నల్లగొండ, అక్టోబర్ 28 : పేదింటి ఆడబిడ్డపెండ్లి చేసుకొని అత్తగారింటికి సంతోషంగా పోవాలే గానీ.. కట్నం బాధతో ఏడుస్తూ మెట్టినింటి గడప తొక్కొద్దనే ఆలోచనతో పెండ్లి పిల్లకు మేనమామలా.. ఆ ఇంటికి పెద్దదిక్కులా మారారు సీఎం కేసీఆర్. ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు ఓసీల్లోని పేదల కల్యాణం కమనీయంగా, సంతోషంగా జరుగాలని ఆడబిడ్డల పెండ్లిళ్లకు కల్యాణలక్ష్మి పేరుతో ఆర్థికం చేస్తున్నారు. తొలుత రూ.50వేలు ఇవ్వగా, కాలానుగణంగా పెండ్లి ఖర్చులు పెరుగడంతో సాయాన్ని రూ.లక్షా116 పెంచి, పెండ్లి కూతురు తల్లికి అందజేస్తున్నారు. ఇలా మునుగోడు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 8,917మంది ఆడబిడ్డలకు రూ.81.80 కోట్ల ఆర్థిక సాయాన్ని కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పేరిట అందించారు.
పేదింటి ఆడబిడ్డల పెండ్లి కానుకగా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఆర్థిక సాయం మునుగోడు నియోజకవర్గంలో 8,917 మందికి అందింది. తొలుత రూ.50వేల లెక్కన ఇచ్చిన సర్కారు, ప్రస్తుతం దాన్ని రూ.లక్షా116కు పెంచింది. ఇప్పటి వరకు నియోజకవర్గం వ్యాప్తంగా రూ.81.80 కోట్లు అందజేసింది. అత్యధికంగా చౌటుప్పల్ మండలంలో 2,077 మంది ఆడబిడ్డలకు రూ.19.23 కోట్లు కల్యాణలక్ష్మి రూపంలో ఇచ్చింది. అత్యల్పంగా మర్రిగూడ మండలంలో 990మందికి రూ.9.80 కోట్ల సాయం చేసింది.
రాష్ట్ర సాధన అనంతరం అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ 2015 నుంచి కల్యాణలక్ష్మి పథకం ప్రవేశపెట్టి, ఆర్థికం సాయం చేయడం మొదలు పెట్టింది. ఈ పథకం మేనిఫెస్టోలో పెట్టకపోయినా పేద వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తొలుత ఎస్సీ, ఎస్టీలకు రూ.50వేలు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆ తర్వాత బీసీలు, మైనార్టీలకు సైతం వర్తింపజేశారు. రూ.50వేల సాయాన్ని లక్షా116 రూపాయలకు పెంచి, ఓసీల్లోని పేద వర్గాలకు కూడా అందించేలా చర్యలు తీసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న తర్వాత ఈ నగదును పెండ్లి కూతురి తల్లి ఖాతాలో జమ చేస్తున్నారు.
పేదింటి ఆడబిడ్డ పెండ్లి ఖర్చు బాధ తీరింది.. తల్లికి తోబుట్టువుగా.. పెండ్లి కూతురికి మేనమామలా సీఎం కేసీఆర్ సర్కారు ఆదుకుంటున్నది. ఆడపిల్ల పెండ్లి చేసుకొని అత్తగారింటికి సంతోషంగా పోవాలె గానీ.. కట్నం బాధతో ఏడుస్తూ మెట్టినింటి గడప తొక్కొద్దనే ఆలోచనతో సీఎం కేసీఆర్ 2015లో కల్యాణలక్ష్మి పథకం ప్రారంభించారు. మొదట ఎస్సీ, ఎస్టీలకు అందించగా.. బీసీలు, మైనార్టీలకు సైతం వర్తింపజేశారు.ప్రారంభంలో రూ.50వేలు ఉన్న సాయాన్ని రూ.లక్షా116కు పెంచారు. షాదీముబారక్ పథకం పెండ్లి కష్టాలు తీర్చడమే కాకుండా రాష్ట్రంలో బాల్య వివాహాల జాఢ్యాన్ని కూడా గణనీయంగా తగ్గించింది. పెండ్లి వయసు వచ్చేంత వరకు బిడ్డలకు చదువు చెప్పించాలనే ఆలోచనకు ఈ పథకం నాంది పలికింది. పథకాన్ని ప్రవేశపెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు పరిశీలిస్తే.. బాల్య వివాహాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. బాలికల విద్య శాతం పెరిగింది. మునుగోడు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 8,917మంది ఆడబిడ్డలకు రూ.81.80 కోట్ల ఆర్థిక సాయం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా అందింది. సీఎం కేసీఆర్ ప్రతి పేద ఇంటికీ పెద్ద దిక్కు కావడంతో ఆయా వర్గాలు నిండు మనస్సుతో దీవిస్తున్నాయి.
