
నల్లగొండ, జూన్ 28 : పట్టణ ప్రాంతాల్లో ప్రజావసరాలను తీర్చేందుకే పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో మున్సిపల్ కమిషనర్లతో పట్టణ ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 1 నుంచి 10వరకు ప్రతి వార్డునూ ఒక యూనిట్‌గా తీసుకోని అభివృద్ధి చేయాలని సూచించారు. కౌన్సిలర్‌తోపాటు పర్యవేక్షణాధికారి, పారిశుధ్య సిబ్బంది, మంచినీటి సరఫరా ఉద్యోగితో కమిటీ ఏర్పాటు చేయాలని అన్నారు. మొదటిరోజు వార్డు కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి యువత, మహిళ, సీనియర్ సిటిజన్లు, పుర ప్రముఖులతో 15మంది చొప్పున మరో కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలకు పట్టణ ప్రగతి లక్ష్యాలను వివరించి పదిరోజులపాటు వార్డు అభివృద్ధి కృషి చేయాలని అన్నారు. పారిశుధ్యం, మంచినీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, హరితహారంలో భాగంగా మొక్కలు విరివిగా నాటాలని పేర్కొన్నారు.