వానకాలంలోనూ ఎండలు భగ్గుమంటున్నాయి. ఒకవైపు వర్షాలు కురుస్తున్నా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం 38 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయ్యింది. ఎండ వేడిమితో ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఫ్యాన్లు, ఏసీల కింద కూర్చోనిదే ఉండలేని పరిస్థితి. బయట తిరిగి పనులు చేసుకునే వారికి చెమటలు కక్కుతున్నాయి. వాతావరణంలో తేమ 55 నుంచి 95 శాతం ఉండడమే దీనికి కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. వానకాలంలో ఉక్కపోత
సూర్యాపేట, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ) : వానకాలంలోనూ ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఇటీవల వర్షాలు పుష్కలంగా కురువడంతో వాగులు, వంకలు పొంగిపొర్లినా.. పలుచోట్ల చెరువులు, కుంటలు నిండినా.. జలాశయాల్లోకి నీరు చేరుతున్నా.. హరితహారం మొక్కలు పెరిగి పచ్చదనం పెరిగినప్పటికీ ఊహించని రీతిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఎండ వేడిమి, విపరీతమైన ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. వేసవిలో మాదిరిగా ఇండ్లు, కార్యాలయాల్లో ఫ్యాన్లు గిర్రున తిరుగుతుండగా.. మళ్లీ ఏసీలు ఆన్ అయ్యే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్లో రోజూ వర్షాలు కురుస్తుండగా, జిల్లాలో మాత్రం ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. సోమవారం సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా 38, అత్యల్పంగా 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలిలో తేమ శాతం 55 నుంచి 95 శాతం ఉండడంతో ఉక్కపోత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు పేర్కొంటున్నారు.
దీంతో మధ్యాహ్నం వేళల్లో జనం బయటకు వెళ్లకుండా ఇండ్లకే పరిమితమవుతుండడంతో చాలా చోట్ల రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అంతేకాకుండా ఇటీవల ఉపరితల ద్రోణులు సంభవిస్తుండగా.. వాటి ప్రభావం లేని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగడం, ఉబ్బరం ఉంటుందని ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ డాక్టర్ నాగరత్న తెలిపారు.