కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబీమాకు మంగళం పాడిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం ప్రీమియం చెల్లించక పోవడంతో బీమా చెల్లింపులు నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా 227 మంది రైతులు బీమా కోసం దరఖాస్తు చేసుకున్నారు. నాలుగు నెలలుగా ఎదురుచూస్తున్నా.. ఇప్పటికీ రాలేదు. దీంతో రైతు కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సూర్యాపేట, మార్చి 27 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల ముందు అధికారం కోసం ఆరు గ్యారెంటీలు, 420 పచ్చి అబద్ధ్దాల హామీలు కోటలు దాటేలా ఇచ్చి సీటుపై కూర్చున్నాక ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నది. కొత్తవి అమలు చేయకపోగా బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేండ్ల పాటు అమలు చేసిన పథకాలను కూడా అమలు చేయడంలేదు. ఇప్పటికే అనేక పథకాలు నిలిచిపోయాయి. దేశానికి అన్నం పెట్టే రైతు ఏదేని కారణంతో అకాల మరణం సంభవిస్తే ఆ రైతు కుటుంబం రోడ్డున పడవద్దనే ఉద్దేశంతో నాటి కేసీఆర్ ప్రభుత్వం ప్రతి రైతుకూ ఉచితంగా రూ.5లక్షల బీమాను అమలు చేసింది.
2019లో ఈ పథకం ప్రారంభం కాగా 2024 వరకు జిల్లాలో వివిధ కారణాలతో మృతి చెందిన 3,577 మంది రైతు కుటుంబాలకు రూ.178.85 కోట్లు అందించి ఆదుకుంది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పథకానికి మంగళం పాడుతున్నట్లు కనిపిస్తున్నది. గత నాలుగు నెలలుగా జిల్లాలో 227 మంది రైతు కుటుంబాలకు బీమా చెల్లించడం లేదు. ప్రధానంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేండ్ల కాలంలో రైతన్నల శ్రేయస్సు కోసం చేయని కార్యక్రమం లేదు. స్వయానా రైతు అయిన కేసీఆర్ రైతులకు ఎలాంటి ఆపదలు రాకుండా అభివృద్ధ్ది పనులు, సంక్షేమ పథకాలతో దేశంలోనే రైతు ప్రభుత్వంగా కీర్తి మూటగట్టుకుంటున్నది. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ వృత్తులకు వేల కోట్ల రూపాయలు వెచ్చించి రైతులు, రైతు కూలీలకు కడుపునిండేలా చర్యలు చేపట్టారు.
రైతన్నల శ్రేయస్సు కోసం అనేక కార్యక్రమాలు చేపట్టి వారి జీవితాలకు భరోసా కల్పించే నిమిత్తం ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 2019లో రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి రైతుకూ బీమా మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తూ వారికి రూ.5లక్షల ఉచిత బీమా ప్రారంభించింది. బీమా పొందిన అనంతరం రైతు ఏ కారణం చేతనైనా మృతి చెందితే సదరు కుటుంబానికి కేవలం 10రోజుల వ్యవధిలో రూ.5లక్షలు ఎల్ఐసీ సంస్థ చెల్లిస్తుంది.
రైతు బీమాకు దరఖాస్తు చేసుకుంటున్న రైతులకు గుంట భూమి ఉండి పట్టా పాసుపుస్తకం పొంది ఉన్నా.. రైతుగా పరిగణించి నాటి కేసీఆర్ ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని వర్తింపజేసింది. 2019 ఆగస్టులో ఈ స్కీం ప్రారంభం కాగా నాటి నుంచి 2023 వరకు కేసీఆర్ ప్రభుత్వం ఒక్కో రైతుకు రూ.3,200ల చొప్పున బీమా చెల్లించింది. అలా 2019 నుంచి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నంత వరకు జిల్లాలో వివిధ కారణాలతో మృతి చెందిన 3,577 మంది రైతు కుటుంబాలకు రూ.178.85 కోట్లు అందించి ఆదుకుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ స్కీం కూడా నిలిచిపోతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
గత నాలుగు నెలలుగా జిల్లాలో వివిధ కారణాలతో మృతి చెందిన రైతు కుటుంబాలకు బీమా సొమ్ము రాలేదు. రైతుబీమా ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుంచి జూలై 30 వరకు కొనసాగనుండగా ముందే ప్రభుత్వం ప్రీమియం చెల్లించి రెన్యువల్ చేయాల్సి ఉంటుంది. అలా 2023లో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించిన బీమా ప్రీమియంతో అదే సంవత్సరం డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో 2024 ఆగస్టు వరకు రైతుబీమా పథకం కొనసాగింది. నాలుగు నెలలుగా జిల్లాలో మృతి చెందిన 227 మంది రైతుల కుటుంబాలకు రూ.5లక్షల బీమా దాదాపు రూ.11 కోట్లు అందలేదు. 2024 జూలై లోపు చెల్లించాల్సిన ప్రీమియంను కొంతమేర చెల్లించి చేతులెత్తేయడం వల్లనే బీమా చెల్లింపులు నిలిచిపోయినట్లు అధికారుల ద్వారా తెలిసింది. ఇప్పటికైనా ప్రభుత్వం బీమా ప్రీమియం చెల్లించి ఏదైనా కారణంతో మృతి చెందే రైతుల కుటుంబాలకు భరోసా ఇచ్చేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
తన భర్త సుందరి శ్రీనివాస్ అనారోగ్యంతో మృతి చెందాడు. మాకు ఐదెకరాల సాగు భూమి ఉన్నది. కేసీఆర్ సార్ రైతులకు బీమా ఇచ్చినట్లే కాంగ్రెస్ వారు కూడా ఇస్తారని మూడు నెలల క్రితం ఆన్లైన్ ద్వారా బీమా కోసం దరఖాస్తు చేసుకున్నాం. ఇప్పటి వరకు రాలేదు. అధికారులను అడిగితే రేపు, మాపు అంటున్నారు… మా ఊర్లో ఇంకో ఇద్దరు, ముగ్గురికి కూడా రాలేదు. ప్రభుత్వం వెంటనే మృతి చెందిన రైతు కుటుంబాలకు బీమా సొమ్ము అందేలా చూడాలి.
– సుందరి లింగమ్మ, గరిడేపల్లి