
మిర్యాలగూడ టౌన్, ఆగస్టు 24 : నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని చింతపల్లి క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలు సమీపంలోని కామేపల్లి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు రోడ్డుపై నిలిపిన లారీని ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలివీ.. శ్రీకృష్ణ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సు కామేపల్లి నుంచి సోమవారం రాత్రి 9 గంటలకు 40మందితో హైదరాబాద్‌కు బయల్దేరగా డ్రైవర్ వెంకటేశ్వర్రావు తన క్యాబిన్లో మరో ఐదుగురిని కూర్చోబెట్టుకున్నాడు. అర్ధరాత్రి 2.40గంటల సమయంలో మిర్యాలగూడ సమీపంలో కంటెయినర్ లారీని ఓవర్టేక్ చేస్తూ ఎడమవైపున నిలిపి ఉంచిన లారీని ఢీకొట్టాడు. దాంతో క్యాబిన్లో కూర్చున్న ముగ్గురు వ్యక్తులు కొండేపి గ్రామానికి చెందిన మల్లికార్జున్(40), వినుకొండ మండలం నాగులారం వాసి జయరావ్(42), గుంటూరుకు చెందిన నాగేశ్వర్రావు(44) క్యాబిన్లో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందారు. అదే క్యాబిన్లో చంటిపిల్లలతో కూర్చున్న ఇద్దరు తల్లులు తీవ్రంగా గాయపడగా చంటిపాపలు క్షేమంగా బయటపడ్డారు. మరో 10మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు స్పందించి క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. బస్సు డ్రైవర్ అతి వేగమే ప్రమాదానికి కారణమని వన్‌టౌన్ సీఐ సదనాగరాజు తెలిపారు.
స్పీడ్‌గా వెళ్లొద్దని చెప్పినా వినలేదు
తాపీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాం. రాఖీ పండగ కోసం మా గ్రామానికి వచ్చి తిరిగి హైదరాబాద్ వెళ్తున్నాం. బస్సులో సీటు లేకపోవడంతో డ్రైవర్ క్యాబిన్‌లోనే కూర్చున్నాం. స్పీడ్‌గా వెళ్లవద్దని చెప్పినా వినకుండా అలాగే పోవడం వల్లే ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్ జరిగినప్పుడు మా ఇద్దరు పిల్లలు సీటు కిందకు వెళ్లడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. నా భర్తకు, నాకు గాయాలయ్యాయి.
-అఖిల, కామేపల్లి, ఒంగోలు