పేదింటి ఆడబిడ్డ పెండ్లి తల్లిదండ్రులకు భారం కావద్దని సీఎం కేసీఆర్ భావించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కల్యాణలక్ష్మి ద్వారా పెండ్లి ఖర్చుల కోసం ఆర్థిక సాయం చేస్తూ పెద్ద దిక్కుగా మారారు. ప్రతి పేద ఇంటికీ పెద్ద దిక్కు కావడంతో సీఎం కేసీఆర్ వెంటే ఉంటామని ఆయా వర్గాలు ఘంటాపథంగా చెబుతున్నాయి.
దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలోనూ లేని కల్యాణలక్ష్మి తెలంగాణ ఆడబిడ్డలకు వరం లాంటిది. కేసీఆర్ సారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు అప్పు తేవాల్సిన పని లేదు. అర్హులైన వారందరికీ కల్యాణలక్ష్మి పథకం అందిస్తూ సీఎం సారు పెద్దన్నలా ఆదుకుంటున్నడు. కల్యాణలక్ష్మి పథకం అందుకున్న ఆడబిడ్డల తల్లిదండ్రులంతా టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉంటారు. ఈ మధ్యే మా కూతురు పెండ్లి చేసినం. గవర్నమెంట్ అందించిన రూ.100,116 చెక్కు అందుకున్నం. మేమంతా టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటే ఉంటాం.
– చొల్లేటి సునంద, రత్తిపల్లి, మునుగోడు
పనికి పోతే గానీ పూటగడువని పేదింటి కుటుంబాల్లో ఆడ బిడ్డ పెండ్లి చేయాలంటే ఖర్చుతో కూడుకున్న పని. అలాంటి కుటుంబాల్లో ఆడబిడ్డ పెరిగేకొద్దీ పెండ్లి ఎట్ల చేయాలనే భయం ఉంటుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకం ప్రవేశపెట్టి మాలాంటి పేద కుటుంబాలకు ధైర్యం ఇచ్చింది. కేసీఆర్ సారు ఆడబిడ్డల పెండ్లికి రూ.లక్షా116 ఇచ్చి ఆదుకుంటున్నడు. మమ్మల్ని ఆదుకుంటున్న ఆయన వెంటే మేమంతా ఉంటాం. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి ఓటు వేసి గెలిపించుకుంటాం.
– మోతాల అలివేలు, ముష్టిపల్లి, నాంపల్లి
నాకు ముగ్గురు బిడ్డలు. తెలంగాణ రాకముందు అష్టకష్టాలు పడి పెద్ద బిడ్డ పెండ్లి చేసిన. రెండో బిడ్డ పెండ్లి చేసేందుకు ఇబ్బందులు పడుతుంటే సీఎం కేసీఆర్ తెచ్చిన షాదీముబారక్ పథకం గురించి తెలుసుకున్నా. ఆ డబ్బులు వస్తాయన్న నమ్మకంతో అప్పు చేసి రెండో బిడ్డ పెండ్లి చేసిన. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి చెక్కు అందింది. ఆ డబ్బులతో అప్పు తీర్చేసిన. మా కుటుంబాన్ని ఆదుకున్న సీఎం కేసీఆర్ సాయం మరువలేనిది. జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటాం.
