అమలే ప్రధాన ఎజెండా
మూడు గంటల పాటు సమావేశం!
ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు సాగర్‌ ప్రజలు సన్నద్ధం

నల్లగొండ ప్రతినిధి, జూలై 31(నమస్తే తెలంగాణ) :నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం జిల్లాకు రానున్నారు. సాగర్‌ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రగతి సమీక్ష చేయనున్నారు. అందుకోసం నియోజకవర్గ కేంద్రమైన హాలియాలో వేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి మార్గదర్శకంలో టీఆర్‌ఎస్‌ నేతలు, అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

- Advertisement -

ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు.. సోమవారం ఉదయం 11 గంటలకు హెలికాప్టర్‌ ద్వారా ముఖ్యమంత్రి హాలియాకు చేరుకుంటారు. వ్యవసాయ మార్కెట్‌ యార్డు ఆవరణలో
జరుగనున్న ప్రగతి సమీక్షలో పాల్గొంటారు. సమీక్షా సమావేశం అవడంతో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ వర్గాల ప్రముఖుల భాగస్వామ్యానికే పెద్దపీట వేస్తున్నారు. సమావేశ స్థలానికి ఉన్న పరిమితుల దృష్ట్యా ముందుస్తుగా పాస్‌లు పొందిన వారినే పోలీసులు అనుమతించనున్నారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలతోపాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలే ప్రధాన ఎజెండాగా సమీక్ష ఉండనున్నట్లు తెలుస్తున్నది. స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, సీనియర్‌ నేత ఎంసీ కోటిరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

సీఎం కేసీఆర్‌ హాలియాలో నిర్వహించనున్న నాగార్జునసాగర్‌ ప్రగతి సమీక్షా సమావేశానికి సర్వం సన్నద్ధమవుతున్నది. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్‌, కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌, ఎస్పీ రంగనాథ్‌ కలిసి సమీక్షకు అనువైన సమావేశ స్థలం, హెలిప్యాడ్‌ స్థలాన్ని ఎంపిక చేశారు. వాటిల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లను వేగవంతం చేశారు. సమీక్షా సమావేశానికి ఒక్కరోజే సమయం మిగిలి ఉండడంతో ఏర్పాట్లను మరింత ముమ్మరం చేశారు. హాలియా వ్యవసాయ మార్కెట్‌ యార్డ్డులో ప్రగతి సమీక్ష నిర్వహించనుండగా ప్రత్యేక షామీయానాలతో ఏర్పాట్లు చేస్తున్నారు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లపై దృష్టి సారించారు. సమీక్షకు జిల్లాస్థాయి ప్రజాప్రతినిధులు, అధికారులతోపాటు సాగర్‌ నియోజకవర్గంలోని అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ రంగాల్లోని ప్రముఖులకు అనుమతివ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు వీరందరికీ నేటి సాయంత్రానికే ప్రత్యేక పాస్‌లు జారీ చేయనున్నారు. మొత్తం రెండు వేల మంది మాత్రమే సమీక్షకు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. వీరంతా సీఎం రాకకు అరగంట ముందే సబా స్థలానికి చేరుకునేలా చూడనున్నారు.

సాగర్‌ అభివృద్ధిపైనే ప్రధాన ఎజెండా
ప్రగతి సమీక్షలో నాగార్జునసాగర్‌ నియోజకవర్గ అభివృద్ధే ప్రధాన ఎజెండాగా ఉండనున్నట్లు తెలిసింది. నాగార్జునసాగర్‌లో ఉమ్మడి పాలనలో సరైన అభివృద్ధి జరుగలేదన్న చర్చ సర్వత్రా ఉంది. విద్య, వైద్యం, సాగు, తాగునీటి అవసరాలు, రవాణా సౌకర్యం లాంటి కీలకమైన మౌలిక వసతుల కల్పనలో స్పష్టమైన మార్పు రావాలన్నది స్థానికుల ఆకాంక్ష. ఇందుకు అనుగుణంగా ప్రజలు కూడా 2018 డిసెంబర్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల నర్సింహయ్యను ఎమ్మెల్యేగా గెలిపించారు. అయితే నర్సింహయ్య సాగర్‌లో దీర్ఘకాలంగా ఉన్న ఒక్కో సమస్యపై సీఎం కేసీఆర్‌ సహకారంతో దృష్టి పెడుతున్న సమయంలోనే కరోనా విపత్తు వచ్చి పడింది. ఈ దశలోనూ సాగునీటి లిఫ్టులు, డిగ్రీ కళాశాల, సాగర్‌లో ఎన్నెస్పీ క్వార్టర్ల కేటాయింపు, నెల్లికల్లు ప్రాంతంలో భూవివాదాల పరిష్కారం కోసం కృషిని కొనసాగిస్తూనే వచ్చారు. కానీ, దురదృష్టవశాత్తు ఆయన హాఠాన్మరణం నియోజకవర్గానికి తీరనిలోటుగా మారింది. ఈ నేపథ్యంలో వచ్చిన ఉప ఎన్నికల్లో ఆయన కుమారుడు భగత్‌కే కేసీఆర్‌ ఎమ్మెల్యే టికెట్టు ఇచ్చి ప్రజల్లోకి పంపారు. ‘భగత్‌ను గెలిపించండి… అభివృద్దిని నాకు వదిలేయండి’ అని ఉప ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్‌ ప్రకటించారు.