– షేక్ కాసీంబీ, కాశివారిగూడెం, మునుగోడు
మాది చండూరు మండలం తుమ్మలపల్లి. మాకు ఊళ్లో గుంట భూమి లేదు. నాకు ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు. బతుకుదెరువు కోసం పట్నం పోయి పెద్దపెద్దోళ్ల ఇండ్లళ్ల వంటలు చేసేదాన్ని. చాలా కాలం కిందటే పెద్ద బిడ్డ, కొడుకు పెండ్లి చేసిన. చిన్న బిడ్డ పెండ్లి చేయాలనుకున్నప్పుడు మా ఆయన ఆరోగ్యం సరిగా లేకుండె. నా కొడుకు చిన్న చిన్న పనులు చేసేవాడు. బిడ్డ పెండ్లి ఎట్ల చేయాలా? అని బాధపడేటోళ్లం. కల్యాణలక్ష్మి కోసం దరఖాస్తు పెట్టుకున్నం. ఎలాంటి పైరవీ చేయలేదు. అధికారులు మా గ్రామానికి వచ్చి రూ.1,00,116 చెక్కు ఇచ్చిండ్రు. ఆడబిడ్డ పెండ్లికి గవర్నమెంటోళ్లు పైసలియ్యడం సంతోషంగా ఉంది.
మాది గట్టుప్పల్ గ్రామం. చేనేతపై ఆధారపడి జీవిస్తున్నాం. ఇటీవల మా పెద్ద బిడ్డ పెండ్లి చేసినం. ఆర్థికంగా లేని మేము కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నాం. దాంతో ప్రభుత్వం నుంచి మాకు రూ.1,00,116 కల్యాణలక్ష్మి చెక్కు అందింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మా కుటుంబాన్ని పెద్దన్నగా ఆదుకుండు. అంతేకాకుండా మా చేనేత కుటుంబాలను సైతం అన్ని ఆదుకుంటున్నరు. అందుకే మేమంతా ఏకపక్షంగా సీఎం కేసీఆర్ సారు వెంటే ఉంటాం.
– కుకుడాల పారిజాతం, గట్టుప్పల్
మాది చండూరు గ్రామం. నాకు ముగ్గురు బిడ్డలు. పెద్ద బిడ్డ పెండ్లి చేసినప్పుడు రూ.50,016, రెండో బిడ్డ పెండ్లికి రూ.లక్షా116 కల్యాణలక్ష్మి కింద వచ్చినయి. మూడో బిడ్డ పెండ్లికి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ సారే ఉంటే బాగుండు అనుకుంటున్నా. నాలాంటి పేదలకు కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సాయం అందడం ఆనందంగా ఉంది. ప్రభుత్వం అందించే డబ్బు ఎంతో భారం తీర్చింది. మళ్లీ కేసీఆర్ సారే ముఖ్యమంత్రి కావాలి. మునుగోడు ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేస్తా.
– ఈదులకంటి యాదయ్య, చండూరు
నాకు ఇద్దరు బిడ్డలు. మేంరెడ్డిలమైనా ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం. పెద్ద బిడ్డ పెండ్లి చేసినప్పుడు అప్పటి ప్రభుత్వాల నుంచి సాయం అందలేదు. చిన్న బిడ్డ పెండ్లి చేసినప్పుడు టీఆర్ఎస్ సర్కారు కల్యాణలక్ష్మి పథకం కింద లక్షా116 రూపాయలు అందజేసింది. ప్రభుత్వ సాయంతో పెండ్లి ఖర్చుల భారం తగ్గింది. ఏది ఏమైనా ఆడబిడ్డ పెండ్లికి సాయం చేయాలనే సీఎం కేసీఆర్ సారు ఆలోచన ఎంతో గొప్పది. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం.
– దుగ్గింపుడి జయరాజ్రెడ్డి, నేవిళ్లగూడెం