సాగర్‌ అభివృద్దిని బలంగా కోరుకున్న ప్రజలు ఉప ఎన్నికల్లో నోముల భగత్‌ను భారీ మెజార్టీతో గెలిపించారు. దీంతో ఎన్నికల సభలో ఇచ్చిన మాట మేరకు సీఎం కేసీఆర్‌ సోమవారం హాలియాకు వస్తున్నారని మంత్రి జగదీశ్‌రెడ్డి ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ వెల్లడించారు. నియోజకవర్గ అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకు అనుగుణంగా కేసీఆర్‌ ప్రగతి సమీక్ష కొనసాగనుందని మంత్రి తెలిపారు. అన్ని కీలక సమస్యలకు పరిష్కారం చూపవచ్చని వివరించారు. ప్రధానంగా నెల్లికల్లుతోపాటు ఇతర లిఫ్ట్‌ పథకాల నిర్మాణంపై సమీక్షతోపాటు గిరిజన భూముల సమస్య, సాగర్‌లో ఎన్‌ఎస్పీ క్వార్టర్ల కేటాయింపు అంశం, డిగ్రీ కళాశాల భవనం, అంతర్గత రహదారులు, వ్యవసాయభూములకు వెళ్లే దారుల్లో కాల్వలపై బ్రిడ్జీల నిర్మాణం తదితర అంశాలపై సమీక్ష జరుగవచ్చని పేర్కొన్నారు. జిల్లా అధికారులు అందుకు అనుగుణంగా సమగ్ర నివేదికలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు.

ఘనస్వాగతానికి సన్నద్ధం
హెలిక్యాప్టర్‌ ద్వారా సోమవారం ఉదయం 11గంటలకు సీఎం కేసీఆర్‌ హాలియాకు చేరుకోనున్నట్లు శనివారం సాయంత్రం వరకు ఉన్న సమాచారం. సీఎం పర్యటన పూర్తిస్థాయి షెడ్యూల్‌ నేడు ఖరారు కానున్నది. హాలియాలోని నిడుమనూరు రోడ్డులో హెలిప్యాడ్‌ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యే భగత్‌తోపాటు జిల్లా ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి స్వాగతం పలుకనున్నట్లు తెలిసింది. అక్కడి నుంచి ప్రత్యేక బస్సులో కేసీఆర్‌ సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోని మార్కెట్‌ యార్డ్‌లోని సమావేశ స్థలానికి చేరుకోనున్నారు. ఈ సందర్భంగా హాలియాలో దారి పొడవునా కేసీఆర్‌కు స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున సన్నద్ధమవుతున్నారు. వెయ్యి డప్పులతో దారి పొడవునా దరువు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. సమావేశ స్థలానికి చేరుకున్నాక అంశాల వారీగా కేసీఆర్‌ సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. చివరలోసమావేశాన్ని ఉద్దేశించి సీఎం ప్రసంగించనున్నట్లు తెలిసింది.

నిరంతర పర్యవేక్షణ
టీఆర్‌ఎస్‌ జిల్లా ఇన్‌చార్జి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, మరోనేత ఎంసీ కోటిరెడ్డితో కలిసి స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్‌ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. శనివారం రోజంతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. స్వయంగా సమావేశ స్థలం, హెలీప్యాడ్‌, పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట పర్యటిస్తూ తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అదేవిధంగా సమావేశానికి ఎవరిని అనుమతించాలి? వారికి పాసులు జారీ లాంటి అంశాలపైనా దృష్టి సారించారు. మరోవైపు సీఎం పర్యటన సందర్భంగా పటిష్ట బందోబస్తుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు రెండు వేల మంది పోలీస్‌ సిబ్బందిని వినియోగిస్తున్నారు. జిల్లా ఎస్పీ రంగనాథ్‌ సీఎం పర్యటన బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. అన్ని ముఖ్య ప్రదేశాలతోపాటు దారి పొడవునా బందోబస్తు చేపట్టనున్నట్లు ఎస్పీ ‘నమస్తే తెలంగాణ’తో చెప్పారు. సుమారు రేపు ఉదయం 11గంటల ప్రాంతంలో కేసీఆర్‌ హాలియాకు చేరుకోవచ్చని, ఆయన తిరిగి వెళ్లే వరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. పాసులు ఉన్న వారికే లోపలికి అనుమతి ఉంటుందని, వారు కూడా ముందే చేరుకుని సహకరించాలని కోరారు.

సీఎం రాకతో మారనున్న నియోజకవర్గ రూపురేఖలు
ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాకతో నాగార్జున సాగర్‌ నియోజకవర్గ రూపురేఖలు మారిపోనున్నాయి. గత పాలకుల నిర్లక్ష్యంతో నియోజకవర్గం అన్ని రంగాల్లో వెనుకబడింది. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంతోపాటు నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిధులు విడుదల చేయనున్నారు. గత ఎన్నికల వాగ్దానాల అమలులో భాగంగా ఇప్పటికే నెల్లికల్లు లిఫ్ట్‌, హాలియా, నాగార్జునసాగర్‌కు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు మంజూరు చేశారు. ముఖ్యమంత్రి రాకతో అభివృద్ధి అంటే ఏమిటో సాగర్‌ ప్రజలు చూడనున్నారు.

  • నోముల భగత్‌, నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana